మందు కొడితే మగతనం పెరుగుతుందా?

 

పరిశోధనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు కాఫీ మంచిదని ఓ పరిశోధన చెబుతుంది. సరే మంచిదే కదా అని ఓ లోటాడు కాఫీ తాగేందుకు సిద్ధపడిపోతే... మర్నాడే కాఫీ మంచిది కాదని ఇంకో పరిశోధన వస్తుంది. మద్యం సంగతి కూడా ఇంతే! మందు మంచి కాదని ఓ పరిశోధన చెబితే... కాదని మరోటి చెబుతూ ఉంటుంది. కానీ ఈమధ్యకాలం మందు గురించి పరిశోధకులకి ఓ క్లారిటీ వచ్చేసిందండోయ్‌!

 

లిమిట్‌లో ఉంటే మందు వల్ల నష్టాలకంటే లాభాలే ఎక్కువగా ఉంటాయని చాలా పరిశోధనలు చెప్పుకొస్తున్నాయి. ఏకంగా మందు తాగనివాళ్లకంటే తాగేవాళ్లే ఎక్కువకాలం బతికేస్తారని ఓ రిపోర్ట్‌ కూడా వచ్చింది. ఇదంతా ఓ ఎత్తైతే ఇప్పుడు మందు వల్ల మగవారిలో ఫెర్టిలిటీ కూడా పెరుగుతుందని తేలింది. ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.

 

 

మందుకీ మగవారి వీర్యానికీ మధ్య సంబంధం తేల్చేందుకు వీళ్లు ఓ 323 మందిని ఎన్నుకొన్నారు. వీళ్లలో 10 శాతం మంది అసలు మందు అలవాటు లేనివాళ్లు. మరో 30 శాతం మంది వారానికి ఆరుపెగ్గులు పుచ్చుకునేవాళ్లు. ఇంకో 30 శాతం మంది వారానికి పది పెగ్గుల దాకా పుచ్చుకుంటారు. మిగతావాళ్లకి వారంలో ఓ పన్నెండు పెగ్గులు మించి పుచ్చుకునే అలవాటు ఉంది.

 

కొన్నాళ్ల తర్వాత చూస్తే వీళ్లలో కాస్త మోతాదులో... అంటే వారానికి పది పెగ్గుల దాకా పుచ్చుకునేవారిలో వీర్యం కాస్త ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది. అంతేకాదు! వీరిలో వీర్యకణాలు కూడా ఎక్కువగా కనిపించాయి. దీనికి కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, హద్దులు దాటకపోతే ఏ అలవాటైనా చెడు చేయదని మాత్రం తేలిపోయింది.

- SURYA