రేసులో అజయ్ అండ్ సోమేష్... కేసీఆర్ మొగ్గు ఎవరివైపో...

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దాంతో, తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు మొదలైంది. సీనియారిటీ, సమర్ధత, వైఖరిని పరిగణనలోకి తీసుకుని సీఎస్ ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, సీఎస్ కేసులో ముఖ్యంగా ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది. అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందోనని, వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సీఎస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

సీనియారిటీపరంగా చూస్తే 1983 బ్యాచ్ నుంచి బీపీ ఆచార్య, బినయ్ కుమార్... అలాగే 1984 బ్యాచ్ నుంచి అజయ్ మిశ్రా.... 1985 బ్యాచ్ నుంచి పుష్పా సుబ్రమణ్యం... 1986 బ్యాచ్ నుంచి సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ.... 1987 బ్యాచ్ నుంచి రాజీవ్ రంజన్, వసుధా మిశ్రా... 1988 బ్యాచ్ నుంచి శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా.... ఇక, సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోన్న సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.... అయితే, ఇంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ... 1984 బ్యాచ్ అజయ్ మిశ్రా... అలాగే 1989 బ్యాచ్ సోమేష్ కుమార్ వైపు మాత్రమే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.

ఒకవేళ అజయ్ మిశ్రాకి అవకాశమిస్తే కేవలం ఆరు నెలలు మాత్రమే అంటే 2020 జూన్ వరకు మాత్రమే సీఎస్ గా కొనసాగనున్నారు. అదే, సోమేష్ ను ఎంపిక చేస్తే మాత్రం 2023 డిసెంబర్ చివరి వరకు సీఎస్ గా పనిచేసే అవకాశముంటుంది. 2023 డిసెంబర్ నెలాఖరులో సోమేష్ కుమార్ ఉద్యోగ విరమణ ఉండటంతో... ఆయన నాలుగేళ్లపాటు సీఎస్ పదవిలో ఉంటారు. మరి, సీఎం కేసీఆర్.... అజయ్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారో... లేక దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సోమేష్ కి అవకాశమిస్తారో చూడాలి. అయితే, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... సీఎస్ గా రావడానికి పలువురు సీనియర్లు అస్సలు ఇష్టపడటం లేదనే మాట కూడా వినిపిస్తోంది.