అజీర్ణం...అగ్నిమాంద్యం.. 


   
పిల్లలకి అన్నం పెట్టినప్పుడల్లా....పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ భోజనం పెడతారు. తిన్నది జీర్ణం అయితేనే మనం ఆరోగ్యవంతంగాను ఆనందకరంగాను ఉంటాము. మనము మితముగా భుజిస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భుజించినది వెంటనే జీర్ణమైపోయి మళ్ళీ ఆకలివేసి దప్పిక,తాపము, భ్రమవంటి లక్షణాలు కలిగితే దానిని భస్మకాగ్ని అంటారు. ఈర్ష్య,భయము, క్రోధము, శోకము,లోభము, దీనత్వము, ద్వేషము వంటివుండగా వాటిని భుజించినా అన్నం సరిగా జీర్ణం కాదని ఆయుర్వేద శాస్త్రం ఎప్పుడో చెప్పింది. మానసిక కారణాల వల్ల మితంగా భుజించిన పధ్యకరమైన ఆహారం కూడా జీర్ణము కాదు. 

బడలిక, శరీరము బరువు గా ఉండుట, శరీరము స్తంభించుట, తల తిరుగుట, అపానవాతము వెడలకుండుట, మలము బంధించుట లేదా అధికముగా వెడలుట అనే లక్షణాలు అజీర్ణ వ్యాధిలో కలుగుతాయి..నోట నీరూరుట, పులి త్రేన్పులు వచ్చుట, చెమట పట్టుట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం,  ఒళ్ళు నొప్పులు కలుగుతాయి. త్రేన్పులు, పులిత్రేన్పులు, కడుపునొప్పి,విరేచనాలు లాంటివన్నీ వస్తాయి. 

 

ఇలా వచ్చిన వారు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు:  

విలంబిక, అలసకము, దండాలసకము వ్యాధులయందు, ఆముదపాకు కాడలు మొదలైన నాళములతో గానీ ఫలవర్తులతో గానీ రేచనమును, వమనౌషధములతో వమనమును కూడా చేయించుట హితకరము. ఫలవర్తి, వమనము, స్వేదనము, ఉపవాసము,లఘు ఆహార సేవనము ఇవి ముఖ్యముగా అలసక వ్యాధియందు హితమైనవి. అగ్నిమాంద్యమునందు, అజీర్ణమునందు విరుద్ధాహార సేవనము అలవాటు లేని అన్నప్రాసనములు, గురుత్వమును, మలబంధమును చేయు పదార్ధములను వదిలేయాలి.


మందుజాగ్రత్తలు:

పగలు భోజనం చేసేముందు నిద్రపోతే సర్వాజీర్ణాలు నశిస్తాయి. కరక్కాయ వలుపును ముదములో వేయించిన ఆముదమును త్రాగవలను. దీనిలో నొప్పి మలబంధముతో కూడిన సమస్త వ్యాధులు శమిస్తాయి. ఒక చెంచాడు హింగ్వష్టక చూర్ణమును భోజన సమయములో మొదటతినే ముద్దలో నేతితో కలిపి సేవిస్తే అజీర్ణ వ్యాధి రాదు. భాస్కరలవణము కూడా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది.

అజీర్ణం వలన విరేచనాలు అవుతుంటే కనక సంజీవనీవటి లేదా శంఖవటిలను వాడుకోవాలి. లవంగాలు, కరడవలుపు వీని కషాయమందు సైంధవ లవణము కలిపి సేవిస్తే అజీర్ణము నశించి 
విరేచనమగును. 

అజీర్ణంలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అవటంవల్ల దప్పిక కనక వస్తే లవంగ కషాయం గానీ, జాజికాయ కషాయం గానీ తుంగముస్తల కషాయం గానీ కాచి చల్లార్చి తాగిస్తే వెంటనే రోగవిముక్తి లభిస్తుంది. ఏ రోగం ఎందుకొస్తుంది....దానికి తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు మందుజాగ్రత్తలు తెలుసుకున్నారు కద... మీకు తెలిసిన వారందరినీ కూడా తెలుసుకోమనండి.