సినిమాల్లో అవ‌కాశం ఇప్పిస్తాన‌ని..

సినిమాల్లో అవ‌కాశం ఇప్పిస్తాన‌ని చెప్పి ఓ అమ్మాయిని అశ్లీల షార్ట్ ఫిల్మ్స్ లో బ‌ల‌వంతంగా న‌టింప‌జేసిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. జిల్లాలోని మొయినాబాద్ కు చెందిన ఓ యువ‌తి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుప‌త్రిలో స్టాఫ్ న‌ర్స్ గా ప‌నిచేస్తోంది. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే పిచ్చి..ఎలాగైనా హీరోయిన్ అవ్వాల‌న్న‌ది ఆమె క‌ల‌. దీంతో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఆ యువ‌తికి త‌న త‌మ్ముడి ద్వారా లోక్ నాథ్ ప‌రిచ‌యం అయ్యాడు. త‌న‌కు చాలా మంది డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు తెలుస‌ని చెప్పి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మీకి ప‌రిచయం చేశాడు. ఆమె ఓ సినిమాలో చిన్న పాత్ర‌లో న‌టించేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డంతో ఆ యువ‌తి ఆనందానికి అవ‌ధుల్లేవు.

 

షూటింగ్ కు ముందు ఓ తెల్ల‌కాగితంపై సంత‌కం చేయించుకుని లోక్ నాథ్ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మీ ఆ యువ‌తిని పంపించింది. అయితే యూనిట్ స‌భ్యులు ఆమెను గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకెళ్లి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. సాయం కోసం విజ‌య‌ల‌క్ష్మీకి ఫోన్ చేస్తే వాళ్లు ఎలా చెబితే అలా చెయి..లేక‌పోతే వేరే కేసుల్లో ఇరికిస్తాను అంటూ బెదిరించింది. దీంతో చేసేది లేక ప‌ది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించింది. అంతేకాకుండా ద‌ర్శ‌కుడు త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా మౌనంగా భ‌రించింది. అయితే స‌దరు షార్ట్ ఫిల్మ్స్ ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్షం కావ‌డం..ఆ యువ‌తి ప‌నిచేస్తోన్న ఆస్ప‌త్రి సిబ్బంది వాటిని చూడటంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొల‌గించింది. విష‌యం పోలీసుల‌కు వెళ్ల‌డంతో వారు కేసును ద‌ర్యాప్తును చేస్తున్నారు.