ఇది సిల్లీ కేసు.. నేను ఎక్కడికి పారిపోలేదు: శివాజీ

 

టీవీ9 కేసు వ్యవహారంలో మాజీ సీఈఓ రవిప్రకాష్ తో పాటు ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు హీరో శివాజీ. తాజాగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరిపై అలంద మీడియా ఫిర్యాదు చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. గత కొన్నిరోజులుగా రవిప్రకాష్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ ఫలానా ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాకు శివాజీ ఒక వీడియో విడుదల చేశారు.

శివాజీ ఎక్కడికీ పారిపోలేదని, శివాజీ వెన్నుచూపే వ్యక్తికాదని అన్నారు. "ఇది రవిప్రకాష్ కు నాకూ మధ్య ఉన్న విషయం. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర" అని విమర్శించారు.

2018లో తాను షేర్లు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. యాజమాన్యం మారింది కాబట్టి షేర్ల గురించి అడిగానన్నారు. ఇందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. మా ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరు? అని ప్రశ్నించారు. కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారన్నారు. సోదాలు చేసి ఏమీ దొరకలేదని తెలిపారు. తన భార్యతో సంతకం చేయించుకొని వెళ్లిపోయారని వివరించారు.
 
రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తనపై పగ పట్టిందన్నారు. ఇందులో కొంతమంది ఆంధ్రా నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. తాను హైదరాబాద్‌లో సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారన్నారు. తనపై వంద కేసులు కాదు.. వెయ్యి పెట్టుకున్న భయమేమీలేదన్నారు.

తాను భయపడి పారిపోవడానికి ఇదేమైనా పెద్ద కేసా? ఇవన్నీ సిల్లీ కేసులంటూ కొట్టిపారేశారు. ఈ కొన్నిరోజుల వ్యవధిలోనే తాను తిరుపతి వెళ్లానని, ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నానని శివాజీ వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా కొందరు శునకానందం పొందుతున్నారన్నారు. తనపై రాళ్లు విసిరితే అవి మీకే తగులుతాయన్నారు. మై హోమ్ అధినేత రామేశ్వరరావు తనకు బాగా తెలుసన్నారు. ఆయన పిలిచి అడిగితే అన్నీ చెప్పేవాడినన్నారు. తానెక్కడికి పారిపోలేదని.. వడదెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘పోలీసులు ఏమైనా నన్ను చంపేస్తారా? ఏంటి’ అని అడిగారు. కుట్రలో భాగంగానే తనను ఇరికించారని.. అనవసరంగా తనపై టీవీల్లో డిబేట్లు పెట్టొద్దన్నారు. నిజాయితీగా బయటికి వస్తానని.. నాలుగు రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్తానని పేర్కొన్నారు.