అదనపు తీపి - అదనపు అనారోగ్యం

మన రోజువారీ ఆహారంలో ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉందో తీపికీ అంతే ప్రాధాన్యత ఉంది. శరీరం తనకు కావల్సిన శక్తిని సమకూర్చుకునేందుకు తీపి పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. కానీ అవసరానికి మించితే, అదే తీపి మనపాలిట చేదుగా మారే అవకాశం ఉంది. అదెలాగంటే...

 

Added Sugars

తీపి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారంలో అది సహజంగా ఉండవచ్చు. ఉదాహరణకు పండ్లు, బియ్యం వంటి పదార్థాలకు అదనంగా ఎవ్వరూ తీపిని చేర్చరు కదా! కానీ కృత్రిమంగా రూపొందించుకునే పదార్థాలు రుచిగా ఉండటానికి, వాటికి విపరీతమైన తీపిని జోడించాల్సి ఉంటుంది. వీటినే Added Sugars అంటారు. అది పంచదార కావచ్చు, తేనె కావచ్చు. ఇలా అదనంగా చేర్చిన తీపితోనే అసలు చిక్కంతా వస్తుంది.

 

ఓ పరిమితి ఉంది

ఇంతకుముందు వరకూ మన రోజువారీ ఆహారంలో ఈ Added Sugars పరిమితి ఎంత ఉండాలి అన్నదాని మీదే రకరకాల ఊహాగానాలు ఉండేవి. కానీ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఒక పరిశోధనతో ఆ అయోమయం తొలగిపోయింది. మిరియం వాస్‌ అనే వైద్యుని ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో గత నివేదికలనూ, గణాంకాలనూ పరిశీలించి... 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకి 25 గ్రాముల (ఆరు టీస్పూనులు) కంటే ఎక్కువగా Added Sugarsని తీసుకోవడం హానికరం అని తేల్చారు.

 

కారణం!

ఆహారంలో Added Sugars అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఊబకాయం, అధిక కొలెస్టరాల్‌, ఫాటీ లివర్‌ వంటి సమస్యలు మొదలై అవి భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు, Added Sugars వల్ల మన శరీరం ఇన్సులిన్‌ను గ్రహించడంలో సమస్యలు ఏర్పడతాయనీ, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనీ పేర్కొంటున్నారు.

 

తీపి ఒక వ్యసనం

Added Sugarsకు అలవాటు పడిన పిల్లల పాలిట అవి ఒక వ్యసనంలా మారిపోతాయి. అవి తింటే కానీ తృప్తిగా ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. పైగా వాటి రుచికి అలవాటు పడిన పిల్లలు పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాన్ని తినేందుకు కూడా ఇష్టపడరు. అందుకనే Added Sugars అనేవి పిల్లల పాలిట మద్యపానం అంత హానికరమైన అలవాటు అంటున్నారు నిపుణులు.

 

సాధ్యమేనా!

పిల్లలు రోజుకి 25 గ్రాములకు మించకుండా Added Sugarsని తీసుకోమని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆచరణలో దీనిని అమలుచేయడం ఎంతవరకూ సాధ్యం అన్నదే సమస్య! అందుకనే 2018 నుంచి ఆహారాన్ని విక్రయించేవారు, వాటిలో అదనంలో చేర్చిన తీపిని (Added Sugars) కూడా పేర్కొనేలా చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకూ పిల్లలను తీపి ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచడమే మనం చేయగలిగిన పని.

- నిర్జర.