డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా.. అదే దారిలో ఫడ్నవీస్!!

 

మహారాష్ట్ర రాజకీయాలు ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉన్నాయి. గంటకో ట్విస్ట్ తో పూటకో మలుపు తిరుగుతున్నాయి. అనూహ్యంగా బీజేపీకి మద్దతిచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అనేక ట్విస్ట్ ల నడుమ ఈనెల 23వ తేదీ శనివారం రోజు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని, ఎలాంటి రహస్య ఓటింగ్ నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అజిత్ పవార్ రాజీనామా చేయడం విశేషం. ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం కూడగట్టడంలో విఫలం అయినందువల్లే అజిత్  రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ మాత్రం దానికి ఇంత హడావుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఎందుకని సెటైర్లు వినిపిస్తున్నాయి. బలం లేకుండానే ప్రమాణ స్వీకారం చేసారు.. తీరా రహస్య ఓటింగ్ వద్దని, అలాగే శాసనసభ సమావేశం మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని ఆదేశించడంతో వెనకడుగు వేశారని విశ్లేషకులు అంటున్నారు.