టీడీపీ, బీజేపీలే టార్గెట్!

 

all party meet on Telangana, Congress Core Group, Congress, tdp, bjp, telangana state, Sushilkumar Shinde

 

 

రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి, కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల చెవుల్లో ఎలాగైతే పూలు పెట్టి ‘‘అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుంటాం’’ లాంటి స్టేట్‌మెంట్లు ఇప్పించి వాళ్ళంతా ఎలా ఇరుక్కుపోయేలా చేసిందో, అదే వ్యూహాన్ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల విషయంలో కూడా ప్రయోగించబోతోంది.  పదకొండు అంశాలను రూపొందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాటి మీద అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటుందట.



అసలు ఈ సమావేశానికి ఏ పార్టీ అయినా హాజరై ఒక్క అంశానికి సమాధానం ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టే అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఈ అఖిలపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా చేసుకుందని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రాజకీయంగా లాభం పొందే అవకాశం ఉన్నందువల్ల భారతీయ జనతాపార్టీ తెలంగాణ డిమాండ్ నుంచి పక్కకి తప్పుకుని సీమాంధ్రకు చేరువయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.



అలాంటిదేదైనా జరిగితే బీజేపీకి సీమాంధ్రలో స్థానం లేకుండా చేయడమే ఈ రెండో అఖిలపక్షం ఉద్దేశమని భావిస్తున్నారు. రాజకీయంగా సన్నిహితమవుతున్న తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలను పెంచేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని ఉపయోగించుకునే అవకాశం వుందంటున్నారు. మొత్తంమీద విభజన యజ్ఞం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ యజ్ఞంలో టీడీపీ, బీజేపీలను సమిధలుగా చేయాలని ప్రయత్నిస్తోంది. మరి ఆ రెండు పార్టీలు ఈ ప్రయత్నాలను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.