చొప్పదండి తలనొప్పి రాజకీయం.. వ్యక్తిగత విమర్శలతోనే కాలం గడిపేస్తున్నారు

 

కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి. 

రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది. 

మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.