అయ్యో టీడీపీ.. అవంతి బాటలో మరో ఎంపీ!!

 

టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎప్పుడు ఏ నేత పార్టీని వీడతారో అర్థంగాక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్ పార్టీని వీడారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు అవంతి బాటలో మరో ఎంపీ కూడా పార్టీని వీడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోనసీమకు రైలును తీసుకువచ్చే విషయంపై కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఎంపీ పండుల రవీంద్రబాబు. అయితే అందుకు టీడీపీ అధినాయకత్వం సహకరించడం లేదని ఆయన సన్నిహితులవద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో తనకు గుర్తింపు లేకుండా టీడీపీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని తాను ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరోవైపు వైసీపీ సైతం టీడీపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రకటించింది. తాజాగా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టం చేశారు. అవంతి శ్రీనివాస్ తోపాటు మరో ఎంపీ కూడా వైసీపీలో చేరబోతున్నారని తెలిపారు. ఆ విషయం టీడీపీకి కూడా తెలుసునని సెటైర్ వేశారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారు అనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.