మహాకూటమిలో కుమ్ములాట

 

తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఉమ్మడి ఎన్నికల ముసాయిదా కూడా సిద్ధమైంది.కానీ పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు.తెరాస పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది.బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడికి అందించారు.టీడీపీ,తెజస,సీపీఐ పార్టీలు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తులో సీట్ల సర్దుబాటుపై తేల్చకుండా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టింది.దీంతో కాంగ్రెస్ వ్యవహారశైలిపై తెజస అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 48 గంటల్లో సీట్ల సర్దుబాటుపై తేల్చండి అంటూ అల్టిమేటం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.టీటీడీపీ అధ్యక్షుడు రమణ తొందరపడొద్దని సూచించటంతో శాంతించారు కోదండరాం.

రోజు రోజు ఎన్నికల సమయం దగ్గర పడుతూనే ఉంది.కానీ భేటీలకు గంటల సమయం వెచ్చించినా పార్టీల మధ్య పొంతన కుదరట్లేదు.ఒకప్పుడు నాలుగు పార్టీల ముఖ్య నేతలు కూర్చొని చర్చించుకునేవారు.కానీ కొన్ని రోజులు క్రితం కాంగ్రెస్,తెజస నేతలు మాత్రమే భేటీ అయ్యారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు.భేటీ అనంతరం మాట్లాడిన కోదండరాం కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని,తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రమణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ... కూటమి అన్నాక అనేక సమస్యలుంటాయని, రెండు మూడు రోజుల్లో అన్నీ సమసిపోతాయన్నారు. అలాగే మహాకూటమి మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని విమర్శించారు.రమణతో ఎన్నికల వ్యూహంపై చర్చించామని, కూటమిని ఏర్పాటు చేసింది సీపీఐ, టీడీపీలేనన్నారు.

కలిసి ఉన్న పార్టీలు విడి విడిగా సమావేశం అవ్వటం ఏంటా అని సర్వత్రా చర్చగా ఉండగా ఎవరికి వాళ్ళు సమావేశ అనంతరం పొత్తులు అన్నాక సమస్యలు ఉంటాయి ,తొందర్లోనే సర్దుకుంటాయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరి ఎత్తుడలు వాళ్ళు వేసుకుంటున్నారని తెలుస్తుంది.కూటమి  ఏర్పాటు చేసింది మేమే అంటున్న సీపీఐ, టీడీపీ లు సీట్ల కోసం కాంగ్రెసుపై ఆధారపడాల్సిన పరిస్థితి.కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితాపై ఓ అవగాహనకి వచ్చింది.అలానే ఇంకా పార్టీ గుర్తు కూడా రాని తెజస కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించగలం అనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే  సీపీఐ, టీడీపీ పార్టీలు తమ సత్తా చాటేందుకు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చినట్టు సమాచారం.

ఒకవేళ పొత్తులో పొంతన కుదరక ఎవరి దారి వాళ్ళది అయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి లేదు.ఎలాగో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసింది కాబట్టి ప్రతి నియోజక వర్గంలో అభ్యర్థిని నిలబెట్టగలదు.అసలు పొత్తుపై క్లారిటీ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సుముకంగా లేదోమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వాళ్ళు అడిగినన్ని సీట్లు ఎలాగో ఇవ్వలేం కాబట్టి,కొన్నాళ్ళు పొత్తుపై నాంచితే అప్పటికప్పుడు మిగతా పార్టీలు ధైర్యం చేసి పొత్తు నుంచి బయటకి వెళ్లి అభ్యర్థులను ప్రకటించలేవనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం.