జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక వాదనలు, వివాదాలు

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, గతంలోనే అమరావతిలో కృష్ణా నది వద్ద 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తలచారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే ఆయన సీఎం కుర్చీ దిగారు. ఇక ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు అమరావతి కాదని విజయవాడను ఎంచుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటుపై కొన్ని పక్షాల నుంచి వివాదాలు మొదలయ్యాయి. 

స్వరాజ్ మైదానం విజయవాడ లోని అతి పెద్ద మైదానం. రాజకీయ పార్టీల మీటింగులకైనా, ఎగ్జిబిషన్ల కైనా, విజయవాడ నగరానికి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నా స్వరాజ్య మైదానంలోనే ఇప్పటి వరకు జరుగుతుండేవి. ఆ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేస్తే.. పెద్ద మైదానం పోతుందని దాని అవసరం వస్తే ఎక్కడికి వెళ్లాలని విజయవాడలో కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు కూడా సీఎం జగన్ కి లేఖ రాశారు. ఈ విగ్రహ ఏర్పాటు అమరావతిలోనే చేయాలని, రాజధాని సంకల్పం బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను గతంలోనే ఈ స్వరాజ్ మైదాన్ (పిడబ్ల్యుడి గ్రౌండ్స్) విషయమై కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే పరోక్షంగా ఈ నిర్ణయంపై మళ్లీ తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా సీఎంకు ఒక హెచ్చరిక జారీ చేశారు.

మరో వైపు, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 200 కోట్లు నిధులు కేటాయించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా 200 కోట్లు కేటాయించి విగ్రహం నెలకొల్పడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ అయితే తాము తలపెట్టినట్లు కృష్ణానది మధ్యలో ఇలా అంబేద్కర్ విగ్రహం పెద్దది నెలకొల్పితే ఆకర్షణీయంగా ఉంటుందని, రాజధాని అమరావతికి కూడా అద్భుతమైన కట్టడంగా నిలుస్తుందని చెబుతోంది. ఇలా జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక రకమైన వాదనలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కలేదు కానీ ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే మళ్లీ ఎప్పటిలాగానే వ్యతిరేక తీర్పు వస్తుందా లేక అనుకూల తీర్పు వస్తుందా అనేది చర్చగా మారుతుంది.