తెలంగాణకు భూకంప హెచ్చరిక!?

తెలంగాణకు  భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.  అయితే ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదనీ, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.
తెలంగాణకు  భూకంప హెచ్చరిక!? Publish Date: Apr 11, 2025 1:33AM

ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్‌ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు.  ఏప్రిల్‌ 2న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌ . దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని తోటి రిపబ్లికన్‌ నేతలు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్ లు పదేపదే హెచ్చరించారు కూడా. అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.  ట్రంప్‌ నిర్ణయం వెనక బాండ్‌ మార్కెట్‌ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఆందోళనలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అటు ట్రెజరీ మార్కెట్‌లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారట. ఇదిలాఉండగా టారిఫ్‌లపై విరామం ప్రకటించిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ బాండ్‌ మార్కెట్‌ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాండ్‌ మార్కెట్‌ చాలా గమ్మత్తైనది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. కొంత మంది కోపంగానూ ఉన్నారని ట్రంప్‌ అన్నారు.  కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్ట భయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. చాలా దేశాల్లో ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ బాండ్లను జారీ చేస్తుంటాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది.
ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా? Publish Date: Apr 11, 2025 1:25AM

పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 
పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్ Publish Date: Apr 10, 2025 6:16PM

పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ  నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య  44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన  షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్  కూడా మిగలలేదు.  అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు  కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప  మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే  1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.  అయితే  ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా  ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా  సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక  వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ  పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన  కారణం  కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు,  కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే  కారణమని కాంగ్రెస్  పార్టీ మరో మారు గుర్తించింది.  ఈ నేపద్యంలో  అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 - 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు  కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు  ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది. ముఖ్యంగా  రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే  దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా  ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే  ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’  తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం  లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.   ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత  తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే  కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా,  గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్  వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే  ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి  ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం...  గుజరాత్  ను గెలవాలి!
పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్ Publish Date: Apr 10, 2025 5:21PM

రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.  పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి
రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా? Publish Date: Apr 10, 2025 4:01PM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

బీఆర్‌ఎస్ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే  అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  2023లో షకీల్ కొడుకు రహేల్ వేగంగా కారు నడుపుతూ బేగంపేట ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా దుబాయిలో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ Publish Date: Apr 10, 2025 3:37PM

ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ  పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో  అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.  గతంలో గులాబీ బాస్ ఏఐజీ హాస్పిటాల్‌‌కి వచ్చి హెల్త్ చెకప్ చేయించకున్నారు. సాధారణ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రజత్సోవాలను అధినేత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో  పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం నింపిటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌పార్టీ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే  తొలి పార్టీ ఆవిర్బ సభ కావడంతో దీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సభలో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కి సీట్లు రాకపోవడంతో క్యాడేర్ నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సహం నింపాటానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు.
ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్ Publish Date: Apr 10, 2025 3:11PM

ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు

వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీరిరువూ సామాజిక మాధ్యమంలో హిందువులను కించపరిచేలా పోస్టులు పెట్టారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా జతపరిచారు.  వీరిరువురూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు    సామాజిక భద్రతకు, జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని మెడీ శ్రీనివాస్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ  వ్యాఖ్యలలో హిందూ దేవుళ్ల పట్ల అమర్యాద కరంగా ఉన్నాయనీ, పవిత్ర గ్రంథాలైన మహాభారతం, రామాయణాలను అపహాస్యం చేసేవిగా ఉన్నాయనీ మేడీ శ్రీనివాస్ పేర్కొన్నారు.  
ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు Publish Date: Apr 10, 2025 3:04PM

కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం

చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న జవానును జిల్లా  ఆస్పత్రికి తరలించారు.  వచ్చే మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశం చేస్తామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. చిన్న కె డి పాల్ వాగు దాటుతున్న జవాన్ల ను చూసిన మావోయిస్టులు బెదిరిపోయి ప్రెషర్ బాంబు పేల్చారు. . కర్రెగుట్టలపై రావొద్దని ఇప్పటికే మావోయిస్టులు బెదిరింపు లేఖ  విడుదల చేశారు.  కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉంది. కొంత భాగం తెలంగాణ ములుగు జిల్లాలో ఉంది. కర్రెగుట్ట మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన వెంటనే పోలీసులు   ఇక్కడ జల్లెడ పడుతున్నారు.   కర్రెగుట్టల్లో మాటు వేసిన మావోయిస్టుల ను మట్టు పెట్టడం అంటే పోలీసులు తమ ప్రాణాలను  రిస్క్ లో పెట్టినట్టే. ఓ వైపు మావోయిస్టులు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే  జవాన్లపై ప్రెషర్ బాంబు పేల్చడం చర్చనీయాంశమైంది.   జవానుపై దాడి తర్వాత కర్రెగుట్ట ల్లో  మరో ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉంది. సుమారు 100 కిలో మీటర్ల దూరం వరకు కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.  ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. కాగా గురువారం జరిగిన ఘటనలో మావోయిస్టులు  పోలీసులపై  పై చేయిగా నిలిచారు.  
కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం Publish Date: Apr 10, 2025 1:27PM

ఒలింపిక్స్ లో క్రికెట్!

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు  128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు. అయితే ఆ తరువాత నుంచి ఒలింపిక్స్ కు క్రికెట్ దూరమైంది. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ఒలింపిక్స్ అసోసియేషన్. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్ట్, వన్డే ఫార్మట్లలో కాకుండా టీ20 ఫార్మట్ లో క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని నిర్ణయించారు. పురుషులు, మహిళల జట్లకు అవకాశం ఇచ్చారు.  అత్యంత జనాదరణ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం కచ్చితంగా క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరిక ఒలింపిక్స్ కు మరింత ఆదరణ పెరగడానికి దోహదం చేస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.
ఒలింపిక్స్ లో క్రికెట్! Publish Date: Apr 10, 2025 12:47PM

ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు 

2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరాడు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాణాను  ముందుగా ఎన్ ఐ ఏ అధికారులకు అప్పగించనున్నారు. అక్కడనుంచి రాణాను తీహార్ జైలుకు అప్పగించనున్నారు.  భారత్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 26 నవంబర్ 2008 ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. నిన్న రాత్రి ఏడుగంటల పదినిమిషాలకు  ప్రత్యేక విమానంలో  అమెరికా నుంచి రాణా బయలు దేరాడు. 17 ఏళ్ల తర్వాత   భారత అధికారులు తీసుకొస్తున్నారు.  తహవూర్ రాణా ను ఎన్ఐఎన్ అధికారులు కస్టడీలో తీసుకునే  అవకాశం ఉంది. ఎన్ ఐ ఏ కార్యాలయంలో ఆయన్ని ప్రశ్నించనున్నారు.  తొలుత ముంబై పటియాల కోర్టు జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. భధ్రతా సమస్యల దృష్ట్యా ఆయన్ని ఆన్ లైన్ లో అప్పగించనున్నారు. లష్కర్ ఎ తోయిబా  ఉగ్ర సంస్థకు చెందిన రాణా రాక సందర్బంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ట్రావెల్ సంస్థను నిర్వహించే రాణా అమెరికన్ ఉగ్రవాది హెడ్లీతో పరిచయమైంది . ఈ పరిచయంతోనే హెడ్లీ ముంబై వచ్చి రెక్కీ నిర్వహించాడు. రాణా  వస్తున్న సందర్బంగా తీహార్  జైల్లో భధ్రతను పెంచారు. ముంబై బ్లాస్ట్ లో  రాణా 160 మందిని  పొట్టన బెట్టుకున్నాడు. ఈ  మారణ హోమంలో  పాల్గొన్న మరో టెర్రరిస్ట్ కసబ్ కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది.  కసబ్ తరహా రాణాకు ఉరిశిక్ష అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.
ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు  Publish Date: Apr 10, 2025 12:35PM

మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  అలాగే ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ విచారణకు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ఎటువంటి షీల్డ్ ఇవ్వలేమని స్పష్టం చేసింద. ఈ నేపథ్యంలో కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని అంటున్నారు.   అక్రమ మైనింగ్ కేసులో   పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి  ఇప్పుడు  అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లడమే మార్గం. ఈ నేపథ్యంలోనే పోలీసలుు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ఏ4గా ఉన్న మాజీ మంత్రి కాకాణి  వరుసగా మూడు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే  కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.  హైదరాబాద్‌, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు సమాచారం ఇచ్చారు. ఆయన కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 
మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు Publish Date: Apr 10, 2025 11:15AM

ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు  చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి.  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ  అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’  హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు  డబల్ బెడ్  రూమ్ హామీ ఇస్తారు.  అయితే  ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక  పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ  భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం  ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు.  పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్‌ బాగ్‌లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  షాలిమార్ భాగ్  నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే  పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు  మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.   ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న  ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి  ప్రస్తుత వాసంలో  వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు,  వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా  ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు.  నిజానికి  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం  షీష్ మహల్  కట్టించారు. అయితే, షీష్ మహల్   నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున  దుర్వినియోం చేసిందని  అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో  తెలియదు కానీ  మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్  (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.  సో.. అన్నిఅరోపణలు చేసి  అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి  ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే  పరువు అసలు దక్కదని  బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి  ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి  కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు.  అదలా  ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్‌ లైన్స్‌ లేదా లుటియెన్స్‌ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్‌ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత  మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..! Publish Date: Apr 10, 2025 11:07AM

ఎరుపు, నలుపు...  ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..!

ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత  గురించి ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి, చల్లటి నీటి కోసం  తాపత్రయ  పడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలామందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే..   మట్టి కుండలు కొంటూ  ఉంటారు.   గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా,  పట్టణ ప్రాంత ప్రజలు అయినా   మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు.  ఎందుకంటే ఈ మట్టి  కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ  నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ  మార్కెట్లో రెండు రకాల మట్టికుండలు కనిపిస్తూ ఉంటాయి.  ఒకటి ఎరుపు రంగు కాగా.. మరొకటి నలుపు రంగు.  ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నలుపు రంగు కుండ.. నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది, అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ  కూడా మంచిదే అయినప్పటికీ, నల్లటి కుండతో  పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్‌తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి. కల్తీని ఎలా గుర్తించాలి.. కుండ  కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి, అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి, చల్లని  ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్చమైన మట్టి కుండను ఎంచుకోవాలి. కుండ మందం.. మట్టి కుండల  షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా, మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని  మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై  శ్రద్ధ వహించాలి. లీక్ టెస్ట్.. తరచుగా ప్రజలు మట్టి కుండ  కొనేటప్పుడు తొందరపాటులో లీక్ టెస్ట్ చేయడం మర్చిపోతారు.  తరువాత ఇంటికి వచ్చి కుండను నీటితో  నింపినప్పుడు కుండ లీకవ్వడం చూసి బాధపడతారు. కాబట్టి దుకాణంలోనే నీటిని పోసి లీక్ టెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచో నీళ్లు కారుతుండటం తెలుసుకోవచ్చు.  ఇలా చేయడం వల్ల  మళ్లీ మళ్లీ షాపుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ తప్పులు చేయకండి.. తరచుగా  అందానికి ఆకర్షితులై, మరింత మెరిసే కుండలను కొంటారు. అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు. కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి. దీనితో,  కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు.  నీటిని బయటకు తీయడానికి దాన్ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఇది నీటిని స్వచ్ఛంగా,  చల్లగా ఉంచుతుంది.   *రూపశ్రీ.
ఎరుపు, నలుపు...  ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..! Publish Date: Apr 10, 2025 10:54AM

చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు

ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్  ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు   మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్ధితిలో ఉన్నారు. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిలు మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  ఇప్పటికే  పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు  నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 11) విచారణకు హాజరు కావాల్సిందిగా  ఆ నోటీసులలో పేర్కొన్నారు.  జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.  
చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు Publish Date: Apr 10, 2025 10:53AM

ఆహారం తినేటప్పుడు ఈ పనులు చేస్తే బలంగా ఉంటారు..!

ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు,   అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి.  ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో  వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట. కడుపు నిండుగా తినకూడదు.. పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా  ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట.  అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా  జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం.. తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని  అనుసరిస్తుందట.   మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి. సమయం.. రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది,  ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహార స్థితి.. ఆహారం చల్లగా అయిన తరువాత  మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత   గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉపవాసం.. అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట.  దీనికి బదులుగా  ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే   తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం.  దీని వల్ల  తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే  భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఉష్ణోగ్రత..  తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.  ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది.                                    *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం తినేటప్పుడు ఈ పనులు చేస్తే బలంగా ఉంటారు..! Publish Date: Apr 10, 2025 10:51AM

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా మాజీ సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే  వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది.  
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్ Publish Date: Apr 10, 2025 10:38AM

తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం   ఉత్తర దిశగా కదులుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ అల్పపీడన ప్రభావం తమళనాడు వరకూ ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 10) నుంచి వాతావరణం 12వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వర్షాలకు తోడు తీవ్రమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో అయితే తెలంగాణలో క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో గురువారం (ఏప్రిల్ 10) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌, పాలమూరు, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.   
తెలుగు రాష్ట్రాలలో మూడు  రోజుల పాటు వర్షాలే వర్షాలు Publish Date: Apr 10, 2025 10:38AM

కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య

కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం బీహార్ లో జరిగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సుష్మను కాల్చి చంపిన ఆమె భర్త రమేష్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ సింగ్ తన భార్య సుష్మను బంధించి ఆమె ఛాతి భాగంలో తుపాకీతో కాల్చి హత్య చేశాడు.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య Publish Date: Apr 10, 2025 7:19AM

ట్రేడ్వార్‌.. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నచైనా

ట్రేడ్‌ వార్‌లో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.  డ్రాగన్‌ దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్‌ 104 శాతం సుంకం విధించిన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్‌ తాజాగా ప్రకటించింది. గురువారం (ఏప్రిల్ 10)   నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్‌.. ఏప్రిల్‌ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, లేదంటే  అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని హెచ్చరించారు. అయితే ఆ గడువులోగా  చైనా స్పందించలేదు. దీంతో ట్రంప్ అన్నంత పనీ చేశారు. గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా చర్యకు ప్రతిగా తాను కూడా  మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి ట్రేడ్ వార్ కు సై అంది.
ట్రేడ్వార్‌.. అమెరికాతో   ఢీ అంటే ఢీ అంటున్నచైనా Publish Date: Apr 10, 2025 7:00AM

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మంత్రం.. మల్లీప్లెక్స్ లలో మద్యం?

ఓటీటీలు వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అన్నది బాగా తగ్గిపోయింది.   ఒకప్పుడు సినిమా తప్ప వినోదానికి మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ, మొబైల్స్‌ వంటివి థియేటర్ల ప్రాధాన్యాన్ని చాలా వరకూ తగ్గించేశాయి. ఒకప్పుడు కొత్త సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త సినిమా విడుదలైనా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారన్న గ్యారంటీ లేదని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.   రోజురోజుకీ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఓటీటీ.  ప్రతి సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుండటంతో  ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన థియేటర్లకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. అందుకే పివిఆర్‌ సంస్థ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు ఓ కొత్త ఆలోచన చేస్తోంది. మల్టీప్లెక్స్‌లలో మద్యం అమ్మకాలు  చేయాలనేది ఆ ఆలోచన. మద్యం సేవించి థియేటర్లలోకి ప్రవేశించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సడలించాలని, షాపింగ్‌ మాల్స్‌లో మాదిరిగానే థియేటర్స్‌లో కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని పివిఆర్‌ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, గుర్గావ్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ.. మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే కొన్నిఎంపిక చేసిన థియేటర్లలో మద్యం అమ్మకాలు సాగించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది.  విదేశాల్లోని లగ్జరీ థియేటర్స్‌లో ఈ సదుపాయం ఉంది.   ఇక్కడ కూడా అది అమలు అయితే థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తారని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.  తద్వారా థియేటర్లకు ఆదాయం పెరుగుతుంది. దానితోపాటే ప్రభుత్వానికి కూడా ఆదాయం  ఉంటుంది. అలాగే సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుందని పివిఆర్‌ భావిస్తోంది. మరి ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మంత్రం.. మల్లీప్లెక్స్ లలో మద్యం? Publish Date: Apr 10, 2025 6:31AM

తెలుగుదేశం పగ్గాలు లోకేష్ కు.. పిఠాపురం వర్మ తాజా డిమాండ్

పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే  కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పిఠాపురం వర్మకు ఆహ్వానం అందలేదు. అయితే నాగబాబు పర్యటన ఆద్యంతం తెలుగుదేశం క్యాడర్ వర్మ అనుకూల నినాదాలు చేశారు. వాస్తవానికి పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అప్పట్లో ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ పదవి   ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దత దారులు, తెలుగుదేశం క్యాడర్ నిరసనలు చేశారు.  వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనటం పై ఆందోళన వ్యక్తం చేసారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత పిఠాపురంలో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా, ఇప్పటి వరకూ  ఇటు తెలుగుదేశం అధినాయకత్వం కానీ, అటు జనసేనాని కానీ స్పందించలేదు.   ఈ నేపథ్యంలో పిఠాపురం వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకీ ఆయన అన్నదేమిటంటే.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ వైఖరి ఏమిటన్న చర్చకు తెరతీశాయి. అదలా ఉంచితే..  గతంలో కూడా పిఠాపురం వర్మ  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు.   కాకినాడ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో బుధవారం (ఏప్రిల్ 9) మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం అవసరమన్నారు.  యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారనీ, అంతే కాకుండా అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాలుపంచుకోని సీనియర్లంతా అనివార్యంగా బయటకు వచ్చి ప్రజలలో మమేకం అయ్యేలా చేశారనీ  అన్నారు. విజన్ 2047తో పాటుగా పార్టీ భవిష్యత్ కోసం కూడా 2047 ప్రణాళికను రూపొందించాలని పిఠాపురం వర్మ అన్నారు.  
తెలుగుదేశం పగ్గాలు లోకేష్ కు.. పిఠాపురం వర్మ తాజా డిమాండ్ Publish Date: Apr 9, 2025 5:49PM

 వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ

వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.  గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు.  ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ  సిఐడి ప్రత్యేక న్యాయస్థానం  తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది.  బుధవారం నాడు ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 9 మందిని  కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పలుమార్లు రిమాండ్ ను పొడిగించిన న్యాయస్థానం మరో మారు పొడిగించడంతో వంశీ షాక్ లో ఉన్నారు. ఆయన పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తుచేస్తున్నప్పటికీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం లేదు. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో కూడా వంశీ నిందితుడు.
 వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ Publish Date: Apr 9, 2025 5:42PM

తైవాన్‌లో మళ్లీ భూకంపం

వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది.  గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. గత నెల 28న 7.7 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అప్పటి భూకంపంలో 3600 మందికి పైగా మరణించారు. మరో 5 వేల 17 మంది గాయపడినట్లు తైవాన్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ మరో 160 మంది జాడ తెలియల్సి ఉందని పేర్కొంది. ఆ భూకంపానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయాందోళనలకు గురౌతున్నారు. బుధవారం (ఏప్రిల్ 9)న కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   ఈశాన్య తీరంలోని యిలాన్‌కు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరంలో భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.  కు సిబ్బంది సహకారం అందించారన్నారు.
తైవాన్‌లో మళ్లీ భూకంపం Publish Date: Apr 9, 2025 4:43PM

జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక

రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలూడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పని చేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసం జగన్ తీపత్రేయపడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు.  పోలీసు యూనిఫారం ఉక్కు కవచం వంటిదనీ, రాజ్యాంగ హక్కును కాపాడేదనీ చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.   అంతకు ముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు యూనిఫారం జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించినది, ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమీ అరటి తొక్క కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీసు యూనిఫారంలో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా ఛస్తాం అంతే కానీ ఎవడి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు.  
జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక Publish Date: Apr 9, 2025 4:28PM

ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం... ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారి అయ్యాయి. ఈ విషయాన్ని సిట్ అధికారులకు సిబిఐ సమాచారమిచ్చింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ప్రభాకర్ రావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే మకాంవేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం అపఖ్యాతిని మూట గట్టుకుంది. 
ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం... ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు  Publish Date: Apr 9, 2025 4:18PM

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్!

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్‌లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి, కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్‌గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్‌ని రివీల్ చేస్తున్నారు.  వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్‌ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రాం మందిరంలో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్‌ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు, భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హొలీ వేడుకల్నీ అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హొలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.  అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీ రామ నవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేరాఫ్ జగ్గారెడ్డి  అనే విధంగా హడావుడి చేస్తున్నారంట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్తా భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం... సినిమాలో జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజ్‌లో పడ్డారట.   పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరి కొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి.. మౌనంతోను రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.
 జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్! Publish Date: Apr 9, 2025 4:00PM

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  అమరావతి నుండి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించిన  సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కేంద్రం రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది.    గత నెల 3న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఏపీ ఎస్‌ఎఫ్‌సీ విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు, అప్పుల పంపకం, రోడ్డు, రైలు, విద్యా సహా పలు అంశాలపై ఈ సమావేశం చర్చించింది.  ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృత అంశాలపై రెండు రాష్ట్రాల  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపింది. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.  రెండేళ్లలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు ప్రకటించింది.   వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో రూ.350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయశాఖ వెల్లడించింది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.  
అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Publish Date: Apr 9, 2025 3:35PM

క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 1 తరువాతే సీడ్ స్టాకింగ్ ఆరంభించనున్నట్లు ప్రకటించాయి. రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై భీమవరంలో మంగళవారం (ఏప్రిల్ 8)న జరిగిన అక్వారైతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచీ ఆక్వారైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రొయ్యల మేత నుంచి మద్దతు ధర వరకూ అన్ని విధాలుగా తమకు అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో రొయ్యల సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వచ్చిన రైతులు స్పష్టం చేశారు.   
క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం Publish Date: Apr 9, 2025 3:16PM