మోదీ సర్కారుకి పరీక్ష- అమర్‌నాథ్‌ యాత్ర

 

ఈసారి అమర్‌నాథ్‌ యాత్ర ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా ఉంది. అందుకు కారణం లేకపోలేదు! కశ్మీర్‌లోయలో ఈమధ్యకాలం మిలిటెంట్ల దాడులు పెరిగిపోతున్నాయి. వాటికి తోడు స్థానికులలోనూ అసహనం పెచ్చరిల్లిపోతోంది. తమ ఉనికిని నిరూపించుకోవాలని ఉగ్రవాదులు, వాటిని నిలువరించి పరువు కాపాడుకోవాలని మోదీ సర్కారు పట్టుదలతో ఉన్నాయి. ఈ రెండు వర్గాలూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు అమర్‌నాథ్‌ యాత్ర వేదిక కానుంది.

అమర్‌నాథ్‌కు వచ్చే యాత్రికుల మీద దాడులు కొత్తేమీ కాదు. అయితే 2002 తర్వాత చాలావరకు ఇది తగ్గుముఖం పట్టాయి. తిరిగి 2017.. అంటే క్రితం ఏడాది ఒక బస్సు మీద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు యాత్రికులు చనిపోయారు. కాకపోతే అప్పట్లో కశ్మీరులో పీడీపీ ప్రభుత్వం ఉండటంతో, నింద అంతా ఆ ప్రభుత్వం మీదకే వెళ్లిపోయింది. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు- బీజేపీ, పీడీపీల మధ్య విబేధాలు రావడంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇప్పుడు అక్కడ గవర్నర్ పాలన నడుస్తోంది. కాబట్టి ఏం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది.

పరిస్థితులు ఇంత సున్నితంగా ఉన్నా కూడా, అమర్‌నాథ్‌ గుహలోని మంచులింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు కొదవ లేకపోవడం విశేషం. ఈసారి రెండు లక్షలమందికి పైగా భక్తులు, మంచులింగాన్ని చూసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంతమంది జీవితాలకు భద్రత కల్పించడం అంటే ఏమంత తేలికైన విషయం కాదు. అందుకే వివిధ రక్షణ దళాలకు చెందిన 40 వేల మందిని ప్రభుత్వం నియమించింది. దీనికి తోడు అమర్‌నాథ్‌కు వెళ్లే ప్రతి వాహనం కదలికలనీ పసిగట్టేందుకు జీపీఎస్ ట్రాకింగ్‌ను ఉపయోగిస్తోంది. యాత్రికులకు తోడుగా పోలీసులు కూడా మోటర్‌సైకిళ్ల మీద అనుసరిస్తున్నారు.

అమర్‌నాథ్‌ యాత్ర దాదాపు రెండు నెలల పాటు కొనసాగనుంది. ఈ సమయం నిజంగా మోదీ ప్రభుత్వానికి పరీక్షా కాలమే! అసలే సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ఊదరగొట్టేస్తోంది. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అది ప్రభుత్వానికి ఓ మచ్చగా మిగిలిపోతుంది. పైగా ఈ ఏడాది చివరికల్లా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అమర్‌నాథ్‌లో ఏం జరిగినా కూడా ఆ ప్రభావం సదరు ఎన్నికల మీద పడే అవకాశమూ ఉంది. మరి ఏం జరగనుందో ఆ శివుడికే ఎరుక!