ఏసీ కావాలా బాబూ... ఈ స్టిక్కర్ అంటించండి చాలు!

 

ఎండలు ముదిరిపోతున్నాయి.. బయట అడుగుపెడితే సూరిబాబు ఎలాగూ వేపుకు తినేస్తాడు. కనీసం ఇంటి పట్టున ఉన్నప్పుడన్నా కాస్త కనికరం చూపుతాడంటే అదీ లేదు. ఈ వేడిని భరించాలంటే ఇంటికో ఏసీ బిగించాల్సిందే! ఆ ఏసీని పోషించేందుకు కరెంటు బిల్లులు కట్టాల్సిందే! కానీ మరికొద్ది ఏళ్లలో ఈ తీరు మారిపోనుంది. అదెలాగంటే...

 

ఓ స్టిక్కర్ చాలు

 

కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు వేడిని ఎదుర్కొనే ఓ పదార్థాన్ని రూపొందించారు. ఇది మన పుస్తకాలకి వేసుకునే అట్టంత పల్చగా ఉంటుంది. కానీ ఏ వస్తువుకైనా, ఇంటి పైకప్పుకైనా దీనిని అంటిస్తే అద్భుతం చేస్తుంది. సాధారణంగా ఇప్పటివరకూ వేడిని ఎదుర్కొనేందుకు రూపొందించిన పదార్థాలన్నీ కూడా ఒకే తీరున పనిచేసేవి. అయితే సదరు వస్తువులోంచి వేడి తగ్గేలా చేయడం లేదా బయట నుంచి వచ్చే కాంతిని ఎదుర్కోవడం. కానీ కొలరాడో పరిశోధకులు రూపొందించిన పొర ఈ రెండు విధాలుగానూ పనిచేస్తుంది. వస్తువులో ఉన్న వేడిని బయటకు పంపేందుకు, సన్నటి గాజుపలకలతో కూడిన పొరని తయారుచేశారు. ఇక బయట నుంచి వచ్చే కాంతిని తిప్పికొట్టేందుకు ఆ పొర వెనక వెండిరంగు పూత పూశారు.

 

లెక్కలేనన్ని ఉపయోగాలు

 

ఈ కొత్తరకం పొర సాయంతో వేడిని ఎదుర్కొనేందుకు ఎలాంటి విద్యుత్తు కానీ నీళ్లు కానీ అవసరం లేదు. ఇలా తెచ్చుకుని ఇలా అంటించుకుంటే చాలు. ఒక ఇరవై మీటర్ల పొరని తెచ్చుకుని ఇంటి పైకప్పుకి అంటిస్తే, నిండువేసవి కాస్తా పండువెన్నెలని తలపిస్తుందంటున్నారు. అలాగని ఈ ఆవిష్కరణ మన సుఖాన్ని పెంచేందుకే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పవర్ప్లాంట్, నూక్లియర్ ప్లాంట్ వంటి పరిశ్రమలలో విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడిని అదుపు చేయాలంటే లెక్కలేనంత నీరు, శీతలీకరణ యంత్రాలూ అవసరం అవుతాయి. కానీ ఈ పొరని కనుక వాటికి కప్పితే ఎలాంటి వనరులూ వృధా కాకుండా చల్లగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అరిజోనాలో ఉన్న 110 మెగావాట్ల పవర్ ప్లాంట్లకి అంటించి మరీ చూశారు. ఇక వ్యవసాయం దగ్గర నుంచీ అంతరిక్ష పరిశోధనల వరకూ విపరీతమైన వేడిని ఎదుర్కోవాల్సిన ప్రతి సందర్భంలోనూ ఇది ఉపయోగపడి తీరుతుంది.

 

సాధారణంగా మనం పరిశోధనల్లో చదివే విషయాలు వాస్తవరూపంలోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కొన్నాళ్లకి ప్రపంచమంతా ఆ పరిశోధనని మర్చిపోతుంది కూడా! కానీ ఈ వేడిని తగ్గించే పొర మాత్రం ఇప్పుడు తుదిదశలో ఉంది. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరఫు నుంచి భారీ నజరానా కూడా అందింది. తమ ప్రయోగాన్ని పూర్తిస్థాయి ఉత్పత్తి రూపంలోకి తీసుకువచ్చేందుకు సదరు శాస్త్రవేత్తలు ఇప్పటికే పేటెంటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరో రెండు మూడు వేసవికాలాలు గడిచేసరికి ఈ పదార్థం మనకి కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని ఆశిద్దాం.

- నిర్జర.