అది తింటే వయసు ఆగిపోతుంది

 

మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్ కంప్యూటర్కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకోసారి అల్జీమర్స్ వంటి సమస్యలకి కూడా దారితీస్తుంది. కానీ మెదడులోని కణాలు నిర్వీర్యం అయిపోకుండా ఇప్పుడు ఓ ఉపాయం దొరికేసింది అంటున్నారు పరిశోధకులు. ల్యూటెన్ (Lutein). ఈ పదార్థం గురించి మనం పెద్దగా విని ఉండం కదా! ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు వంటి అతికొద్ది పదార్థాలలో కనిపించే ఒక ముఖ్యమైన పోషకం ఈ ల్యూటెన్.

 

ఇప్పటివరకూ ఈ ల్యూటెన్ మన కళ్లకి చాలా మంచిదని చెబుతూ వస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల కళ్లకి మంచిదని పెద్దలు చెప్పడానికి.... అందులో విటమిన్ Aతో పాటుగా ల్యూటెన్ ఉండటమే కారణం. ఈ ల్యూటెన్ వల్ల మెదడుకి కూడా ఏమన్నా మేలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది పరిశోధకులకి. దాంతో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిని ఓ 60 మందిని ఎన్నుకొన్నారు. ల్యూటెన్ మన కంట్లోని కణాలలో పోగవుతూ ఉంటుంది. దాంతో కంట్లో ల్యూటెన్ నిల్వలు అధికంగా ఉండేవారి మెదడు ఏ మేరకు చురుగ్గా ఉంటోందో గమనించే ప్రయత్నం చేశారు.

 

ఆశ్చర్యంగా ల్యూటెన్ ఎక్కువగా ఉన్నవారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. అభ్యర్థుల మెదడుకి ఎలక్ట్రోడ్లను తగిలించి చూసినప్పుడు, ల్యూటెన్ అధికంగా ఉండేవారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ ల్యూటెన్ ఉన్న పెద్దవాళ్ల మెదడు, వయసులో ఉన్నవారితో సమానంగా స్పందిస్తోందని గ్రహించారు. మెదుడ మీద ల్యూటెన్ ప్రభావం తేలిపోవడంతో.... మెదడుకి సంబంధించి అనేక సమస్యలకు ల్యూటెన్ని మందుగా ఇచ్చే ప్రయత్నాలు మొదలవుతాయని ఆశిస్తున్నారు.

 

వీలైనంతవరకూ ల్యూటెన్ అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, చిలగడదుంప, టమాటా, క్యారెట్, గుడ్లు, బొప్పాయి, బీన్స్... లాంటి పదార్థాలు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడమని చెబుతున్నారు. మన శరీరానికి స్వతహాగా ల్యూటెన్ని తయారుచేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి, అది అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ కాస్త జాగ్రత్తా కనుక తీసుకుంటే.... వయసు ఎంతగా మీదపడినా మెదడు మాత్రం భద్రంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

- నిర్జర.