అమరావతి మీద వాటర్ బాంబ్


 

అందరి కన్నూ అమరావతి మీదే... అందరి కామెంట్లూ అమరావతి మీదే. అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఏదో ఘోరం జరిగిపోతుందని బెదిరించేవాళ్ళు ఈమధ్యకాలంలో ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ బెదిరింపుల లిస్టులోకి మరో పెద్దాయన చేరారు. ఆయన ఎవరో కాదు... వాటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘నదుల అనుసంధానం’ అనే టాపిక్ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని నదులను అనుసంధానించడం వల్ల నీటి సమస్య తీరి, దేశం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం విషయంలో  ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారు. గోదావరి, కృష్ణ నదులను విజయవంతంగా అనుసంధానం చేయడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ కూడా నదుల అనుసంధానం దేశానికి అవసరమని భావిస్తున్నారు. దీనికోసం ఆయన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ పేరిట కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

 

వాటర్ మాన్ ఆఫ్ ఇండియా నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించిన కామెంట్లు చేస్తూ పనిలోపనిగా అమరావతి మీద కూడా వాటర్ బాంబ్ వేసేశారు. నదుల్లో ఇసుక తవ్వకాలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోరుగానీ, నదులను మాత్రం అనుసంధానం చేస్తామని అంటారని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఆయన విమర్శల బాణాలు సంధించారు.  నదుల అనుసంధానానికి జగ్గీ వాసుదేవ్ చేస్తున్న ఉద్యమం ఒక కుట్ర అని రాజేంద్రసింగ్ అంటున్నారు. దీని వెనుక కార్పొరేట్, రాజకీయ లాబీ వుందని ఆరోపించారు.

 

రాజేంద్రసింగ్ నదుల అనుసంధానం మీద కామెంట్లతో సరిపెట్టుకోలేదు. ఆయన విమర్శలను అమరావతి మీద కూడా కురిపించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తే అది భవిష్యత్తులో వరదల్లో కొట్టుకుపోతుందని సెలవిచ్చారు. నదీ పరివాహక ప్రాంతం కంటే అమరావతి ఏడు మీటర్లు దిగువకు వుందని వివరించారు. అలాగే నది మధ్యలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసుకోవడం చట్ట విరుద్ధమని కూడా అన్నారు. నదుల అనుసంధానం మీద, అమరావతి నిర్మాణం మీద రాజేంద్రసింగ్ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. రాజేంద్రసింగ్ గురించి తెలిసినవాళ్ళు మాత్రం ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేసి వార్తల్లో నిలవడం రాజేంద్రసింగ్‌కి అలవాటేనని అంటున్నారు.