పవన్ భద్రాచలం పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రాచలం ప్రకటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ శనివారం (ఏప్రిల్ 5)మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో సాయంత్రానికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. శ్రీరామనవమి నాడు అంటే ఆదివారం ( ఏప్రిల్ 6) భద్రాద్రి సీతారామ స్వామి కల్యాణానికి హాజరై అదే రోజు సాయంత్రం భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీపీ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆయన ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించారు. పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దుకు కారణాలు తెలియాల్సి ఉంది.  
పవన్ భద్రాచలం పర్యటన రద్దు Publish Date: Apr 5, 2025 10:51AM

భద్రాద్రి సీతమ్మకు బంగారు నేత చీర!

భద్రాచలం సీతారామ స్వామి కల్యాణానికి సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను నేసి బహూకరించనున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసిన హరిప్రసాద్.. ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చి దిద్దారు. అలాగే బార్డర్ లో శంఖు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేశారు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం   శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 ఒక్కసార్లు ఉంది. ఈ చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించారు. చీర బరువు ఎనిమిది వందల గ్రాములు కాగా ఇది ఏడు గజాల బంగారు చీర. గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ కు సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయడానికి పది రోజుల సమయం పట్టింది. ఈ అరుదైన సీతమ్మవారికి సమర్పించాలన్నది ఆయన ఆకాంక్ష, అభిలాష.  ప్రతి ఏటా భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని సిరిసిల్ల నేతన్నలకే ఇవ్వాలని ఆయన సీఎం రేవంత్ ను కోరుతున్నారు.  గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు.
భద్రాద్రి సీతమ్మకు బంగారు నేత చీర! Publish Date: Apr 5, 2025 10:38AM

పాపం కమ్యూనిస్టులు!

ఖమ్మం లో తగ్గుతున్న ప్రాభవం జిల్లాలో బలహీన పడిన కామ్రేడ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన కామ్రేడ్లు నేడు దాదాపుగా జీరోకు చేరుకున్నారు. 1980 లో జరిగిన సమితి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు (సీపీఎం,సీపీఐ) జిల్లా లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని  తట్టుకొని మరీ సముచిత స్థానాలు దక్కించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయడం, ఎన్నికలలోనూ ఐక్యంగానే పోటీ చేయడం ప్రారంభించారు. ఆ రకంగా 1994 వరకు కలసి పోటీ చేసి గణనీయంగా లబ్ధి పొందారు.  మధ్యలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశంతో విభేదించినా పలు ఎన్నికల్లో కలసి పోటీచేశారు. 1999 నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.   ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ తో కలసి పోటీచేసి మంచి ఫలితాలు సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తో కలసి పోటీచేసిన ప్రతిసారి కమ్యూనిస్టులకు జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా గా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టులు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించారు. ముదిగొండ లో ఇళ్ల స్థలాల కోసం జరిగిన ఆందోళనలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు సీపీఎం కార్యకర్తలు చనిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం కు దూరం పెరిగింది. ఆ తర్వాత సీపీఎం జిల్లా నాయకత్వంలో జరిగిన పరిణామాలతో సీనియర్ కామ్రేడ్ లు కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి జిల్లాలో సీపీఎం బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో సీపీఎం ఆ ఉద్యమానికి దూరంగా ఉంది. సీపీఐ మాత్రం ఉద్యమంలో భాగస్వామి అయింది.  తెలంగాణ ప్రకటన నేపథ్యంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీచేసిన సీపీఎం ఖమ్మం జిల్లాలో  మాత్రం  విచిత్రంగా వైసీపీ తో పొత్తు పెట్టుకుంది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది . సీపీఎం ఒక్క భద్రాచలం అసెంబ్లీ ని మాత్రమే గెలుచుకుంది. సీపీఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు.   అప్పటి నుంచి జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. సీపీఎం, సీపీఐ ల మధ్య కూడా సంత్సంభందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  అంతేకాదు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లో 7 స్థానాల్లో 2018  స్థానాల్లో 8, 2023 లో 8 స్థానాల్లో ఆ పార్టీ నే గెలిచింది. కొత్తగూడెం లో ఆ పార్టీ మద్దతు తో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.. సీపీఎం ఖమ్మం టౌన్, భద్రాచలం ప్రాంతంలో కాస్త క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తోంది. సీపీఐ ఖమ్మం రూరల్ ప్రాంతంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపిస్తోంది.. ఇక సీపీఐ (ఎంఎల్) పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఆ పార్టీ లో సైద్ధాంతిక విభేదాల తో విడిపోయి బలహీనపడున్నారు. జిల్లాలో ఇప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం సంతరించుకోవడమనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. 
పాపం కమ్యూనిస్టులు! Publish Date: Apr 5, 2025 9:49AM

రేవంత్ మంత్రివర్గ విస్తరణ.. ఓ అంతులేని కథ !

ఏప్రిల్ 3 తేదీ వచ్చింది. వెళ్ళింది. కానీ  ఆ రోజున  జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు మూడున ముహుర్తమని మీకు ఎవరు చెప్పారు  అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. అంతే కాదు.. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం  సో ..అప్పడే కాదు, ఇప్పడు కూడా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్న సత్యాన్ని చక్కగా తేల్చి చెప్పారు.  సో ... ఢిల్లీ ఎప్పుడు దయతలిస్తే అప్పుడే మంత్రవర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు  ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా  అవి మురిగి పోతాయనే రీతిలో పీసీసీ చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు.  అయితే  అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్  బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని  అందుకు ఆ ఇద్దరు, ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే  ఇప్పడు మంత్రివర్గం విస్తరణ కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లేనని పార్టీ నేతలు  పీసీసీ చీఫ్ చెప్పిన మాటలకు  భాష్యం చెపుతున్నారు. అవును  మళ్ళీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కుడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగం ఉంటుందనీ,  సో.. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.   నిజానికి  మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని, ’తెలుగు వన్’ ఎప్పుడో చెప్పింది. ఇప్పడు అదే జరిగింది.ఇప్పటికే ఒకటి మూడు ముహూర్తాలు  మురిగి పోయాయి. ముందు మార్చి 29న అన్నారు. ఆ వెంటనే లేదు లేదు ఉగాది పండగ రోజు ( మార్చి 30) సాయంత్రం పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్  అన్నారు. ఉగాది పండగ రోజున ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే అదీ.. ఇదీ.. ఏదీ ముడి పడలేదు. ఇక ఇప్పడు, బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్కోర్స్  ఇప్పుడనే కాదు.. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ  ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకామే జరుగుతుంది. నిజానికి  బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీలలో అదొక ఆచారంగా మారిన అపచారం అని పెద్దలు అంటారు. అయితే,ఇప్పడు తెలంగాణ విషయంలో జరుగుతున్నది అదేనా అంటే.. అదే అయినా  ఇంకా ఏదో ఉందనే అనుమానాలు కూడా గాంధీ భవన్  లో వినిపిస్తున్నాయని అంటున్నారు. అదలా ఉంటే ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మార్చి 24న  ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  మీనాక్షి నటరాజన్ లనుఉన్నపళంగా ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచినట్లు?  నిజంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే అయితే  అంత హడావిడి చేసి, ఇప్పడు ఇలా  కూల్ కూల్’గా సైలెంట్’ అయిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇంకెందుకో పిలిస్తే.. ఆ రహస్యం బయటకు చెప్పలేక చెప్పిన ‘విస్తరణకు పచ్చ జెండా’ కథ  బయటకు వచ్చిందా? అందుకే ఇప్పడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడవలసి వస్తోందా ? అందుకే  మంత్రి వర్గ విస్తరణ కథ ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతూ, డిమ్కీలు కొడుతూ ఒక ప్రహసనంగా మారిందా?  అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.   అయితే  ఎవరిలో ఎన్ని అనుమానాలు ఉన్నా?  ఆసలు తెర వెనక ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియక పోయినా, ఆశావహులు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే.. మరో పది రోజులకో, పక్షం రోజులకో  ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నఆశతో  ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్’ కోసం బరువైన దరఖాస్తులు  సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదొకటి అలా ఉంటే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందర పాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారి పోతోందని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకుంటున్న  పార్టీ సీనియర్ నాయకులు మరో మారు, ‘మార్పు’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఇదేమీ ఇప్పడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే  హెచ్‌సీయూ భూబాగోతం వంటి  తాజా పరిణామాల నేపధ్యంలో  ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నాం అవుతున్న నేపధ్యంలో సీనియర్ నాయకులూ అటుగా ఫోకస్ పెట్టి  ప్రయత్నాల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.  అదెలా ఉన్నా మంత్రి వర్గ విస్తరణకు  సంబంధించి నంతవరకు  ఢిల్లీ గుప్పిట్లో దాగున్న నిజం ఏమిటో తెలిసే వరకు  ఇదొక  అంతులేని కథలా సాగుతూనే ఉంటుందని, అనుభవజ్ఞులైన పెద్దలు అంటున్నారు.
రేవంత్ మంత్రివర్గ విస్తరణ.. ఓ అంతులేని కథ ! Publish Date: Apr 5, 2025 9:37AM

చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే స్త్రీల గురించి ఈ నిజాలు చెప్పేశాడు..!

  ఈ సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనది.  స్త్రీలు జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి ఆధారం అని చెబుతారు. ప్రాచీన గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర,  స్త్రీల గుణగణాలు ఎంతో గొప్పగా ప్రస్తావించబడ్డాయి.  ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే తన నీతి శాస్త్ర గ్రంథంలో  స్త్రీల గురించి కొన్ని నిజాలను స్పష్టంగా చెప్పాడు.  పండితుడు,  దౌత్యవేత్త,  ఆర్థికవేత్త,  రాజకీయ వేత్త,  మంచి  సలహాదారుడు అయిన చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే.. ధైర్యానికి ప్రతిరూపం.. చాణక్య నీతి ప్రకారం స్త్రీకి అపారమైన శక్తి ఉంటుంది. సంక్షోభ సమయంలో తన భర్త, పిల్లలు, కుటుంబం,  వంశాన్ని రక్షించే స్త్రీని ఉత్తమురాలు అంటారు. అలాంటి మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు.  దేశాభివృద్ధికి తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తారు. చాలా మందికి తెలియదు.. కొందరైతే ఒప్పుకోరు.. కానీ స్త్రీలు రెట్టింపు ఆహారం తింటారు.  అలాగే  వారి వినయం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట.   చైవ కామశ్చాష్టగుణం: స్మృత: ॥ అని చాణక్యుడు అన్నాడు. పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.  సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది.  కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది. స్త్రీల గురించి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ..  స్త్రీ ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలని చెబుతాడు. ఆధునిక వాతావరణంలో, మహిళలు మాట్లాడే భాష క్షీణించింది. దీని కారణంగా సమాజం ప్రభావితమవుతోంది. స్త్రీ ఎప్పుడూ దుర్భాషను ఉపయోగించకూడదని చాణక్యుడు అన్నాడు. దుర్భాషలాడే స్త్రీల గురించి చెబుతూ.. ఈ  అలవాటు ఉన్న స్త్రీల జీవితాలు సమస్యలతో నిండి ఉంటాయి అని అన్నాడు. వైవాహిక జీవితంలో ఉత్సాహం  లోపిస్తుందట. అలాంటి స్త్రీలు ఒత్తిడితోనూ,  వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు భాష మాట్లాడటం వల్ల ఆలోచనలలో స్వచ్ఛత తగ్గిపోతుందట. ఆలోచనలు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల అది మనస్సు,  మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సమయం వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన నైపుణ్యాలను,  బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ పరిస్థితిలో న్యూనతా భావన,  ఒత్తిడి పెరుగుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పాడు.                                                   *రూపశ్రీ
చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే స్త్రీల గురించి ఈ నిజాలు చెప్పేశాడు..! Publish Date: Apr 5, 2025 9:30AM

మండే వేసవిలో తాజాగా ఉండాలంటే.. ఈ మూడు జ్యూసులు బెస్ట్..!

  వేసవి కాలం వచ్చేసరికి శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. మండే ఎండలు,  తేమతో కూడిన వేడి కారణంగా అలసట, నీరసం,  చిరాకుగా అనిపించడం సర్వసాధారణం. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీగా వెళతారు.  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయిన తోటకూర కాడలా కనిపిస్తారు.  అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం  కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తీసుకోవాలి.  ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వేసవిలో తీసుకునే  జ్యూస్‌లు  శరీరాన్ని చల్లబరచడమే కాకుండా  శక్తిని కూడా ఇస్తాయి. ఈ మండే ఎండలో శరీరాన్ని తాజాగా ఉంచే మూడు జ్యూస్‌ల గురించి తెలుసుకుంటే.. పుచ్చకాయ నీటి కొరతను తొలగిస్తుంది.. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో ఉత్తమమైన హైడ్రేటింగ్ పండుగా మారుతుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుద్ది  చేయడమే కాకుండా హైడ్రేషన్ స్థాయిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇది శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని తాజాగా,  ప్రకాశవంతంగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కలను మిక్సర్‌లో వేసి, కొంత నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి.  కావాలంటే దానికి నల్ల ఉప్పు,  కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు. కొబ్బరి నీరు సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి.. వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  నిమ్మరసంతో కలిపి తాగినప్పుడు ఇది అద్భుతమైన శక్తిని పెంచే పానీయంగా మారుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వేడి,  వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపి తాగవచ్చు. దోసకాయ తాజాదనాన్ని కాపాడుతుంది.. దోసకాయలో 96 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి చల్లదనాన్ని అందిస్తుంది. అదే సమయంలో పుదీనా సహజ శీతలీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. దోసకాయ శరీరంలో తాజాదనాన్ని కాపాడుతుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా   నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది,  జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కోసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేసి చల్లబరిచి త్రాగాలి.                                  *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మండే వేసవిలో తాజాగా ఉండాలంటే.. ఈ మూడు జ్యూసులు బెస్ట్..! Publish Date: Apr 5, 2025 9:30AM