షాకింగ్.. రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులకు కరోనా

భారత్ లో ఓ వైపు కరోనా విజృంభిస్తోంటే, మరోవైపు త్వరలో స్కూళ్లను తెరిపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో వేల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడ్డారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గడచిన రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. 

 

అమెరికాలో ఇప్పటికే పలు స్కూళ్ళు తెరుచుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అన్ని స్కూళ్ళు తెరుచుకునే అవకాశాలున్నాయనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతోందో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్  చెప్పుకొచ్చింది. 

 

అమెరికాలో గడిచిన నాలుగు నెలల్లో 3,39,000 మంది పిల్లలకు కరోనా సోకగా.. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు కరోనా సోకింది. దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాసులే మేల‌ని భావిస్తున్నారట.

 

అమెరికాలో కేవలం రెండు వారాల్లో 97 వేల మంది పిల్లలు కరోనా బారిన పడటం క‌ల‌వ‌రానికి గురిచేసే వార్తనే చెప్పాలి. త్వరలో స్కూళ్లను తెరిపించేందుకు ప్రయత్నిస్తున్న ఇక్కడి ప్రభుత్వాలు.. ఆ నిర్ణయంపై పునరాలోచిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.