అన్నాడీఎంకే అయిపోయింది... ఇప్పుడిక డీఎంకే వంతు… బీజేపీ తంతు!

ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోన్న రాష్ట్రం దేశంలో ఏదైనా వుందంటే… అది తమిళనాడే! చాలా రాష్ట్రాలకు చాలా చాలా సమస్యలుండవచ్చు. కానీ, తమిళనాడుకు మాత్రం అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు జయలలితని వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కరుణ, జయల మధ్య దోబూచులాడే అక్కడ సీఎం పీఠం తొలిసారి సంప్రదాయం తప్పింది. ఓ సారి డీఎంకేకి, మరోసారి అన్నాడీఎంకేకి అధికారం ఇచ్చేవారు ఎందుకోగాని జయలలితకు రెండోసారి మారు వెంటవెంటనే పవర్ ఇచ్చేశారు. కానీ, బ్యాడ్ లక్ … ఆమె కొన్ని నెలలకే మంచం పట్టారు. అక్కడ్నుంచీ తమిళనాడు అభివృద్ధి కూడా మంచం పట్టింది. నానా రచ్చైపోతోంది రాష్ట్రం…

 

 

జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చాలా మేలు జరిగేది. కానీ, ఆమె హఠాత్తుగా ఆనారోగ్యం పాలై చనిపోవటంతో దిశా, దశా లేకుండా పోయాయి. మధ్యలో అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపట్టాలన్న వివాదం చాలా కాలం పెద్ద సంక్షోభంగా మారింది. కొన్నాళ్లు పన్నీర్ చుట్టూ, మరికొంత కాలం పళని చుట్టూ, తరువాత శశికళ చుట్టూ, ఆ తరువాత దినకరన్ చుట్టూ లైమ్ లైట్ కొనసాగింది. అందరి దృష్టి ఎవరి మీద వున్నా జనం మాత్రం నష్టపోతూనే వున్నారు. ఓ సారి తమిళ రైతులు దిల్లీ వీధుల్లో నిరసనలకు దిగితే మరో సారి ఏకంగా కాల్పులే జరిగాయి. అమాయకులు మరణించారు. ఇలా రోజుకో గొడవతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక అంతలోనే… ఇప్పుడు కరుణానిధి మృతి మరో రాజకీయ గందరగోళానికి తెర తీసేలా కనిపిస్తోంది!

 

 

తమిళనాడు అంటే డీఎంకే, అన్నాడీఎంకేలే! గత కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహా పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు ఏవీ చెన్నై పాలిటిక్స్ లో నిలవలేకపోయాయి. అంతలా జయ, కరుణా చక్రం తిప్పారు. కానీ, ఇప్పుడు వారిద్దరూ లేకపోవటంతో రాష్ట్రం బిక్క మొఖం వేసుకుని నిలబడిపోయింది. అంతకంటే దారుణం జయ పార్టీ, కరుణ పార్టీ రెండూ చీలికలు , పీలికలు అయ్యేలా వున్నాయి. ఇదే ఇప్పుడు తమిళనాడు భవిష్యత్ ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. జయ మరణం తరువాత పార్టీని హైజాక్ చేయాలనుకన్న శశికళ వర్గం సక్సెస్ కాలేకపోయింది. అందుకు ప్రధాన కారణం దిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా తమదైన స్టైల్లో రాజకీయం చేయటమే! ఇప్పుడు పన్నీర్, పళని నేతృత్వంలో కొనసాగుతున్న అన్నాడీఎంకే గత జయలలిత తాలూకూ పార్టీ కాదన్నది సుస్పష్టం. ఎన్నికలు వస్తే ఇంతకు ముందు జయలలితను చూసి ఓటు వేసిన వారెవరూ అన్నాడీఎంకేకు వేయరు. కాబట్టి రానున్న కాలంలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పన్నీర్, పళని లాంటి నాయకులెవరూ జనంలో భారీ ఫాలోయింగ్ వున్న వారు కాదు…

 

 

డీఎంకే పరిస్థితి అన్నాడీఎంకే అంత దారుణం కాకపోయినా అందులోనూ ముసలం పుట్టే ఛాన్స్ వుంది. కరుణ పెద్ద కుమారుడు అళగిరి అప్పుడే పరోక్ష వ్యాఖ్యానాలు మొదలు పెట్టాడు. తన వెంట బోలెడంత మంది వున్నారంటూ వివాదానికి సై అంటున్నాడు. కానీ, స్టాలిన్ తండ్రి బతికి వుండగానే పార్టీపై పట్టు సాధించేశాడు. అంటే, అళగిరి, స్టాలిన్ గొడవకు దిగితే డీఎంకే రెండుగా చీలే ఛాన్స్ ఖచ్చితంగా వుంటుంది. ఇద్దరిలో అంతిమ విజయం ఎవరిదన్నది పక్కన పెడితే అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి కావాల్సిందే ఇది! అన్నాడీఎంకేలో మాదిరిగా డీఎంకేలోనూ ముసలం పుడితే కమలనాథులు అమాంతం పావులు కదుపుతారు. అళగిరి , స్టాలిన్ ల నడుమ తమకు వీలైనంత ఆజ్యంపోస్తారు! అప్పుడిక డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ బలహీనం అవ్వటం గ్యారెంటీ!

 

 

శశికళ వల్ల అన్నాడీఎంకేకి జరిగిందే అళగిరి వల్ల డీఎంకేకూ జరిగితే… బీజేపీ పండుగ చేసుకోవటం ఖాయం. ఎందుకంటే, తమకు స్వంతంగా సీట్లు రాకున్నా రజినీ చేత పార్టీ పెట్టించి ఆయన్ని సీఎంను చేసి చక్రం తిప్పాలనుకుంటున్నారు మోదీ, షా. కరుణానిధి మృతి వారికి కలిసొచ్చిన అవకాశంగా మారింది. ఇప్పుడు అళగిరి తాజా వ్యాఖ్యలు మరింత సంక్షోభాన్నే సూచిస్తున్నాయి. బహుశా రజినీకాంత్ సీఎం అయ్యేదాకా ఈ గందరగోళం తమిళ తంబీలకు తప్పదేమో! లేదంటే స్టాలిన్ తన రాజకీయ చాతుర్యాన్ని, సత్తాని వచ్చే పార్లెమంట్ ఎన్నికల్లో చాటాలి. అప్పటిదాకా అయితే మాత్రం … ఈ తమిళ పడం ( తమిళ సినిమా ) ఇలాగే కొనసాగుతూ వుంటుంది!