Top Stories

పోటీలోఆ రెండు పార్టీలే.. అందుకే ఆసక్తి!

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ( ఎమ్మెల్సీ  ఎన్నికల, పోలింగ్ కు ఇంకా వారం రోజులకు పైగానే సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయినా ఇంకా పోలింగే జరగక పోయినా,ఫలితం అయితే వచ్చేసింది.గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం(ఎల్ఎసీ)ఎలెక్టోరల్ కాలేజీ లో పార్టీలకు ఉన్న బలా బలాను బట్టి చూస్తే,ఎంఐఎం గెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినా, ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది?  అంటే,  అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.   హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.ఈ లెక్కన, ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. సో, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్   గెలుపుకు ముందు గానే ఖారరై పోయింది అందుకే, కావచ్చును,ఎలెక్టోరల్ కాలేజీలో 24  ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రస్ పార్టీ పోటీకి దిగలేదు.కానీ, పాతిక ఓట్లు మాత్రమే ఉన్న  బీజేపీ మాత్రం, బరిలో దిగింది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారుగోముల గౌతం రావును బీజేపీ బరిలో దింపింది. మరో వంక  అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలవి కాని చోట అధికులం అనరాదు అనుకున్నారో, లేక ఇంకా ఏదైనా ‘రహస్యం’ వుందో ఏమో కానీ, ముందుగానే ఓటమిని అంగీకరించి, చేతులెత్తేశాయి. తమ అభ్యర్ధులను బరిలో దింప లేదు.  దీంతో హైదరాబాద్ ఎల్ఎసీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే, ఏదో అద్భుతం జరిగితే తప్పించి, ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గెలుపును ఆపడం, మోదీ, షా దిగి వచ్చినా అయ్యేపనికాదని అంటున్నారు. అయితే  ఈ వాస్తవం బీజేపీకి తెలియదా  అంటే తెలుసు. అయితే  ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డు కునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే, కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాతమే కాదు,   గెలిచేందుకు కూడా పోటీ చేస్తున్నామని బీజీపే నాయకులు, మరోమాట అంటున్నారు. అంతే కాదు, మా గెలుపు లెక్కలు మాకున్నాయని కొంచెం ధీమాగానే చెపుతున్నారు.  కాషాయ పార్టీ  క్రాస్ వోటింగ్  పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. మరో వంక ఓటింగ్ లో పాల్గొంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేక పోలేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవంక ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల స్టాండ్ ఏమిటి అన్నది ఇంకా స్పష్టం కాలేదు.   మాకు బలం లేదు, అందుకే పోటీచేయడం లేదు అంటున్నారే, కానీ, తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అంతేకాదు, మద్దతు గురించి చెప్పక పోవడమే కాదు, అసలు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. మరో వంక  మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందనీ, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని  ఆరోపిస్తున్నారు.  మరో వంక, బీజేపీ హిందూ కార్డును తెర పైకి తెచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. హనుమత్  జయంతిని పురస్కరించుకుని, శనివారం (ఏప్రిల్ 12) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానం మేరకు, ఆకాశపురి, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో  బండి సంజయ ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురికావద్దని  పరోక్షంగా హెచ్చరించారు. అంతే కాకుండా  ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మల్యే రాజా సింగ్ అద్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా  లక్ష మందికి పైగా హిందువులు ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు  కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం ఓడించేందుకు , బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపు  ఇచ్చారు.    అయితే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు లేదా ఇతరత్రా కారణాల కారణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్  కార్పొరేటర్లు  క్రాస్ ఓటింగ్ చేస్తారా? అనేది, ఎలా ఉన్నా  ఆసలు అ రెండు పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా? లేదా? అనేది అన్నిటినీ మించిన బిగ్ క్వశ్చన్  అంటున్నారు.  అదలా ఉంటే  ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా వుంది. అంతే కాకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ, సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నఆరోపణలకు, ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే  బీజేపే కూడా  రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరిధించే సత్తా, సంకల్పం ఒక్ బీజేపీకి  మాత్రమే ఉన్నాయని నిరూపించుకునేందుకు, తద్వారా హిందూ ఓటు బ్యాంకును పతిష్ట పరచుకునేందుకు, ఇదొక అవకాశంగా బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే, ఫలితం ముందుగానే తేలి పోయినా  హైదరాబాద్  ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నిక, మరో కోణంలో ఆసక్తిని రేకేతిస్తోందని  అంటున్నారు.
పోటీలోఆ రెండు పార్టీలే..   అందుకే ఆసక్తి! Publish Date: Apr 13, 2025 3:26PM

జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ

వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్   తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. 74 వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ  వైసీపీ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు. తిప్పలనాగిరెడ్డి  తొలి దశ నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపు విషయమై  వంశీ కౌన్సిల్లో పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.  తాజాగా జీవీఎంసీ లో మేయర్ పీఠాన్ని మార్చే క్రమంలో కూటమి నాయకులు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న  చర్చ జరగనుంది.  ఈ దశలో  వంశీ  వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడం నిస్సందేహంగా జగన్ పార్టీకి బిగ్ షాక్.  నిజానికి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరం ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది వీరితో పాటు మరో ఐదు వైసీపీ సభ్యులు  తమతో టచ్ లో ఉన్నారని   పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారు.  దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది.  ఇప్పటికే కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  అయినప్పటికీ ఈ రకంగా పార్టీ కార్పొరేటర్లు జారిపోడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.  తాజాగా తిప్పల వంశీ మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు.  వార్డు అభివృద్ధి విషయంలో వివక్ష  కారణంగా వంశీ పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు చెబుతున్నారు.
జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ Publish Date: Apr 13, 2025 12:12PM

పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు

తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు.  మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం ప్రస్షుటమైంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్‌పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 నుండి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు.   అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.   ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంి, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.  అలాగే   నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపించింది.  
 పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు  .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు Publish Date: Apr 13, 2025 11:13AM

పుంగనూరులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు..ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ మరోసారి రెచ్చిపోయింది.  పుంగనూరు మండలం కృష్ణాపురంలో టిడిపి కార్యకర్త రామకృష్ణ ఇటీవల వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే వైసీపీ మూకలు మరో సారి రెచ్చిపోయాయి. తెలుగుదేశం సానుభూతి పరులపై కత్తులు, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడికి  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణ స్వామి నేతృత్వం వహించారు. ఈ దాడిలో తెలుగుదేశం కు చెందిన హరినాథ్, హరినాథ్ భార్య కన్యాకుమారి, వెంకటేష్ లు గాయపడ్డారు. క్షతగాత్రులను పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   ఇప్పుడు వైసీపీ మూకల దాడిలో గాయపడిన వారు ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ బంధువులే కావడం గమనార్హం. గత కొంత కాలంగా తమపై దాడి చేసేందుకు పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని హరినాథ్ ఆరోపించారు. గతంలో హత్యకు గురైన రామకృష్ణ కూడా తనకు పెద్దిరెడ్డి మనుషుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, అప్పడూ వారు పట్టించుకోలేదనీ ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   
పుంగనూరులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు..ముగ్గురికి గాయాలు Publish Date: Apr 13, 2025 10:54AM

పిఠాపురం వర్మకు చంద్రబాబు షేక్ హ్యాండ్.. గ్యాప్ ప్రచారానికి ఎండ్ కార్ట్!

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కర్యక్రమానికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమా కుమారుడి నిశ్చితార్థ వేడుకకు పిఠాపురం వర్మ కూడా వచ్చారు. పిఠాపురం వర్మను చూడగానే చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  వాస్తవానికి గత కొన్ని నెలలుగా పిఠాపురం వ్యవహారాలు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేసిన వర్మకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాడర్ లో బలంగా ఉంది.  2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లూ చేసుకుని కూడా   జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించి, పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పగానే క్షణం ఆలోచించకుండా తన  సీటును పవన్ కోసం త్యాగం చేసి చంద్రబాబు మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం  శ్రమించారు.   అక్కడి వరకూ అంతా బానే ఉన్నా.. ఆ ఎన్నికల సందర్భంగా   ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన  హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు.   రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు   ఛాన్స్ దక్కలేదు. అలాగే నియోజకవర్గంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించే విధంగా జనసేన పావులు కదపుతూ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే..ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గ పర్యనటలో వర్మకు ఆహ్వానమే లేకుండా పోయింది. అంతకు ముందు కూడా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాగ బాబు పిఠాపురం పర్యటన ఆద్యంతం అడుగడుగునా తెలుగుదేశం నిరసనలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్మ కాకినాడలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లోకేష్ కు పగ్గాలు, అలాగే 2047 విజన్ డాక్యుమెంట్ లా పార్టీ కోసం కూడా ప్రణాళిక రూపొందించాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిఠాపురం వర్మను ఆప్యాయంగా పలకరించడం, షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చటించడంతో వర్మలో అసంతృప్తి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వర్మతో చంద్రబాబు ఆత్మీయంగా మాట్లాడటం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా జోష్ ను నింపింది. 
పిఠాపురం వర్మకు చంద్రబాబు షేక్ హ్యాండ్.. గ్యాప్ ప్రచారానికి ఎండ్ కార్ట్! Publish Date: Apr 13, 2025 9:56AM

రోడ్ సేఫ్టీ కోసం దణ్ణం పెట్టిన ఢిల్లీ సీఎం

సింప్లిసిటీకి  నిదర్శనంగా నిలుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా. తాను చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 14) ఆమె వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరేయడాన్ని చూశారు. దీంతో వెంటనే కాన్వాయ్‌ ఆపి స్వయంగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రినని పరిచయం చేసుకున్న రేఖాగుప్తా  మరో సారి అలా చేయొద్దని చేతులు జోడించి రిక్వెస్ట్‌ చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ఢిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టె ముక్క విసరడం ఆమె చూశారు. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లి,   రోడ్లపైకి ఆహారాన్ని విసిరేయడం వల్ల వాటిని తినేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయని, అప్పుడు మూగజీవాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనదారులూ, రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమేనని, అంతేకాదు.. ఆహారాన్ని ఇలా అగౌరవ పరచకూడదని సూచించారు. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే, గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్లాలని,  రోడ్లపై ఆహారాన్ని విసరొద్దని, మూగజీవులను ప్రేమించాలనీ చెప్పారు.  మన సంస్కృతిని గౌరవించండి రహదారి భద్రతను పాటించండని  సీఎం రేఖా గుప్తా తన ట్వీట్లో ఢిల్లీ వాసులందర్నీ కోరారు. ఢిల్లీలోని హైదర్‌పుర్‌ ఫ్లైఓవర్‌పై శనివారం ఈ ఘటన జరిగింది.
రోడ్ సేఫ్టీ కోసం దణ్ణం పెట్టిన ఢిల్లీ సీఎం Publish Date: Apr 13, 2025 7:01AM

సన్ రైజర్స్ పరుగుల సునామీ..పంజాబ్ పై అద్భుత విజయం

అభిషేక్ వర్మ మెరుపు సెంచరీ.. 245 పరుగుల లక్ష్యం 18.3 ఓవర్లలోనే ఛేదన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఆ వర్షంలో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దైపోయారు. క్రికెట్ మజా ఏమిటో  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో శనివారం రాత్రి హైదరాబాద్ సన్ రైజర్, పంజాబ్ కింగ్స జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే అర్ధమౌతుంది. ఐపీఎల్ లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఎవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు దాదాపు అసాద్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలతో నీరసించి ఉన్న సన్ రైజర్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమేనని అంతా భావించారు. అయితే సన్ రైజర్స్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కొండంత లక్ష్యాన్ని అలవోకగా కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసి అద్భుతం సృష్టించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వారి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్స్ కూడా ప్రేక్షుకులుగా మారిపోయారు.  భారీ స్కోరు ఛేదనలో సన్ రైజర్స్ కు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లిద్దరూ చెలరేగి ఆడారు.   అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు.. 10 సిక్సర్లతో) 141, ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 9 పోర్లు, 3 సిక్సర్లతో ) 66 చెలరేగి ఆడటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. వీరిరువురూ కలిసి తొలి వికెట్ కు 12.2 ఓవర్లలోనే 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత హెడ్ ఔటైనా అభిషేక్ తన పరుగుల వరద కొనసాగించాడు. ఆ తరువాత అభిషేక్ వర్మ ఔటైనా అప్పటికే సన్ రైజర్స్ విజయం ఖరారైంది.  చివర్లో క్లాసన్(21), కిషాన్ (9) మ్యాచ్ ను ముగించేశారు.   
సన్ రైజర్స్ పరుగుల సునామీ..పంజాబ్ పై అద్భుత విజయం Publish Date: Apr 12, 2025 12:54AM

భార్య, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ ను తీసుకుని సింగపూర్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్  సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్నపవన్ విషయం తెలియగానే విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ కోలుకుని డిశ్చార్జ్ కాగానే పవన్ కల్యాణ్ తన కుమారు, భార్యతో కలిసి శనివారం రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.    సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం పవన్ భార్య లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్   సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా…సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే  పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడమే కాకుండా    అగ్ని ప్రమాదం సందర్భంగా అలుముకున్న దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో  శ్వాస సంబంధిత సమస్యతో  ఇబ్బంది పడ్డాడు, దీంతో   సింగపూర్ ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స తీసుకున్నాడు. అనంతరం గురువారం  సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఆ తర్వాత  శనివారం పవన్ కల్యాణ్ తన భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చారు.  
భార్య, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్ Publish Date: Apr 12, 2025 12:26AM

ప్రెసిడెంట్‌కి టైం బాండ్.. సుప్రీం సంచలన తీర్పు

రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు  సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి ఉంచడంపై నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెల రోజులు మాత్రమేనని తీర్పు ఇచ్చింది. 415 పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 11) 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెస్‌సైట్‌లో ఉంచారు.  కాగా గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని, నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సుచించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం మంత్రి మండలి సలహా సూచనల మేరకు గవర్నర్లు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుందని, రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసే అధికారం గవర్నర్లకు లేదని మార్చి 8న ఇచ్చిన తీర్పులో సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిర్దిష గడువులోగా గవర్నర్ చర్య తీసుకోకుంటే గవర్నర్ చర్య జ్యుడిషియల్ స్కృటినీని ఎదుర్కోవలిసి వస్తుందని హెచ్చరించింది.  కాగా, గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే మొదటి సారి. శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించకపోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది.
ప్రెసిడెంట్‌కి టైం బాండ్.. సుప్రీం సంచలన తీర్పు Publish Date: Apr 12, 2025 11:56PM

ఆంధ్రా ‘అంకుశం’ ఏబివి రాజకీయ అరంగేట్రం

అమలాపురం వేదికగా ఆదివారం ప్రకటన నీతి నిజాయితీలకు మారు పేరు, డిపార్ట్‌మెంట్‌లో అంకుశం అనిపించుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 13) అమలాపురం వేదికగా ఆయన తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయబోతున్నారన్న విషయం ఇటు రాజకీయవర్గాల్లో, అటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  పోలీసు డిపార్టుమెంట్లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవరూ ఎదుర్కోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవీబీ అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బందిపడ్డారు. వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. మళ్లీ 2022 జూన్‌ 28 నుంచి 2024 మే 30 వరకు నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారు.  తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్‌గా క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.  2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌‌గా పని చేశారు. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్‌ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు. 2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా.. ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించారు. మళ్లీ 2022 జూన్‌ 28న రెండోసారి కూడా సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించగా.. అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్‌ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. కొన్ని గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు.  గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా.. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని గుర్తించారు. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్‌ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో ఏపీ సర్కారు అధికారంలోకి రాగానే రిటైర్ట్ ఐపీస్ ఏబీవీని ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. అయితే గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రగిలిపోతున్న ఏవీబీ ఇంతవరకు ఆ బాధ్యతలు స్వీకరించలేదు. వైసీపీ అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్ విభాగాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఆయన అభిమానులుభావించారు. రిటైర్ అయ్యాక ఆయన జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని ‘కమ్మ’రోనా అంటూ అన్నిటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కూర్చీ కోడుకి కూడా సరితూగని  తుచ్ఛుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ ప్రభుత్వ హాయాంలో సర్వీసు పరంగా విపరీతమైన వేధింపులు, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఏబీవీ తన రాజకీయ ప్రస్థానంలో జగన్ భాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అమలాపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ఆయన అక్కడ జగన్ కారణంగా తీవ్ర వేధింపులకు గురై దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. క‌ృష్ణాజిల్లా నూజివీడుకి చెందిన ఈ కమ్మ సామాజిక వర్గం సీనియర్ కులం కారణంగానే జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన పొలిటీషియన్ అవతారమెత్తితే తన సీనియార్టీతో ఇక జగన్‌కు చుక్కలు చూపించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రా ‘అంకుశం’ ఏబివి రాజకీయ అరంగేట్రం Publish Date: Apr 12, 2025 9:26PM

UPI సేవలు గోవిందా.. గోవిందా!

దేశ వ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు గంట సేపు ఈ సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ పని చేయలేదు. ఈ పరిస్థితి దాదాపు గంటకు పైగా ఉంది.   దీంతో అనేక మంది యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గంట సేపూ వినియోగదారులు చెల్లింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగదు లావాదేవీల కంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైనే అత్యధికులు ఆధారపడుతున్న తరుణంలో యూపీఐ సేవలకు ఇలా అంతరాయం ఏర్పడటం దారుణమని వినియోగదారులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఇటీవలి కాలంలో  తరచూ ఎదురౌతోందని ఆరోపిస్తున్నారు.  
UPI సేవలు గోవిందా.. గోవిందా! Publish Date: Apr 12, 2025 4:15PM

అప్పుల చక్రంలో ఆర్థిక వ్యవస్థ?

అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడు అని సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో ఏమో కానీ.. అప్పులు తెచ్చుకొనేందుకు కూడా తెలంగాణ  ప్రభుత్వం ఓ బ్రోకరేజ్‌ సంస్థను పెట్టుకున్నదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తాజా ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అయితే  మాత్రం ఆ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.   అఫ్కోర్స్ ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే కాదు.. చాలా వరకు ప్రభుత్వాలది అదే పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితిలో,ఇలాంటి బ్రోకరేజ్ సంస్థలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు లేక పోలేదు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అప్పుల కోసం అడ్డదారులు తొక్కిన సందర్భాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ చేసిన ఆరోపణకు ఆధారం కూడా ఆయన శోధించి సాధించింది కాదు. బీఆర్ఎస్ సభ్యుడు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఆధారంగానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారు.      అయితే అంత మాత్రం చేత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల వేట సాగించడం సమర్ధనీయం కాదని ఆర్థిక  నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో కెల్లా పెద్ద తప్పు అభివృద్ధి, సంక్షేమం పేరున అవసరానికి మించి అందిన కాడికి అప్పులు చేయడం. మరోవంక అదే అభివృద్ధి, సంక్షేమం ముసుగులో  లెక్కాపత్రం లేకుండా ప్రభుత్వ భూములను విక్రయించడం. ఫలితంగా ఆర్థిక క్రమ శిక్షణ పట్టాలు తప్పింది. అవినీతి పెచ్చిరిల్లింది. ధనిక రాష్ట్రం ఇదిగో ఇలా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెపుతున్న అప్పులు పుట్టని అధ్వాన స్థితికి చేరిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.    అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం బాటలో అప్పుల భారం పెంచుకుంటూ పోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై పూర్తి అవగాహన వుంది. ఎందుకంటే.. కట్టే, కొట్టే,తెచ్చే అన్నట్లు మూడు ముక్కల్లో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని  సామాన్యులకు కూడా చక్కగా  అర్థమయ్యేలా పలు సంధర్భాలలో వివరించారు.  అవును గత బీఆర్ఎస్  ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. ఆ అప్పుల పై నెలనెలా అనివార్యంగా చెల్లించవలసిన అసలు, వడ్డీ తడిసి మోపెడై కూర్చున్నాయి. సర్కార్ బండి కదలడం లేదు అని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక దగ్గర కాదు,ఎక్కడంటే అక్కడ లెక్కల చిట్టా విప్పి చెపుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలసరి ఆదాయం రూ. 18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లు, అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లకు రూ. 6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల చెల్లింపుకు మరో రూ. 6,500 కోట్లు.. తప్పించుకోలేని ఈ రెండు పద్దులకు పోనూ సర్కార్ చేతిలో మిగిలేది’ కేవలం రూ.5000 వేల నుంచి రూ.5500 కోట్లు మాత్రమే. ఇందులోంచే  అన్నీ చేయాలని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అద్దంలో ప్రతిబింబంలా చూపించారు. అలాగే కొండలా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ తేదీన జీతాలు చెల్లించేందుకు పడుతున్న కష్టాల గురించి  ఇలా ప్రభుత్వం  పడుతున్నఈతి బాధలగురించి ఎన్నో సందర్భాలలో చక్కగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చెప్పే మాటలన్నీ నిజాలేనా అంటే.. అవున కానీ, కాదని కానీ చెప్పడం కుదరదు.  అలాగే విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన తాజా ఆరోపణల విషయంలోనూ... ఆయన అంతా నిజమే చెప్పారని అనుకోనవసరం లేదు. కానీ ఓ వంక గత ప్రభుత్వ నిర్వాకం పుణ్యాన పైసా అప్పు పుట్టడం లేదని అంటూనే.. ఈ 15 -16 నెలల కాలంలో అక్షరాలా లక్షన్నర కోట్లరూపాయలు అప్పు చేసినట్లు సర్కార్ లెక్కలే చెపుతున్నప్పుడు  దాల్ మే కుచ్ కాలా హై అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అదికూడా ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసిందంటే.. కేటీఆర్ చేసిన  ‘బ్రోకరేజ్‌’ ఆరోపణను కొట్టి వేయడం కుదరదని విశ్లేషకులు అంటున్నారు.  ఇక విషయంలోకి వస్తే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబందించి ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్‌లో రేవంత్‌ సర్కారు రూ.10,000 కోట్ల అప్పు తెచ్చింది. అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్‌ సంస్థగా పనిచేసిన  ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’  రాష్ట్ర ప్రభుత్వం రూ.169,కోట్లు చెల్లించిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆరోపణలు, ప్రత్యారోపణల విషయం పక్కన పెడితే.. అప్పులు, అమ్మకాలపై అధాపడిసాగుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్క బడడం, పట్టాలు ఎక్కడం  ఇక కష్టమే అంటున్నారు.
అప్పుల చక్రంలో ఆర్థిక వ్యవస్థ? Publish Date: Apr 12, 2025 3:17PM

అవును.. ఆ ఇద్దరరూ మళ్ళీ ఒకటయ్యారు!

భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పట్టుకోసం చేసే ప్రయత్నాలు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతున్నాయి.  అందుకే నాలుగు పదులకు పైబడిన ప్రస్థానంలో కేంద్రంలో వరసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చినా, తమిళనాడులో  మాత్రం, ఒకటీ అరా సీట్లే కానీ  అంతకు మించి మరో అడుగు వేయ లేక పోతోంది.  అందుకే పొత్తుల ప్రయాణానికే  ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే క్రమంలో ఇప్పడు మరో మారు.. అన్నాడీఎంకేతో  పొత్తుకు బీజేపీ పచ్చజెండా ఊపింది. భారతీయ జనతా పార్టీ మరో పాత మిత్రపక్షంతో, మరో మారు జట్టు కట్టింది. లోక్ సభ, రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు ముందుఆంధ్ర ప్రదేశ్ లోమాజీ మిత్ర పక్షాలు తెలుగు దేశం,జనసేనతో, పొత్తు పెట్టుకుని  ప్రయోజనం పొందిన బీజేపీ ఇప్పడు ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ మాజీ మిత్ర పక్షం అన్నాడీఎంకేతో  మరోమారు చేతులు కలిపింది. మరో మారు పొత్తు పెట్టుకుంది. కాగా  రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శుక్రవారం (ఏప్రిల్12) చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.పళని స్వామి, అన్నాదురైతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఈసారి కుదిరిన పొత్తు పదికాలాల పాటు పటిష్టంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అలాగే అవినీతి కుంభకోణాల పుట్టగా మారిన డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అమిత్ షా విశ్వాసం వ్యక్త పరిచారు.  నిజానికి ఉభయ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి పొత్తు సంబందిదించిన చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే  అదే సమయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకేతో  పొత్తుకు అంత  సుముఖంగా లేరనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపధ్యంలో పొత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్నామలై  బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడంతోపాటుగా  పొత్తుకు స్వాగతం పలికారు. డిఎంకే అరాచక పాలనను అంతమొందించేందుకు బీజేపీ,అన్నాడీఎంకే పొత్తు సరైన అస్త్రం అవుతుందని అన్నామలై ప్రకటించారు. అలాగే  బీజేపీ రాష్ట్ర  అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పు కున్నారు. దీంతో పొత్తు ప్రక్రియ అనుకున్నట్లుగా జరిగిపోయింది. మరోవంక  అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషంగా పేర్కొంటున్నారు.  కాగా  234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్   నెలల్లో  ఎన్నికలు జరుగనున్నాయి.  తమిళనాడులో ఏఐఏడీఎంకే,  బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.  2004 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, అన్నాఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ విడిగా పోటీ చేసినా ఒక్కటీ గెలువలేకపోయాయి. డీఎంకే 39 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో కలిసి ఉంటె కలదు జయం అనే నిజాన్ని కొంచెం అస్యంగానే అయినా అర్థం చేసుకున్న ఉభయ పార్టీల మళ్ళీ పొత్తు బంధంతో ఒకటయ్యాయి. అయితే.. పొత్తు కుదిరినంత మాత్రాన  అంతా అయినట్లు కాదనీ, ముఖ్యంగా పళని స్వామి, అనామలై మధ్య ఉన్న సంబంధాలపైనే పొత్తు ఫలితం ఆధార పడి ఉంటుందని అంటున్నారు.
అవును.. ఆ ఇద్దరరూ మళ్ళీ ఒకటయ్యారు! Publish Date: Apr 12, 2025 2:55PM

ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన బ్రిడ్జి.. చైనా మరో అద్భుతం!

గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజినీరింగ్‌ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్‌ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్‌ గ్రాండ్ కెన్యాన్‌ బ్రిడ్జిని నిర్మించారు.  2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా.. కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ కోసం 280 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2400 కోట్లు) ఖర్చు పెట్టారట. ఈఫిల్‌ టవర్‌ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది జూన్‌లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి అవతలి వైపునకు చేరుకునేందుకు గంట సమయం పట్టేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్‌పై నుంచి కేవలం నిమిషం వ్యవధిలో అవతలి వైపునకు వెళ్లొచ్చని చైనీస్‌ అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన బ్రిడ్జి.. చైనా మరో అద్భుతం! Publish Date: Apr 12, 2025 2:11PM

పవన్ కుమారుడ్ని కాపాడింది భారత్ కార్మికులే!

సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌‌ను కాపాడింది భారతీయ కార్మికులే. ఇటీవల సింగపూర్‌ స్కూల్లో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా సింగపూర్‌ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మార్క్‌తో పాటు ఆ ప్రమాదం నుంచి ఇతర పిల్లలను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరించింది. సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఏప్రిల్‌ 8న ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని.. మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగి.. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారని సింగపూర్‌ ప్రభుత్వం తెలిపింది. వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఆ నలుగురు కార్మికులను సత్కరించినట్లు తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్‌ శంకర్‌ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. బాలుడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి పోస్ట్‌ పెట్టారు.
పవన్ కుమారుడ్ని కాపాడింది భారత్ కార్మికులే! Publish Date: Apr 12, 2025 2:03PM

హత్య కాదు.. రోడ్డు ప్రమాదమే.. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పోలీసులు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై వివాదానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మరణించారని తేల్చేశారు. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ శనివారం ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన  పాస్టర్  ప్రవీణ్ పగడాలది ఎంత మాత్రం హత్య కాదనీ, ఆయన రోడ్డు ప్రమాదంలోనే మరణించారనీ, సీసీ ఫుటేజీల ఆధారాలతో సహా తెలిపారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, చివరిగా నాలుగో సారి కంకరరోడ్డుపై బైక్ స్కిడ్ అయి పడి మరణించారని చెప్పారు.   ఈ విషయంలో ఇప్పటిదాకా   ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాలని హీత్య అన్న వార్తల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సాక్ష్యాలతో సహా వివరించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల తన ప్రయాణ విషయాన్ని కుటుంబానికి తప్ప మరెవరికీ చెప్పాలేదన్నారు.  హైదరాబాద్, రాజమహేంద్రవరం మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని అందుకు సంబంధించిన రుజువులు చూపారు. అలాగే మార్గ మధ్యంలో ఆయన ఆరుగురితో మాట్లాడారనీ, ఆ విషయాన్ని కూడా తాము  ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా ధృవీకరించు కున్నామన్నారు.    ప్రవీణ్ పగడాల  పోస్టుమార్టం నివేదిక కూడా  ఆయన రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లుతేల్చిందని చెప్పారు.  విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు.  ఈ మొత్తం విచారణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే  చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.
 హత్య కాదు.. రోడ్డు ప్రమాదమే.. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పోలీసులు Publish Date: Apr 12, 2025 12:50PM

ప్రజా సమస్యలు గాలికి.. ప్రజాప్రతినిథులు గాల్లోకి!

రోమ్ నగరం తగలబడి పోతుంటే ఇటలీ చక్రవర్తి ఫీడెల్ వాయించుకున్నారట.... ఇదో పాతకాలపు సామెత. ఇప్పుడు విశాఖలోని కొందరు కార్పొరేటర్లను చూసి ప్రజలు ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ప్రధానంగా  తెలుగుదేశం,  వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అత్యధిక శాతం మంది విహార యాత్రలకు వెళ్లారు. అది కూడా ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం.   విశాఖ కార్పొరేషన్ తాజా కౌన్సిల్ ఏర్పాటై నాలుగేళ్లు గడిచింది. వైసీపీ   హయాంలో ఎన్నికలు జరగడంతో అన్ని రకాల అండదండలతో ఆ పార్టీ మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి ఎన్నికయ్యారు. కానీ కార్పొరేషన్ పై ఆమెకు పెత్తనం లేకుండా వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి వ్యవహరించారు. కౌన్సిల్లో కూడా ఆ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను లాంటి నాయకులు పెత్తనం కొనసాగింది. ఒక సమయంలో అప్పటి ఎంపీ విజయ్ సాయి రెడ్డి అండతో జీవీఎంసీ కమిషనర్ సృజన కనీసం మేయర్ ను పట్టించుకోని పరిస్థితి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీంతో సొంత పార్టీతో పాటు తెలుగుదేశం,  బిజెపి జనసేన కార్పొరేటర్ ల్లో కూడా చాలా వరకు అసంతృప్తి ఉంది. ఈ దశలో నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. దీంతో కూటమికి చెందిన కార్పొరేటర్లు ఇటీవల జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం లేఖను ఇచ్చారు.  దీంతో ఒక్కసారిగా వైసిపి శిబిరంలో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ఆరు నెలల నుంచి విశాఖకు పెద్దదిక్కుగా మారిన బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారాన్ని తన భుజంపై వేసుకున్నారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు జారిపోకుండా ప్రత్యేక శిబిరానికి తరలించారు. ముందు బెంగళూరు వెళ్ళిన ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఆ తర్వాత కొలంబో కూడా ప్రయాణం కట్టారు. కూటమి నేతలు తమ కార్పొరేటర్ల పై పూర్తిస్థాయి నమ్మకం ఉండడంతో   శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు అయితే ఈనెల 19న కౌన్సిల్ జరుగుతున్న దశలో వైసీపీ మాదిరిగా తమను కూడా విహారయాత్రకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం కార్పొరేటర్లు కొందరు ప్రతిపాదన చేశారు.  దీంతో ఆ పార్టీ తరఫున మేయర్ పీఠం అవకాశం ఉన్న  తెలుగుదేశం నాయకుడు పీలా శ్రీను తమ వర్గం కార్పొరేటర్ లను మలేషియా తీసుకువెళ్లారు. రెండు పార్టీల కార్పొరేటర్లు ఈనెల 19న జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ వ్యవహారం తెలిసిన విశాఖ ప్రజలు కార్పొరేటర్ల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత మొదలైంది. మరో రెండు వారాల్లో వర్షాలు కురవనట్లయితే కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే  రైవాడ, మేఘాద్రి గడ్డ ముడసరలోవ... గంభీరం లాంటి రిజర్వాయర్లలో పూడిక తీయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటితోపాటు నగరంలో చాలా   ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో కౌన్సిల్లో ప్రజా సమస్యలు చర్చించడానికి సిద్ధం కావలసిన కార్పొరేటర్లు రాజకీయాల కోసం విదేశాలకు వెళ్లడం ప్రజలు ఇష్టపడడం లేదు. పట్టుమని ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొండవాలు ప్రాంతాల్లో చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. టిడ్కో ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసిన ప్రజలకు ఇప్పటికీ ఇళ్ల విషయంపై ఓ స్పష్టత లేదు. ఇక వైసీపీ హయాంలో ఇచ్చిన  ఇళ్ల  స్థలాలు సెంటు సెంటున్నర భూముల వ్యవహారం కూడా అస్పష్టంగా ఉంది. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో వైఎసీపీ హయాంలో అడ్డుగోలుగా కొన్ని భూములు కేటాయింపు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక రాజకీయ అండతో పలువురు ఆస్తి పన్ను ఎగవేశారన్న అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని చర్చించాల్సిన కార్పొరేటర్లు బాధ్యత మరిచారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏడాది గడువుండే మేయర్ పీఠం ఎవరికి దక్కినా పెద్ద ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు. కానీ రాజకీయ ప్రతిష్ట కోసం వైసీపీ, తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రజా సమస్యను మరిచి విలాసాల బాట పట్టారని విశాఖ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలు గాలికి.. ప్రజాప్రతినిథులు గాల్లోకి! Publish Date: Apr 12, 2025 11:30AM

తిరుమలలో ఘోర అపచారం.. పాదరక్షలతో ఆలయప్రవేశానికి ప్రయత్నించిన ముగ్గురు

తిరుమలలో ఘోర అపచారం జరిగింది. తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. టీటీడీ విజిలెన్స్ పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాద్వారం వద్ద ముగ్గురు భక్తులు చెప్పులతో  భక్తులు ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి వారిని నిలిపివేశారు. దాంతో ఆ భక్తులు చెప్పులను మహాద్వారం వద్దే వదిలేసి స్వామి వారి దర్శనానికి లోనికి వెళ్లారు.  అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
తిరుమలలో ఘోర అపచారం.. పాదరక్షలతో  ఆలయప్రవేశానికి ప్రయత్నించిన ముగ్గురు Publish Date: Apr 12, 2025 11:17AM

నేతల్ని నమ్ముకుంటే వాతలే!

కిరణ్ అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరీ ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అందులో భాగంగా ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి రగిలిస్తున్నాయి. మాజీ సీఎం జగన్  సతీమణి భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు ఆగమేఘాలపై అరెస్టు చేశారు.  కిరణ్‌కు మంగళగిరి కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ చర్య టీడీపీ హైకమాండ్‌ను ఇరకాటంలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలపై ఎలాంటి చర్యలూ తీసుకోని టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తను 24 గంటలు కూడా కాకముందే అరెస్ట్ చేయడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ కేడర్ పైనా ఇలాగే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేసున్నారు టీడీపీ కార్యకర్తలు. చేబ్రోలు కిరణ్ ఐటీడీపీలో యాక్టివ్‌గా పని చేసేవారు. భారతిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతలోనే టీడీపీ హైకమాండ్ కిరణ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలో కిరణ్‌ను అరెస్టు చేశారు. కిరణ్ అరెస్టు టీడీపీ కార్య కర్తల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అతని అరెస్టును కార్యకర్తలు పార్టీకి సేవ చేసిన వారికి శిక్షగా భావి స్తున్నారు. మనోళ్లను అరెస్టు చేస్తారు కానీ వైసీపీ వాళ్లను వదిలేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నాయకులపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు వెల్లువెత్తాయి. అయితే, వీటిపై నాటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై కిరణ్ ను అరెస్టు చేయడాన్ని తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తూ చేసే అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. కూటమి ప్రభుత్వ విలువలను, నీతినిజాయితీకి ఇది నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మెజార్టీ టీడీపీ కార్యకర్తల్లో దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ అసంతృప్తి పార్టీ ఐక్య తకు సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకుండా కిరణ్‌ను చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. ఐకాన్ పాలిటిక్స్ వంటి వివిధ వెబ్‌ సైట్లు పెడుతున్న ఒపీనియన్‌ పోల్స్‌లో కిరణ్ అరెస్టును 80 శాతం మందికి పైగా వ్యతిరేకి స్తున్నారు.  కార్యకర్తలను శాంతింపజేయడానికి, గతంలో టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూ తిపరు లపై ఫిర్యాదులను పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు. అదే జరిగితే రాజకీయ కక్షగా ముద్ర పడుతుందేమోననే భయం టీడీపీ హైకమాండ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తల ఆగ్రహాన్ని శాతింప చేయడం, చట్టం అందరికీ సమానమేనని నిరూపించడం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. అదీకాక చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఆయన్ను పోలీసులు తరలించిన తీరు, ప్రెస్ మీట్లో మొహానికి నల్ల ముసుగు ధరించి ప్రవేశపెట్టడం వంటివి ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతున్నాయి. మొదట్లో భారతిపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీతో పాటు టీడీపీలో సైతం ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశాక కోర్టుకు తరలించడం, నల్ల ముసుగు వేయడం వంటి కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో ఆయనపై సానుభూతి పెరుగుతోందంటున్నారు. సస్పెన్షన్ ఓకే, కేసులు పెట్టడం ఓకే, అరెస్ట్ కూడా ఓకే, కానీ అలా ఏదో మర్డర్, మానభంగం చేసినవాడిలా ఫేస్ మాస్క్ వేసి నిలబెట్టడం కరెక్ట్ కాదని టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తిస్తున్నారు. నాయకుల్ని నమ్ముకుంటే మిగిలేది వాతలే అని సెటైర్లు విసురుతున్నారు.
నేతల్ని నమ్ముకుంటే వాతలే! Publish Date: Apr 12, 2025 10:51AM

వనజీవి రామయ్య ఇక లేరు

ట్రీ మేన్ ఆఫ్ ఇండియా వనజీవి రామయ్య ఇక లేరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య..  పచ్చదనమే ప్రాణంగా… మొక్కలు పెంచడమే జీవితంగా బతికి వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి వనజీవి రామయ్య శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనజీవి   ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం లో వనజీవి రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.  అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రామయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసిన సమయంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో రామయ్య విస్తృతంగా పాల్గొన్నారు..వృక్షో రక్షితో రక్షిత: అనే నినాదంతో ఉన్న ఫలకాన్ని ఆయన మెడలో ధరించి కార్యక్ర మాలకు హాజరయ్యేవారు.  కోటికి పైగా మొక్కలు నాటిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య మరణం సమాజానికి తీరని లోటని రేవంత్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.   
వనజీవి రామయ్య ఇక లేరు Publish Date: Apr 12, 2025 9:46AM

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.
ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ! Publish Date: Apr 12, 2025 9:30AM

సగ్గుబియ్యం ఉపయోగాలు తెలుసా?

   తెలుగు రాష్ట్రాలలో చాలామందికి సగ్గు  బియ్యం  ఒడియాలు పెడతారు అని మాత్రమే తెలుసు. సోషల్ మీడియా కారణంగా సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారని కూడా చూసే ఉంటారు. కానీ  ఇతర రాష్ట్రాలలో సగ్గుబియ్యాన్ని చాలా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యాన్ని చేర్చుకుంటారు.  అయితే సగ్గుబియ్యం ప్రయోజనాలు చాలా మందికి తెలియవు.  సగ్గు బియ్యం కిచిడి,  సగ్గుబియ్యం పాయసం,  సగ్గు బియ్యం ఒడియాలు.. సగ్గుబియ్యం చాట్.. ఇలా చాలా రకాలుగా ఉపయోగించే సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.  సగ్గుబియ్యంలో ఉండే పోషకాలు ఏంటి? సగ్గుబియ్యం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. సగ్గుబియ్యం మంచి ఎనర్జీని ఇస్తుంది.  అంతే కాదు.. ఇందులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.  సగ్గుబియ్యంలో పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో  సహాయపడతాయి. సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు శరీరాన్ని ఆవరించిన అలసట,  బలహీనత మొదలైనవి తొలగిపోతాయి. సగ్గుబియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బలహీనమైన పేగు ఆరోగ్యం ఉన్నవారు సగ్గుబియ్యం తింటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రోటీన్ పరంగా చూస్తే సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.  ఇది కండరాల మరమ్మత్తుకు, కండరాలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.  అందుకే ప్రోటీన్ తీసుకోవాలి  అనుకునే వారు ఆహారంలో సగ్గుబియ్యం ను చేర్చుకోవచ్చు. చాలా సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు పెరగాలని అనుకుంటే అందుకు సగ్గుబియ్యం బాగా సహాయపడతుంది.  సగ్గుబియ్యంలో ఉండే ప్రోటీన్,  కార్బోహేడ్రేట్స్, పోషకాలు ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది.  ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. సగ్గుబియ్యంలో ఐరన్ కంటెంట్, ఫోలేట్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.  గర్భవతులు సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల కడుపులో పిండం అబివృద్ది ఆరోగ్యకరంగా జరుగుతుంది.  ఇది రక్తహీనత వంటి రక్తలోపం సమస్య ఉన్నవారికి కూడా మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
సగ్గుబియ్యం ఉపయోగాలు తెలుసా? Publish Date: Apr 12, 2025 9:30AM

రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు చురకలు!

బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ సభలు, సమావేశాలూ నిర్వహించకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విషయమేంటంటే..  బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా ఆ పార్టీ  వ‌రంగ‌ల్ జిల్లా, ఎల్క‌తుర్తిలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్స‌వం, వజ్రోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందు కోసం సభ ఏర్పాట్లు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి అనుమతి కోసం పోలీసులను కోరింది. అయితే సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ తెలంగాణ కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 11) విచారించింది. ఆ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలూ, సమావేశాలూ నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. రాజ్యాంగ బద్ధంగా అభించిన హక్కును అడ్డుకోవడం తగదని పేర్కొంది. కాగా సభకు అనుమతించే విషయంలో తమకు ఈ నెల 21 వరకూ గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై తెలంగాణ కోర్టు తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ 27న సభ నిర్వహించుకోవాలని కోరితే..  మీరేమో 21వ తేదీ వ‌ర‌కు గ‌డువు కోరడం చేస్తుంటే.. వారికి స‌భ నిర్విహించుకునే అవకాశం లేకుండా చేయాన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  
రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు చురకలు! Publish Date: Apr 12, 2025 6:29AM

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

వైసీపీ సీనియర్ నాయకుడు,   హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి ప్రయత్నించిన గోరంట్లతో పాటు ఆయన అనుచరులు ఐదుగురికి  గుంటూరు కోర్టు  రిమాండ్ విధించింది. దీంతో మరో వైసీపీ నేత కటకటాల పాలైనట్లైంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని నిలువరించి, వారి సమక్షంలోనే చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోనికి తీసుకుని శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.  దీంతో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. నెల్లూరు జైలుకే ఎందుకంటే.. గోరంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించిన చేబ్రోలు కిరణ్ ఇప్పటికే గుంటూరు జైలులో ఉండటంతో.. గోరంట్ల మాధవ్ ను నెల్లూరు జైలుకు తరలించారు.   
గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు Publish Date: Apr 12, 2025 5:45AM

వైసీపీ దుష్ప్రచారంపై టీటీడీ ఆగ్రహం

గోవుల మ‌ృతి ప్రచారంపై భూమనకు భానుప్రకాష్ సవాల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర అవకతవకలు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మరో దుష్ప్రచారానికి తెర లేపారు. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. చనిపోయిన ఆవులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. టీటీడీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపించారు. టీడడీ గోశాలలో ఆవుల మరణంపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ప్రచారం అంతా అవాస్తమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని, కొంతమంది దురుద్దేశంతో ఆ ఫొటోల్లో ఉన్నవి  టీడీపీ గోవులుగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది.  ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ఆరోపణలు చేయడం కాదని.. గోశాల పరిశీలనకు రావాలని కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ సవాల్ విసిరారు. శ్రీవారిని కించపరిచే విధంగా వ్యవహారాలు నడిపిన చరిత్ర కరణాకర్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరుణాకర్ రెడ్డికి తగదని,  లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. శ్రీవారి ప్రసాదాలకు వాడిన పదార్థాలు కూడా నాణ్యమైనవి కాదని ఇప్పటికే నివేదికలు ఉన్నాయన్నారు. టీటీడీ గోశాల  కరుణాకర్ రెడ్డి పరిశీలన చేయవచ్చని సవాల్ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన గోవుల వివరాలను టీటీడీ రికార్డులను నిర్వహిస్తోందన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీలో పెద్దఎత్తున నిధులను దారి మళ్లించిన ఘనత ఆయనదే అంటూ భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయడానికి నిదర్శనం వైసీపీ అని, ధార్మిక క్షేత్రంలో దారుణం జరిగిపోతోందని అసత్య ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. మరి భానుప్రకాష్ సవాల్‌ను భూమన  ఏ మాత్రం స్వీకరిస్తారో? తమ అరోపణల్లో నిజముంటే వాటిని ఏ మాత్రం నిరూపిస్తారో చూడాలి?
వైసీపీ దుష్ప్రచారంపై టీటీడీ ఆగ్రహం Publish Date: Apr 12, 2025 5:37AM

బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి

విశాఖ మేయర్ పదవి విషయంలో వైసిపి తప్పటడుగు? ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది.  వైసీపీ   అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మేయర్ పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా బీసీ మహిళ గొలగాని హరి వెంకట కుమారిని పార్టీ నియమించింది. వాస్తవానికి మేయర్ హరి వెంకట కుమారి అయినప్పటికీ పెద్దరికమంతా వైసీపీ పెద్దలదే. కొంతకాలం విజయసాయిరెడ్డి ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి కనుసనల్లోనే విశాఖ కార్పొరేషన్ పాలన జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తమకు ఆ పదవి దక్కడమే చాలు అంటూ మేయర్ హరి వెంకట కుమారి, ఆమె భర్త శ్రీనివాస్ వ్యవహరించారు. కార్పొరేషన్ లో కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ల హవాయే కొనసాగింది. దీనిపై సొంత పార్టీలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయింపు విషయంలో కూడా తమకు నిర్లక్ష్యంగా చూశారని కొందరు కార్పొరేటర్లలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దశలో నాలుగేళ్ల పాలన ముగిసింది. కూటమి నాయకులు అవిశ్వాస తీర్మానం నోటీసు జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్, తెలుగుదేశం కార్పొరేటర్ లను కూడా తమ వైపు లాక్కున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందని వైసీపీలో భయం మొదలైంది. అందుకు తగ్గట్టే కొందరు వైసీపీ  కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి మరికొందరు జనసేన  వైపు వెళ్లారు. మరి కొందరు అదే బాటలో అడుగులు వేస్తున్న దశలో పార్టీ పెద్దగా బొత్స సత్యనారాయణ కార్పొరేటర్ల వలసలు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో కార్పొరేటర్ లను గోవాకు తరలించారు. అక్కడి నుంచి శ్రీలంక కు కూడా శిబిరాన్ని మార్చేస్తున్నారు. నిజానికి 98 వార్డులు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ ఎఫిషియో సభ్యులతో కలిసి 111 మంది సభ్యులు ఉంటారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది.  వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం. సిపిఐ పార్టీ కార్పొరేటర్ స్టాలిన్, గతంలో వైసీపీలో  ఉండి పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ ఓటు వేసినా మరో ఇద్దరి ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడటం అవసరం. అయితే కూటమి నాయకులు మాత్రం వైసీపీ శిబిరంలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా తన భుజాన వేసుకొని మేయర్ పీఠాన్ని వైసీపీకి ఉండేలా చేస్తానంటూ బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా శిబిరం కొనసాగుతోంది. ఈనెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  ఆ రోజు జరిగే కౌన్సిల్లో కచ్చితంగా కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంపై చర్చ చేసే అవకాశం ఉంది. టిడిపికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని జనసేనకు చెందిన 11 మంది కార్పొరేటర్లు గురువారం తీర్మానం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కట్టుబడి ఉంటారని ప్రకటన కూడా చేశారు. నిజానికి వైసీపీలో అంతర్గత  విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ వ్యవహారాలు కొందరిచుట్టూ తిరిగాయని బహిరంగ విమర్శలు ఉన్నాయి. చివరికి కౌన్సిల్లో మాట్లాడడానికి తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని వైసీపీకి చెందిన కార్పొరేటర్   తిప్పల వంశీ లాంటి నాయకులు ఎన్నో సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అలాగే వార్డులకు నిధులు కేటాయించే సమయంలో కూడా తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి కార్పొరేటర్లలో ఉంది.  దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి నాయకులు పూర్తి స్థాయిలో వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో ఏడాది కాలంలో పదవులు ముగియనున్న దశలో ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తే మేలు జరుగుతుందన్న భావనలో కార్పొరేటర్లు ఉన్నారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు పై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. వారు కచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటారన్న సమాచారం వైసీపీ పెద్దలకు చేరింది. దీంతో అప్పటికప్పుడు ఈ అనుమానిత కార్పొరేటర్లకు పార్టీ పదవులను ఆఫర్ చేశారని విశాఖలో చర్చ జరుగుతోంది. పదవులు ఇచ్చినంత మాత్రాన గతంలో జరిగిన అన్యాయాన్ని ఈ కార్పొరేటర్లు మర్చిపోతారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే శిబిరం నిర్వహణ ఖర్చులు భారంగా మారడమే కాక , సమయం దగ్గర పడుతున్న కొలది తమ కార్పొరేటర్లు ఎటువైపు వెళ్తారో అని బొత్స వర్గంలో కలవరం కనిపిస్తోంది. చేతులెత్తి ఓటు వేసే పరిస్థితి వస్తే కొందరు కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా వైసిపి పెద్దల్లో  కనిపిస్తున్నది. కూటమి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి నలుగురు సభ్యుల సహకారం అవసరం. సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్, వైసీపీకి రాజీనామా చేసిన ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసినా లేక గైర్హాజరైనా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు పడినట్టే. ఇక వైసీపీఅసంతృప్తి కార్పొరేటర్ల కుటుంబ పెద్దలతో కూటమి నాయకులు టచ్ లో ఉన్నారు. పార్టీ అధికారంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్న ఆ కార్పొరేటర్లు దాదాపు ఐదుగురు కూటమికి అనుకూలంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మేయర్ పదవి కోల్పోవడమే కాక.. ఈ తతంగం నిర్వహణలో వైఫల్యం చెందినట్లు బొత్స సత్యనారాయణకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీలో మరో వర్గం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 19 డెడ్ లైన్ గా వైసీపీ కార్పొరేటర్ల శిబిరం కొనసాగనుంది. అయితే తాజాగా కూటమి కూడా తమ పార్టీ కార్పొరేటర్ లను ఓ శిబిరంలోకి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కూటమి తరపున మేయర్ పీఠం ఆశిస్తున్న పీలా శ్రీనివాసరావు ఆర్థికంగా పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికల ముందే వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయినట్లయితే పెద్దగా లాభం లేకపోయినప్పటికీ  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన వ్యవహారానికి ప్రతీకారం  తీర్చుకున్నట్లౌతుందని కూటమి నాయకులు చెప్పుకుం టున్నారు. ఇటు అధిష్టానం గానీ అటు మేయర్  హరి వెంకట కుమారి గాని ఈ విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించక పోవడం తో మొత్తం వ్యవహారం బొత్స మెడ కు చుట్టుకున్నట్టు అయింది.
బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి Publish Date: Apr 11, 2025 4:58PM

వాయిస్ మార్చిన జోగు రమేశ్.. ఎవరికీ భయపడరంట

నిక్కర్లు  వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటున్న మాజీ మంత్రి జోగు రమేశ్,  సీఐడీ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ సీఐడీ విచారణకు శుక్రవారం (ఏప్రిల్ 11) హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగు రమేష్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని వెల్లడించారు. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలపడానికే వెళ్లానని, దాడి చేయలేదని పేర్కొన్నారు.  10 నెలల పాలనలో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్ళిందని జోగు రమేష్ మర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తున్నారనీ,  ఇదంతా తాత్కాలిమని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగు తున్నా యన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని, దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా దత్త పుత్రుడు ఎక్కాలా అన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోం దంటూ జోగురమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   నోటీసులతో  తమను ఏమి చేయలేరని మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ ఎంత కాలం పట్టుకొని తిరుగుతావ్ ఏదో ఒకరోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని మండిపడ్డారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది ఎల్లకాలం ఒకేలా ఉండదని ఒకటి లేదా రెండేళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని.. 5 ఏళ్లు పట్టుకొని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని,   సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ఈరోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ సుప్రీం కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాతే సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఏపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శిం చిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒక వైపు కుమారుడి అరెస్టు,  మరో వైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్‌ను విచారణ పేరుతో స్టేషన్ల  చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్నీ కావని .. తనకు శనిపట్టిందని అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గరా మొత్తుకుంటున్నారట . వాస్తవానికి నారా లోకేశ్ రెడ్ బుక్‌లో టాప్ ఫైవ్ లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే భయంతో టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారని కూడా వార్తలు వినవచ్చాయి.  చంద్రబాబు, లోకేశ్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా అడిగారట. గతంలో వైసీపీలో పని చేసి తర్వాత టీడీపీ మంత్రిగా ఉన్న కృష్ణాజిల్లాకే చెందిన బీసీ నేత పార్థసారథితో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారంట. ఇటీవల నూజివీడులో పార్థసారథి, తదితర తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నది కూడా అందుకేనంట. ఏది ఏమైనా ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో ఎంట్రీకి డోర్లు అన్నీ మూసుకుపోవడం, కేసుల తాకిడి పెరుగుతూ విచారణలు ఎదుర్కోవాల్సి రావడంతో గత్యంతరం లేని స్థితిలో జోగి రమేశ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పసుపు చొక్కా వేసుకుని తిరిగేవారనీ, ఇప్పుడా చాన్స్ లేకపోవడంతో జైలు జీవితానికి మానసికంగా సిద్దమవుతూ,  ఆ ఫ్రస్ట్రేషన్‌లో మళ్లీ నోటికి పనిచెప్తున్నారంటున్నారు.
వాయిస్ మార్చిన జోగు రమేశ్.. ఎవరికీ భయపడరంట Publish Date: Apr 11, 2025 3:54PM