వాసన పీలిస్తే అల్జీమర్స్‌ బయటపడుతుంది

 


అల్జీమర్స్- మనిషి బతికుండగానే అతని జ్ఞాపకశక్తిని హరించివేసే మహమ్మారి రోగం. తన జ్ఞాపకాలనే కాదు, భాషని సైతం మర్చిపోయేలా చేసే శాపం. వైద్య విజ్ఞానం ఇంతగా ఎదిగినా కూడా ఇప్పటికీ అల్జీమర్స్ ఎందుకు వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. దానికి నివారణ కానీ చికిత్స కానీ చేయలేకపోతున్నారు.

 

భారత దేశంలో ఒకప్పుడు అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనూ అల్జీమర్స్ బారినపడేవారి సంఖ్యలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఏటా లక్షలాది మంది భారతీయులు అల్జీమర్స్‌కి లోనవుతున్నట్లు తేలింది. ప్రతి ఇరవై ఏళ్లకీ ఈ సంఖ్య రెట్టింపు అవుతోందనే అంచనాలూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్జీమర్స్ గురించి భయాన్ని రేకెత్తించే విషయాలే! కానీ పెన్సిల్వేనియాకు చెందిన కొందరు పరిశోధకుల ప్రయోగంతో అల్జీమర్స్‌ను అతి చవకగా, తేలికగా ముందస్తుగానే కనుగొనే అవకాశం చిక్కింది.

 

అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన సమస్యలు సాధారణంగా 60 ఏళ్లు పైబడిన తరువాతే కనిపిస్తాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. అలాగని అల్జీమర్స్‌ సోకే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తిద్దామా అంటే... అది అత్యంత ప్రయాసతో కూడుకున్న ప్రక్రియ. మెదడు మీద నానారకాల ప్రయోగాలు చేస్తేకానీ అల్జీమర్స్‌ను ముందుగా గుర్తించడం కష్టం. అందుకే వాసన పీల్చడం ద్వారా అల్జీమర్స్‌ లక్షణాలను ముందుగా గుర్తించే అవకాశం ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అల్జీమర్స్ సోకే వ్యక్తులలో ఘ్రాణశక్తి నిదానంగా తగ్గిపోతుంటుందని ఇదివరకే తేలిపోయింది.
ప్రయోగంలో భాగంగా పరిశోధకులు 728 మంది వృద్ధులను ఎన్నుకొన్నారు. వారిని 16 రకాల వాసనలను గుర్తుపట్టమన్నారు. ఈ పరీక్షకు తోడుగా వారి జ్ఞాపకశక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘కాగ్నిటివ్‌ టెస్ట్‌’ని కూడా నిర్వహించారు. వాసన పీల్చే పరీక్ష ద్వారా దాదాపు 90 శాతం సందర్భాలలో అల్జీమర్స్ దాడిని ముందస్తుగానే గ్రహించగలిగారు.

 

ఇంతకీ అల్జీమర్స్‌ని దాడిని సులువుగా పసిగడితే ఏంటి ఉపయోగం అన్న సందేహం రావడం సహజం. అల్జీమర్స్‌ను నివారించేందుకు కానీ చికిత్స చేసేందుకు కానీ ఎలాంటి మందులూ లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఈ వ్యాధి సోకనుందని తేలితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు. మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, జీవనశైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం, ధ్యానంలో నిమగ్నం కావడం వంటి చర్యలతో అల్జీమర్స్ దూకుడు తగ్గుతుంది. పైగా ఇలాంటి వ్యక్తులను చుట్టుపక్కలవారు కూడా కాస్త జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండే అవకాశం దక్కుతుంది.

 

ఇక మీదట మీకు అల్జీమర్స్ సోకనుందేమో అన్న అనుమానం కలిగితే, వైద్యలు ఓ నాలుగు రకాల పూలని వాసని పీల్చి చూడమని అడిగే అవకాశం లేకపోలేదు. ఇంతేకాదు! ముక్కులోంచి స్రవించే ద్రవాలను విశ్లేషించడం ద్వారా కూడా అల్జీమర్స్‌ను ముందుగా గ్రహించే ప్రయోగాన్ని కూడా మొదలుపెట్టారు పరిశోధకులు.

 

 

 - నిర్జర.