ఏది ముఖ్యం?

 

అది ఓ పేరుపొందిన విశ్వవిద్యాలయం. అందులో సైకాలజీ తరగతి. తరగతిలో విద్యార్థులు అంతా కొత్త ప్రొఫెసర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూస్తూ చూస్తుండగా ఓ పెద్దాయన గదిలోకి వచ్చాడు. వచ్చినవాడు ఖాళీ చేతులతో రాలేదు. ఓ గాజు సీసా ఒకటి చేత్తో పట్టుకువచ్చాడు.

 

విద్యార్థులు అంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా ఆ గాజు సీసా నిండుగా రాళ్లని నింపాడు. ‘ఈ గాజు సీసాలో ఇప్పుడు కాస్తన్నా ఖాళీ ఉందంటారా?’ అంటూ ఆ ప్రొఫెసర్ విద్యార్థుల వంక చూశాడు. ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది. ఆ గాజు సీసా మొత్తం రాళ్లతో నిండిపోయింది కదా!’ అని బదులిచ్చాడు ఓ విద్యార్థి. ‘చూద్దాం! మీ జవాబు ఎంతవరకూ నిజమవుతుందో!’ అంటూ కొన్ని గులకరాళ్లని తీసుకుని ఆ సీసాలోకి కుమ్మరించాడు. గాజు సీసాను కాస్త కదపగానే ఆ గులకరాళ్లన్నీ పెద్ద రాళ్లకి మధ్య ఉన్న సందుల్లోకి సర్దుకున్నాయి.

 

‘చూశారా మీ జవాబు తప్పయింది! ఈసారి చెప్పండి. ఈ సీసాలో ఇంకా ఖాళీ ఉందంటారా?’ అని అడిగాడు కొంటెగా. ‘అబ్బే ఉన్న కాస్త ఖాళీనీ మీరు నింపేశారు కదా!’ అని బదులిచ్చారు విద్యార్థులు. కానీ వారి మనసులో ఏదో అనుమానం. ఈసారి కూడా ప్రొఫెసర్ ఏదో మాయ చేసేట్లే ఉన్నాడు అనుకున్నారు. విద్యార్థులు అనుకున్నట్లే ప్రొఫెసర్‌ కాస్త ఇసుకని తీసుకుని గాజు సీసాలోకి కుమ్మరించాడు. ఓ నాలుగు కుదుపులు కుదపగానే, ఇసుక కాస్తా సీసాలోని మూలమూలలకీ చేరిపోయింది.


‘మీ తెలివి బాగానే ఉంది. కానీ మీ ప్రయోగానికీ చదువుకీ ఏంటి సంబంధం?’ అంటూ విసుగ్గా అడిగాడు ఓ విద్యార్థి. ‘జీవితం గురించి తెలుసుకోవడమే అసలైన చదువు. మన జీవితం కూడా ఈ గాజు సీసాలాంటిదే! కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిత్వం… ఈ మూడూ మనం మొదట సీసాలో ఉంచి పెద్దరాళ్లు లాంటివి. డబ్బు, హోదా, సౌకర్యాలు… ఈ మూడూ మనం సీసాలో నింపిన గులకరాళ్లులాంటివి.

 

ఇక విలాసాలు, వినోదాలు, వివాదాలు వంటి చిల్లర విషయాలన్నీ ఇసుకలాంటివి.’ అన్నాడు చిరునవ్వుతో! ‘పోలికైతే బాగుంది. కానీ విషయం ఏంటి’ అన్నారు విద్యార్థులు మరింత చిరాగ్గా. ‘మరేం లేదు! మీరు కనుక మీ ఆరోగ్యానికీ, కుటుంబానికీ, వ్యక్తిత్వానికీ ప్రాధాన్యతని ఇస్తేనే డబ్బు, హోదా, సౌకర్యాలు ఉపయోగపడతాయి. ఆ తరువాత విలాసాల గురించి ఆలోచించవచ్చు. అలా కాకుండా ముందే ఆ గాజు సీసాను ఇసుకతో నింపేస్తే ఇక వేరే వేటికీ చోటు ఉండదు. మన జీవితమే చిల్లర విషయాలతో నిండిపోతుంది.’ అంటూ తన జీవిత పాఠాన్ని ముగించాడు. విద్యార్థులకి నోట మాట రాలేదు!