వయసులో తాగితే జీవితాంతం అనుభవించాల్సిందే!


ఒకప్పుడు తాగుడు అలవాటు 30 ఏళ్లు దాటినవారిలోనే కనిపించేది. ఒకేవేళ కుర్రతనంలో తాగినా, సమాజానికి భయపడుతూ ఓ నాలుగు చుక్కలు పుచ్చుకునేవారు. ఇప్పుడలా కాదు! కుర్రకారు మద్యం మత్తులో కూరుకుపోతున్నారు. కళ్లు బైర్లు కమ్మిపోయేంతగా తాగి కార్లు నడుపుతున్నారు. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లోనే వేలమంది కుర్రకారు పట్టుబడుతుంటే ఇక ఇంటిపట్టునో, బారుమాటునో పీపాలకి పీపాలు లాగించేవారి సంగతి చెప్పేదేముంది. ఇలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడో పరిశోధన వెలుగులోకి వచ్చింది.

 

తాగితే దీర్ఘకాలిక సమస్యలే

కొంతకాలం పాటు తాగి మానేసినవారు పూర్తి ఆరోగ్యవంతులుగా మారిపోతారని ఇప్పటివరకూ నమ్మేవారు. ఈ నమ్మకంలో ఎంతవరకు నిజం ఉందో తేల్చేందుకు పరిశోధకులు ఒక 600 మంది మాజీ సైనికుల అలవాట్లను గమనించారు. వీరిలో 30 ఏళ్లలోపు తెగ తాగేసి తరువాత మానేసినవారు ఎంతమంది ఉన్నారో పరిశీలించారు. ఆ తరువాత కాలంలో మిగతావారితో పోలిస్తే వీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలని గమనించారు.

 

 

సమస్యలు ఖాయం

యవ్వనంలో విపరీతంగా తాగి, ఆ తరువాత కాలంలో మానేసిన వారు 60 ఏళ్లు చేరుకున్నాక ఏవో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడినట్లు తేలింది. ఓ 44 రకాల వ్యాధుల జాబితాలో మద్యపానం అలవాటు లేనివారికి ఓ రెండు వ్యాధులు ఉంటే, మందు పుచ్చుకొని మానేసినవారిలో సగటున మూడు వ్యాధులు కనిపించాయట. ఇక వీరు డిప్రెషన్‌తో క్రుంగిపోయే అవకాశం అయితే రెట్టింపు ఉన్నట్లుగా తేలింది.

 

కారణం

తాగుడు వల్ల మెదడులో నిర్ణయాలు తీసుకోవడం, స్వీయనియంత్రణ కలిగి ఉండటాన్ని ప్రభావితం చేసే భాగాలు దెబ్బతింటాయని తేలింది. దీని వలన మనిషి సిగిరెట్‌ వంటి ఇతరత్రా వ్యసనాలకు బానిస కావడం, ఆహారం మీద అదుపు లేకపోవడం వంటి అనారోగ్య జీవనశైలిని గడుపుతూ ఉంటాడు. పైగా తాగడం వల్ల మన శరీరం మీదా మెదడు మీదా ఎలాంటి ప్రభావాలు ఉంటాయన్నదాని మీద ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. కానీ మనం ఊహిస్తున్న దానికంటే, శరీరం మీద తాగుడు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఈ పరిశోధన రుజువు చేస్తోంది.

 

తస్మాత్‌ జాగ్రత్త

వయసులో ఉండగా తాగడం సహజమే! అనే అభిప్రాయం నుంచి ఇటు కుర్రకారు, అటు వారి తల్లిదండ్రులు కూడా తప్పుకోవాలి. జీవితంలో ఏ దశలో అయినా మద్యపానం క్షేమం కాదు, దాని తాలూకు ప్రభావమూ తాత్కాలికం కాదు అన్న నిజాన్ని గ్రహించాలి. ఇక తాగుడు మానేసినవారు తమ జీవనశైలి విషయంలో కూడా మార్పులు చేయాలి. తగినంత వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఇతరత్రా వ్యసనాల జోలికి పోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

 

- నిర్జర.