నిన్నటి దాకా జయలలిత... ఇప్పుడు ఐశ్వర్యరాయ్..

 

ఈ మధ్య తాము సెలబ్రిటీల కూతుళ్లమనో... కొడుకులమనో చెప్పుకొని ఫేమస్ అవ్వాలని చూస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. గతంలో తాను మెగాస్టార్ చిరంజీవి కొడుకునని రవీందర్ అనే యువకుడు చాలా హంగామా చేశాడు. నేను ఆయన కొడుకునేనంటూ ఏకంగా డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ ఓ బంపరాఫర్ కూడా ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఆ ఎపిసోడ్ అలా ముగిసింది. గత కొద్దికాలంగా జయలలిత వారసుల విషయంలో కూడా పెద్ద డ్రామానే నడుస్తుంది కదా. తాను జయలలిత కొడుకు అని ఓ వ్యక్తి తెరపైకి వచ్చి..అడ్డంగా బుక్కయి జైలు శిక్ష అనుక్షవిస్తుండగా.. తాను జయలలిత అసలైన వారసురాలినని.. అమృత అనే ఓ మహిళ బయటకు వచ్చింది. ఈమె కూడా డీఎన్‌ఏ టెస్టులకు రెడీ అంటూ ఆఫరిచ్చిందనుకోండి. ఇవన్నీ ఒక ఎత్తైతే... ఇక ఇప్పుడు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ వంతు వచ్చింది. ఇప్పుడు తాను ఐశ్వర్యరాయ్ కొడుకునని తెరపైకి వచ్చాడు. విశాఖ యువకుడిగా చెప్పుకుంటున్న ఓ 29 ఏళ్ల కుర్రాడు సంగీత్ కుమార్ ఐశ్వర్య తన తల్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. 

 

ఇంతకీ వీడియోలో ఆ కుర్రాడు ఏం చెప్పాడో తెలుసా... 'నేను ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా 1988లో లండన్లో జన్మించా. ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్‌ రాయ్‌, వ్రిందా రాయ్లు రెండేళ్లపాటూ నన్ను పెంచారు. నా తండ్రి అడివేలు రెడ్డి తర్వాత నన్ను విశాఖపట్నం తీసుకువచ్చాడు. అప్పటి నుంచి విశాఖలోనే ఉండాల్సి వచ్చింది. నా తల్లి నుంచి దూరమై ఇప్పటికి 27 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా తల్లితో ఉండాలనుకుంటున్నా. ఐష్ నా తల్లి అని నిరూపించడానికి నా దగ్గర ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ఆ డాక్యుమెంట్లను నా కుటుంబ సభ్యులు నాశనం చేశారు అని చెప్పాడు. అంతేకాదండోయ్ ప్రపంచానికి తెలియని ఓ నిజాన్నికూడా చెప్పాడు ఆ కుర్రాడు. ఇప్పుడు ఐష్, అభిషేక్లు కలిసి ఉండటం లేదట. వారిద్దరూ సెపరేట్ అయ్యారంటూ మరో బాంబు పేల్చాడు. ఇక ఈ వార్తపై ఎలా స్పందించాలో తెలియక కొంతమంది అయోమయంలో పడితే... ఐష్ అభిమానులు మాత్రం.. ఈ వార్తలను చూసి నవ్వుకుంటున్నారు. మరి అసలు ఐశ్వర్య దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి.