ఏపీలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న వైసీపి ప్రభుత్వం...

ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డాయి. మొత్తం పదమూడు జిల్లాల్లో ఉన్న పద్నాలుగు కార్యాలయాల్లో ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇవి కొనసాగాయి, 100 మంది అధికారులు 14 బృందాలుగా మెరుపు దాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న రకరకాల అక్రమాలు ఈ దాడుల్లో వెలుగు చూశాయి, ఈరోజు కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. అవినీతిపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది, వరుస తనిఖీలు, సోదాలతో ఏసీబీ అవినీతిపై యుద్ధం ప్రకటించింది. తాజా మునిసిపల్ కార్యాలయాలను అవినీతి నిరోధక శాఖ టార్గెట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. పదమూడు జిల్లాల్లో ఉన్న పద్నాలుగు కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు 2,87,000 నగదును పట్టుకున్నారు. గుంటూరులో అత్యధికంగా లక్ష రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఏదో ఒక కార్యాలయంలో దాడులు చేయగా విశాఖలో మాత్రం గాజువాక, మధురవాడ రెండు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో లక్ష నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నారని గుర్తించారు. ఆఫీసులో పలు అక్రమాలు ఏసిబి అధికారుల దృష్టికి వచ్చింది, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో 8940 రూపాయల నగదు గుర్తించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పదిహేను వేలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తిని గుర్తించారు. పదమూడు లక్షల రూపాయల అడ్వటైజింగ్ ట్యాక్స్ వసూల్లో ఏడాదిగా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేల్చారు. అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవటం సిటిజన్ చార్ట్ ను పాటించకపోవడాన్ని ఏసిబి అధికారులు గుర్తించారు.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో ఇరవై నాలుగు బిల్డింగ్స్ కు బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచినట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, మధురవాడ, గాజువాక లోనూ లెక్కల్లో చూపని నగదును అధికారులు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులు పని చేస్తున్నట్లు గుర్తించారు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,87,263 రూపాయల నగదును ఏసిబి అధికారులు సీజ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు కావాలనే అనుమతులను పెండింగ్ లో ఉంచటం నిర్ణీత సమయం ముగిసినా అనుమతులు మంజూరు చేయటం వంటి అక్రమాలు గుర్తించామని అధికారులు తెలిపారు.