శాకాహారంతో ఆరోగ్యమే కాదు, పర్యావరణమూ క్షేమమే!

శాకాహారమా, మాంసాహారమా... ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న అనుమానం ఈనాటిది కాదు. సాధారణంగా శాకాహారానికే ఎక్కువ ఓట్లు పడినప్పటికీ, కొన్ని రకాల పోషకాలు కేవలం మాంసాహారం ద్వారానే సాధ్యమనే వాదనా వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ Academy of Nutrition and Dietetics (AND) అనే సంస్థ ఒక నివేదికను రూపొందించింది.

 

 

ఆరోగ్య సమస్యలు దూరం

మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారులలో అనేకరకాల ఆరోగ్య సమస్యలు తక్కువగా కలుగుతాయని తేల్చారు ‘AND’ పరిశోధకులు. శాకాహారం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 62 శాతం తక్కువగా కనిపిస్తోందట. ఇక ప్రొస్టేట్‌ క్యాన్సర్ సోకే ప్రమాదం 35 శాతం తక్కువగానూ, గుండెజబ్బులు ఏర్పడే అవకాశం 29 శాతం తక్కువగానూ ఉండటాన్ని గమనించారు. పైగా మాంసం తినే అలవాటు ఉన్న పిల్లలతో పోలిస్తే శాకాహారంపు అలవాట్లు ఉన్న పిల్లలలో ఊబకాయం కూడా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాదు! రక్తపోటు, అధికకొవ్వు, పేగు క్యాన్సర్‌ వంటి సమస్యలూ అంతగా పీడించవంటున్నారు. పైగా మాంసాహారతో పోలిస్తే శాకాహారం తీసుకునేందుకు అయ్యే ఖర్చు కూడా అంత భారంగా ఉండదన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు.

 

 

పర్యావరణానికీ క్షేమమే

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం మీద ఆధారపడటం వల్ల పర్యావరణానికి కూడా మేలు అంటున్నారు ‘AND’ నిపుణులు. ఒక కిలో మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ఖర్చయ్యే వనరులతో పోల్చుకుంటే ఒక కిలో బీన్స్‌ను ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే వనరులు చాలా తక్కువని తేలుస్తున్నారు. దీనివల్ల నీరు, భూమి, ఎరువులు, ఇంధనం... వంటి వనరులన్నీ ఆదా అవుతాయని చెబుతున్నారు. పైగా వాతావరణంలోకి పేరుకునే విషవాయువుల (greenhouse gases) శాతం కూడా తగ్గుతుందట.

 

 

తారకమంత్రం కాదు

మాంసాహారంకంటే శాకాహారం మంచిది అన్నారు కదా అని ఏది పడితే అది తింటే ఉపయోగం లేదంటున్నారు. అన్ని రకాల పోషక విలువలు ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమేనని హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్త కనుక తీసుకుంటే ఏ వయసువారి అవసరాలనైనా శాకాహారం తీరుస్తుందంటున్నారు. ఒక్క B12 తప్ప శాకాహారులకు అన్నిరకాల పోషకాలూ అందుతాయని భరోసా ఇస్తున్నారు. ఆ B12ని కూడా శాకాహారులకు అందించేందుకు ఇప్పుడు B12ని జోడించిన ఆహారపదార్థాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.

 

అదీ విషయం! శాకాహారం మీద ఆధారపడటం వల్ల మంచి ఫలితాలే ఉంటాయన్న మాట ఇప్పుడు తేలిపోయింది. కాకపోతే శాకాహారం అన్నారు కదా అని ఉత్త తెల్లటి బియ్యం, కాసిని చారునీళ్లు తీసుకోకుండా తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు వంటి అన్నిరకాల ఆహారపదార్థాలనీ తీసుకోమన్న హెచ్చరికా అందిపోయింది. 

- నిర్జర.