ఆ సీఎం దృష్టిలో మోదీ, అమిత్ షా గాడిదలా?

 

ఉత్తర్ ప్రదేశ్ అంటే చిన్న సైజు భారతదేశం! మన దేశ జనాభాలోని ఆరోవంతు జనం అక్కడే వుంటారు! అంటే.. ప్రతీ ఆరుగురు భారతీయుల్లో ఒకరు యూపీ వాసేనన్నమాట! అంత ముఖ్యమైన రాష్ట్రం కాబట్టే అక్కడ ఎన్నికలంటే అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. వాటిల్లో మాటలతో ప్రత్యర్థిపై దాడి చేయటం ప్రధానమైంది! ఈ సారి యూపీ ఎలక్షన్స్ లో మోదీ అందరి కంటే ముందున్నారు మాటల దాడిలో. అయితే, ఆయన్ని ఎదుర్కొనే ఆవేశంలో సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలు పదే పదే తప్పులు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వంతు వచ్చింది!

 

మోదీ వాక్ చాతుర్యం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సింది కాదు. అయితే, ఆయన ఈ సారి ఎన్నికల్లో మాటల దాడి కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఇంగ్లీషులో స్కాం అనే పదానికి ఫుల్ ఫామ్ వివరిస్తూ... ఎస్ అంటే సమాజ్ వాది, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేష్, ఎం అంటే మాయావతి అంటూ అందర్నీ ఇరికించారు. దాన్ని ప్రజలు ఎలా తీసుకున్నారో తెలియదు కాని... అదే స్కామ్ పదానికి రాహుల్ మరో వివరణ ఇస్తే పెద్దగా పట్టించుకోలేదు. స్కామ్ అనే నెగటివ్ పదానికి రాహుల్ బాబా పాజిటివ్ అర్థం వచ్చేలా ఫుల్ ఫామ్ చెప్పటంతో ఆశించిన లాభం కలగలేదు.

 

మోదీ మరో సభలో ఈ మద్యే అఖిలేష్ ను టార్గెట్ చేశారు. ఒక ఊరిలో మైనార్టీలు సమాధులు చేసుకునే చోటు వుంటే.. ఖచ్చితంగా హిందువులకి స్మశానం కూడా వుండాలి అన్నారు. ముస్లిమ్ ల రంజాన్ కి కరెంట్ వుంటే హిందువుల హోళీకి కూడా విద్యుత్ వుండాలి అన్నారు. మొత్తం మీద అఖిలేష్ ప్రభుత్వం ముస్లిమ్ లకు ప్రాధాన్యత ఇచ్చి హిందువుల్ని పట్టించుకోలేదనే భావం కల్పించారు జనంలో! మోదీ చేసిన ఈ దాడికి అఖిలేష్ ఆగ్రహంతో రెచ్చిపోయారు.

 

ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన అఖిలేష్ గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దని నేను అమితాబ్ తో చెప్పాను అన్నాడు! అసలు విషయం ఏంటంటే, గుజరాత్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన బిగ్ బి అహ్మదాబాద్ దగ్గరలో వున్న అడవి గాడిదల అభయారణ్యానికి ప్రచారం కల్పించే యాడ్ లో నటించాడు. అందులో గుజరాత్ గాడిదలతో కలిసి బచ్చన్ కనిపిస్తాడు. అలా కనిపించకండని తాను అమితాబ్ కు చెప్పినట్టు అఖిలేష్ అన్నాడు. అయితే, ఇందులో ఆయన ద్వంద్వార్థం వాడాడు. గుజరాత్ గాడిదలు అంటే మోదీ, అమిత్ షా అని మరో అర్థం...

 

దేశ ప్రధానిని, అధికారంలో వున్న జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని గాడిదలు అనటం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం కాదు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అంటూ ప్రచారం జరుగుతోన్న యూపీ ఎలక్షన్స్ లో అందరూ అన్ని అస్త్రాలు వాడేస్తున్నారు. మోదీ కూడా చాలా సెటైర్లే వేశారు. మాయవతి పార్టీ అయిన బీఎస్పీని ఆయన బెహన్ జీ సంపత్తి పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఇలాంటివే రాను రాను శృతి మించి గాడిదల దాకా వ్యవహారం వెళుతోంది...

 

రాహుల్ సోదరి ప్రియాంక కూడా మోదీపై విరుచుకుపడింది. ఆయన తనని తాను యూపీకి దత్తపుత్రుడ్ని అంటే... ప్రియాంక గాంధీ మనకు బయటి వారు అక్కర్లేదు అనేసింది. కాని, మోదీ సోషల్ మీడియాలో ఆమె మోదీని బయటి వ్యక్తి అనటం అనేక విమర్శలకు దారి తీసింది. బీజేపి సపోర్టర్స్ యథావిధిగా సోనియా ఇటాలియన్ అంటూ దాడికి దిగారు! మోదీ నుంచి అఖిలేష్ దాకా అందరూ గంభీరమైన విమర్శలు చేస్తే బావుంటుంది. అలా కాక గాడిద సెటైర్లు వేసుకుంటే జనం ముందు అంతా చులకనవుతారు.

 

మరీ ముఖ్యంగా, మోదీ లాంటి ప్రధాని స్థాయి వ్యక్తిని, వయస్సులో పెద్దవాడ్ని, అనుభవంలోనూ సీనియర్ ని పట్టుకుని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు మంచి కన్నా చెడు చేసే అవకాశాలు ఎక్కువ వున్నాయి! గతంలో సోనియా మృత్యు బేహారీ అంటూ పెద్ద గొడవకు కారణం అయ్యారు. ఇదీ అలాగే అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా అఖిలేష్ తన గాడిద హాస్యంలో అమితాబ్ లాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని చర్చలోకి తేవటం మరింత తప్పుగానే చూస్తారు విజ్ఞత వున్నవారు. అందుకే, నేతలంతా జనం చేతులు జోడించి చప్పట్ల కొట్టేలా కాకుండా చేతులు ఎత్తి దండం పెట్టేలా ప్రసంగాలు చేస్తే బావుంటుంది!