పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే..

 

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆమాద్మీ పార్టీ నేతలు, నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని కోరుతూ మొదలుపెట్టిన పదిరోజుల దీక్ష మొదలుపెట్టారు. ఇంతకాలం డిల్లీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది గనుక, పోలీసు వ్యవస్థ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోఉన్నపటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు. కానీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ఆమాద్మీప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే డ్డీకొనడంతో సమస్య మొదలయింది.

 

ఈ ఘర్షణ వెనుక ఆమాద్మీ పార్టీ ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ, పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేకపోయినట్లయితే ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై సర్వాధికారాలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల కూడా మున్ముందు ఇటువంటి సమస్యలే తలెత్తవచ్చును. కాంగ్రెస్ వచ్చేఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాననే నమ్మకం లేకపోవడం వలననో లేక ఎన్నికలలోగా బిల్లుని ఆమోదింపజేసుకోవాలనే హడావుడి వలననో బిల్లులో ఇటువంటి అసంబద్దమయిన అనేక ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకొంది. వాటిపై తెలంగాణా నేతలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇంతవరకు వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులందరూ బిల్లుపై దాదాపు 5000 సవరణలను ప్రతిపాదించారంటే బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతోంది. ఇప్పుడు డిల్లీలో ఆమాద్మీ పార్టీ చేస్తున్న ధర్నాతో ఒక సమస్య బయటపడింది.