కేటీఆర్ ముఖ్యమంత్రిగా సమర్ధుడు-సుమన్

 

తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై సినీ హీరో సుమన్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టంకట్టడం సంతోషకరమని సుమన్ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం తనకు మొదట నుంచి ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు సొంతం చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు కష్టపడి పని చేసి ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే.. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఒక టర్మ్ సరిపోదని. పదేళ్లు కావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, టీఆర్ఎస్ మెజారిటీ ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోరితే టీఆర్ఎస్ పార్టీతో కలసి పనిచేయటానికి సిద్ధమని సుమన్ స్పష్టం చేశారు. 

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని సుమన్ అన్నారు. కేసీఆర్ .. తన పిల్లలకు రాజకీయాలపై మంచి తర్ఫీదు ఇచ్చారని చెప్పారు. కేటీఆర్‌కు వయస్సుకు మించిన పరిపాలనా అనుభవం ఉందని, ఆయనకు ముఖ్యమంత్రిగా పనిచేసే సమర్థత ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం సహజమని, కేసీఆర్, చంద్రబాబు విమర్శలను కూడా అలానే చూడాలని సుమన్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలపై ఒక్కొక్కరది ఒక్కో ఆలోచన అని.. ఎవరు ఏ ఫ్రంట్‌కు మద్దతిచ్చినా తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు.