ఓడే పందెంకోడి అంబటి!

 

Ambati Rambabu will get ticket, Ambati Rambabu, ysrcongress, 2014 elctions, jagan mohan reddy

 

 

ఉపయోగపడినంత వరకు ఉండనీయ్... పనికిరాడనుకుంటే బయటకి తరిమేయ్.. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ఇప్పటికే చాలా మంది నాయకులను ఆ పార్టీ బయటకి సాగనంపింది. ఆమధ్య జగన్-సోనియాగాంధీకి వున్న అండర్‌స్టాండింగ్ విషయంలో నోరుజారిన ఎంపీ సబ్బం హరికి జగన్ పార్టీ జెల్ల కొట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినప్పటికీ జగన్‌కి బాహాటంగా మద్దతు పలికిన సబ్బం హరికి జగన్ చెల్లుచీటీ రాస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ అలా జరిగిపోయింది. ఎవరూ ఊహించని దానిని చేయడమే జగన్ సార్ అపజయ రహస్యం.

 

నిన్నగాక మొన్న కొండా సురేఖమ్మని కూడా పార్టీ వదలిపోయేలా పొగపెట్టారు. పార్టీలో హెరాస్‌మెంట్ తట్టుకోలేక కొండా సురేఖ వైసీపీకి గుడ్ బై కొట్టేసింది. జగన్ పార్టీ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న కొండా సురేఖకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చివరికి దక్కిన గౌరవం అది! పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన వాళ్ళకి జరుగుతున్న అవమానాలను చూస్తున్న సీనియర్ నాయకులు తమకి కూడా ఆ గతి ఎప్పుడు పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో  త్వరలో పడబోయే వికెట్ అంబటి రాంబాబుదేనని తెలుస్తోంది.



పసలేని పార్టీ విధానాలను పెద్ద గొంతుతో వినిపించే అంబటి రాంబాబుని గతంలో జగన్ కొంతకాలం కంట్రోల్‌లో పెట్టాడు. పార్టీలో తనకంటే ఎదిగిపోతున్న అంబటిని చాలావరకు అదుపుచేశాడు. అయితే అంబటి కంటే గట్టి వాయిస్ పార్టీలో లేకపోవడంతో ఆయన ‘సేవలు’ తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించుకుంటున్నాడు. అంబటి వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నాడు. సత్తెనపల్లి ఏరికోరి సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ పదవి కూడా తీసుకున్నాడు. అయితే ఆ నియోజకవర్గంలో జగన్ సర్వే జరిపిస్తే ఆ నియోజకవర్గంలో అంబటి ఆరు నూరైనా గెలవడని రిపోర్ట్ వచ్చింది. దాంతో వచ్చే ఎన్నికలలో అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఖరారైపోయింది.




అంబటి మాత్రం నత్తెనపల్లి విషయంలో రాజీపడటం లేదు. ఈ నేపథ్యంలో అంబటి పార్టీని వీడటం కానీ, ధిక్కార స్వరం వినిపిస్తున్న అంబటిని పార్టీ నుంచి తొలగించడం గానీ జరగడం ఖాయమని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పందెంలో గెలవని కోడిని ఎలా బలి చేసేస్తారో అంబటి కూడా త్వరలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీడలో వుండి, ఎన్నికలలో టిక్కెట్లు ఆశిస్తున్న అందరి నియోజకవర్గాల్లో జగన్ సర్వే చేయించాడట. తప్పకుండా గెలుస్తారని రిపోర్ట్ వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లిచ్చి, గెలవరని తెలిసిపోయిన వారిని పార్టీ నుంచి సాగనంపాలని జగన్ డిసైడ్ అయ్యాడట. తమకు టిక్కెట్ రాదని అర్థం చేసుకున్న చాలామంది వైసీపీ నాయకులు పార్టీ నుంచి సైడైపోవాలని అనుకుంటున్నారట.