ఆ నలుగురూ కాదేమో.! ప్రముఖుల హస్తం ఉందేమో? ప్రముఖ హీరో అనుమానాలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పలువురు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైనాసరే చట్ట ప్రకారమే చేయాలని... న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే శిక్షించాలని కోరుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్లు చేయడం సరికాదంటోన్న మానవ హక్కుల సంఘాలు, పలువురు ప్రముఖులు... దిశ నిందితుల ఎన్ కౌంటర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ నలుగురే దిశపై హత్యాచారానికి పాల్పడ్డారనడానికి రుజువు ఏమిటని ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ప్రశ్నించారు. దిశపై దారుణానికి పాల్పడింది ఆ నలుగురు కాదేమో? ప్రముఖుల హస్తం ఉందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయినా, ప్రముఖులు అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో ఎన్ కౌంటర్లు ఎందుకు జరగడం లేదని ఉపేంద్ర ప్రశ్నించారు. దిశ కేసులో జరిగిన విధంగా ప్రముఖుల రేప్ కేసుల్లో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. గతంలో రౌడీయిజాన్ని తగ్గించేందుకు ఎన్ కౌంటర్లు జరిగేవని, ఇప్పుడు పోలీసులు మనసు పెడితే ఎన్ కౌంటర్ల ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చని అన్నారు. అయితే, ప్రముఖులు, శ్రీమంతులు, పేదలనే తేడా లేకుండా అందరికీ హెచ్చరికలా ఉండాలన్నారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించి అత్యాచారాలకు పాల్పడింది ఎవరైనాసరే ఎన్ కౌంటర్ చేస్తే సమాజంలో అఘాయిత్యాలు ఆగుతాయన్నారు.

అయితే, దిశపై హత్యాచారానికి పాల్పడింది ఆ నలుగురో కాదోనంటూ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఉపేంద్ర... ఇలా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించడం సరికాదని హితవు పలుకుతున్నారు.