లాంచనంగా అమాద్మీకి బల పరీక్ష

 

ఆమాద్మీ పార్టీ డిల్లీ ప్రభుత్వపగ్గాలు చేప్పట్టి అప్పుడే వారం రోజులయిపోయింది. మొదటి మూడు రోజులలోనే తన ఎన్నికల హామీలలో ముఖ్యమయిన రెండు హామీలు-డిల్లీ ప్రజలకు 700 లీటర్ల ఉచిత నీళ్ళ సరఫరా, విద్యుత్ ధరలలో 50 శాతం తగ్గింపును అమలు చేసింది. అంతే గాక డిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్నమూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయిస్తానని ఇచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకొంటూ అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఆడిటర్ జనరల్ ని కలిసి, ఆ మూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయవలసిందిగా అభ్యర్దించారు. మూడు కంపెనీలలో ఒకటి ఇప్పటికే ఆయన ప్రతిపాదనను స్వాగతించగా మరో రెండు కంపెనీలు ఇంకా స్పందించవలసి ఉంది.

 

ఇక కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులందరూ నిన్నడిల్లీ శాసనసభలో ప్రమాణ స్వీకారాలు చేసారు. ఈరోజు శాసనసభలో ఆమాద్మీ బలం నిరూపించుకోవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అమాద్మీకి తన మద్దతు ఉంటుందని ఇప్పటికే మరో మారు స్పష్టం చేసింది గనుక ఈరోజు జరిగే బలనిరూపణ కార్యక్రమం కేవలం లాంచనప్రాయమే. అందువలన ఇక నేటి నుండి ఆమాద్మీ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మరింత జోరుగా ప్రయత్నించవచ్చును.

 

ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన 15రోజులలోనే అన్నాహజారే కోరిన విధంగా జన్ లోక్ పాల్ బిల్లుని సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినందున, ఇప్పుడు దానిపై అమాద్మీ దృష్టి కేంద్రీకరించవచ్చును. కానీ, దీనికి కాంగ్రెస్, బీజేపీల మద్దతు అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేఖంగా చేస్తున్న పోరాటానికి నిదర్శనంగా ఇటీవల పార్లమెంటులో అమోదం పొందిన లోక్ పాల్ బిల్లు గురించి మాట్లాడుతున్నారు గనుక, ఇప్పుడు ఆమాద్మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే జన్ లోక్ పాల్ బిల్లుకి కూడా మద్దతు ఇచ్చేఅవకాశం ఉంది. కానీ, తమకు అధికారం దక్కకుండా చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీకి మద్దతు ఇచ్చి ఇద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్న బీజేపీ ఈ బిల్లును ఏదో ఒక కుంటిసాకుతో వ్యతిరేఖించవచ్చును.

 

ఇక అమాద్మీ పార్టీ యువతను, సామాన్య, మధ్యతరగతి, ఉద్యోగస్తులు, వ్యాపారులను చేరేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్న తీరు, దానికి వస్తున్న అపూర్వ స్పందన, ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నపుడు చేసిన ఎన్నికల ప్రచారం, స్పందన కంటే చాలా బాగుందని ఫేస్ బుక్ సర్వేలో తేలింది. అమాద్మీ తను అధికారం చేప్పట్టిననాటి నుండి ఇంతవరకు అమలు చేసిన హామీల గురించి ఫేస్ బుక్ పేజీలలో ప్రజలకు తెలియజేసి, మిగిలిన హామీలను కూడా అమలుచేయడానికి కృషి చేస్తామని, అందు కోసం సదా వారి మద్దతు అవసరమని చేసిన విజ్ఞప్తికి ప్రజల నుండి చాలా మంచి ప్రతిస్పందన వస్తున్నట్లు ఫేస్ బుక్ సర్వేలో తేలింది.