ఒక పరాజయం 100 తప్పులు.. బాబుకి రాజయోగం దూరం చేసిన రాజధాని!!

 

"పేరు గొప్ప.. ఊరు దిబ్బ" అనే సామెత వినే ఉంటారు. ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన బాబు.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని.. అమరావతిని ఓ సింగపూర్, ఓ జపాన్ చేసి చూపిస్తానని చెప్పారు. దీంతో రాజధానిపై ఏపీ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాబు ఆ అంచనాలు అందుకోలేకపోయారు. దీంతో టీడీపీ ఓటమిలో రాజధాని కూడా ఓ కారణంగా మిగిలిపోయింది.

తాత్కాలిక భవనాలు పేరిట పలు భవనాలు నిర్మించారు. అయితే వాటి నిర్మాణం కూడా నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న ఇంజినీర్లని కాదని విదేశాల నుండి ఇంజినీర్లను తెప్పించారు. పోనీ వారితో అయినా పూర్తిగా డిజైన్లు చేయించారా అంటే అదీ లేదు. వాస్తు నిపుణులను, సినీ దర్శకులను రాజధాని డిజైన్లలో భాగమయ్యేలా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలో సెట్లు బాగున్నాయి కదా అని రాజధానికి డిజైన్లు గీయండి అని అడిగేసరి.. బాబుపై సెటైర్లు వచ్చాయి. దానికి తోడు వాస్తు ఒకటి. అసలు రాజధాని నిర్మాణంలో వాస్తు ఏంటి?. ఇంజినీర్లు అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్ చేస్తారు. అంతేకాని వాస్తు పేరిట ఎవరో వచ్చి అక్కడ ఇది, ఇక్కడ అది అని ఏదేదో చెప్తుంటే ఇక ఇంజినీర్లు డిజైన్లు ఏం చేస్తారు?.

ఒకవేళ బాబు రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతిని ఎంతలా అభివృద్ధి చేసేవారో తెలీదు కానీ.. మొదటి టర్మ్ లో మాత్రం డిజైన్ పేరిట కాలయాపన చేసారని, గ్రాఫిక్స్ రాజధాని అని.. అసలు అది అమరావతి కాదు భ్రమరావతి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు రాజధాని భూములు విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పి కొట్టడంలో బాబు & కో విఫలమయ్యారు. మరోవైపు విపక్షాలు.. అమరావతి అంతా భ్రమరావతి అని, అసలు ఒక్క ఇటుక కూడా పడలేదని పదేపదే విమర్శలు చేసాయి. ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మొత్తానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానన్న బాబు.. ఏమీ చేయలేదన్న పేరు మూటగట్టుకొని పరాజయం పాలయ్యారు.