హిందూ ప్రయాణీకుల్ని కాపాడిన ముస్లిమ్ డ్రైవర్!

సోషల్ మీడియా వచ్చాక మంచి ఎంత జరుగుతోందో… చెడూ అంతే జరుగుతోంది! ఒక విషయం ప్రచారంలోకి వచ్చాక అది నిజమైనా , కాకున్నా ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో వుండటం లేదు. తమకు నచ్చితే, తమకు లాభం అనుకుంటే, తమ ఇగో హ్యాపీ అయితే షేర్ చేసేస్తున్నారు! దీని వల్లే చాలా తప్పుడు సమాచారాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. తాజాగా అమర్ నాథ్ యాత్రా ప్రయాణీకులపై ఉగ్రవాదుల దాడి కూడా ఇలాగే సోషల్ మీడియా చర్చకి దారి తీసింది. అయితే, తప్పుడు దిశలో సాగిన ఓ ప్రచారం సోషల్ మీడియా విచ్చలవిడి కోణాన్ని మరో సారి ఆవిష్కరించింది…

 

అమర్ నాథ్ యాత్ర చేస్తోన్న దాదాపు 50 మంది శివ భక్తులు బస్ లో వెళుతుండగా ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏడుగురు చనిపోగా చాలా మంది గాయపడ్డారు. కాని, ఒక్క బుల్లెట్ కూడా తగలని డ్రైవర్ ఎంతో సాహసంతో, చాకచక్యంగా బస్ ను ఆపకుండా ముందుకు తోలాడు. అదే ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. లేకపోతే మనం ఊహించలేని విషాదం చోటు చేసుకునేది. కాని, అంత మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ సలీమ్ సోషల్ మీడియాలో మాత్రం కొందరి అనుమానాలకి గురి కావాల్సి వస్తోంది.

 

ఫేస్బుక్ లో సలీమ్ పై నానా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఆయన ముస్లిమ్ అయినా హిందువులందర్నీ కాపాడాడని అంటుంటే.. కొందరు మాత్రం ఒక్క బుల్లెట్ కూడా తాకకుండా ఎలా తప్పించుకున్నాడని అడుగుతున్నారు. అలాగే, ఉగ్రవాదుల దాడికి ముందు డ్రైవర్ టైర్ పంక్చర్ అంటూ రెండు గంటలు బస్ ను ఆపేశాడని కొందరు చెబుతున్నారు. అందువల్లే ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా సలీమ్ నడిపిన బస్ ప్రయాణించాల్సి వచ్చిందంటున్నారు. మొత్తంగా వారి ఉద్దేశంలో సలీమ్ ఉగ్రవాదులు దాడి చేసేందుకు అనుకూలంగా వ్వవహరించాడని భావం! దీనికి బలమైన ఆధారాలు ఏవీ లేవు!

 

ఇక మరికొందరు నెటిజన్స్ బస్ లో డ్రైవర్ తో పాటూ వున్న బస్సు ఓనర్ కొడుకు గురించి ప్రస్తావిస్తున్నారు. అతడు డ్రైవర్ పక్కనే వుండి వాహనాన్ని ఆపనీయలేదనీ… తనకు మూడు బుల్లెట్లు తాకినా డ్రైవర్ సలీమ్ ను నడుపుతూనే వుండమని చెప్పాడని అంటున్నారు. ఈ విషయం సలీమ్ కూడా ఒప్పుకున్నాడు. అతని వల్లే తాను ఆపకుండా ముందుకు పోనిచ్చానని అన్నాడు. కాని, కొందరు సోషల్ మీడియా యూజర్స్ మాత్రం క్రెడిట్ అంతా బస్ ఓనర్ కొడుకు హర్ష్ దేశాయ్ కే దక్కాలంటున్నారు.

 

సలీమ్ నిజంగా ఉగ్రవాదులతో కుమ్ముక్కై వుంటాడా? ఇది దాదాపు అసాధ్యమైన పిచ్చి ఊహా. అలా జరిగే అవకాశం వుంటే వుండొచ్చేమోగాని… ఇప్పటి వరకూ ఒక చిన్న ఆధారం కూడా ఆ దిశగా దొరకలేదు. అందుకే, గుజరాత్ సీఎం స్వయంగా సలీమ్ ని మెచ్చుకుని అతడికి బ్రేవరీ అవార్డ్ వచ్చేలా చూస్తానని చెప్పారు. అయినా కూడా కేవలం ఆ డ్రైవర్ … ముస్లిమ్ కాబట్టి అతడ్ని అనుమానించటం న్యాయం అనిపించుకోదు. కాబట్టి అనుమానాలు పక్కకు పెట్టి ఎందరో ప్రాణాలు కాపాడిన బస్ డ్రైవర్ ని అభినందించాల్సిందే! ప్రభుత్వం, నిఘా వర్గాలు సలీమ్ నేపథ్యంపై ఆరా తీస్తే అది మరింత మంచిది…