చంద్రబాబు బాటలో జగన్... 100రోజులు కాలేదు...అప్పుడే 90శాతం సంతృప్తి అట!

 

ఇప్పుడంటే పొలిటీషన్లు అందరూ టెక్నాలజీని మంచినీళ్లలా వాడేస్తున్నారు గానీ, ఒకప్పుడు టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా!. ఎందుకంటే, అభ్యర్ధుల ఎంపిక కోసం నైన్టీస్ లోనే ఐవీఆర్ఎస్ సిస్టమ్ వాడిన తెలివైన పొలిటీషియన్ చంద్రబాబు. అయితే, పదేళ్ల నిరీక్షణ తర్వాత 2014లో అధికారాన్ని అందిపుచుకున్న చంద్రబాబు... ప్రజల నాడిని తెలుసుకునేందుకు కూడా అదే టెక్నాలజీని వినియోగించారు. ఏకంగా తన గొంతుతోనే ప్రజలకు ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచేవారు. నమస్కారం, నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా... అంటూ మొదలయ్యే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ తో ప్రభుత్వ పనితీరు ఉలా ఉంది?, మీ ఎమ్మెల్యే మీరు అందుబాటులో ఉంటున్నారా? అంటూ ఇలా పలు ప్రశ్నలు అడిగి అడిగేవారు. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి స్వరంతో ఫోన్ కాల్ వచ్చేసరికి... ప్రజలు ముందు ఆశ్చర్యానికి, ఆ తర్వాత భయానికి లోనయ్యేవారు. పరిపాలన బాగాలేదంటే ఏమవుతుందో ఏమోనని అన్నీ బ్రహ్మాండగా ఉన్నాయంటూ ఆప్షన్స్ ను నొక్కేవారు. ఇక అధికారుల గానాభజానా సరేసరి. 90శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ బాబును మెప్పించేవారు. ఇదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కొంప ముంచింది. అటు ఐవీఆర్ఎస్ సర్వే... ఇటు అధికారుల మాట నమ్మిన చంద్రబాబు... ప్రజల అసంతృప్తిని పసిగట్టలేకపోయారు. ఆఖరి సమయంలో పసిగట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి టీడీపీ చరిత్రలో ఎన్నడూలేనంతా దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇప్పుడిదంతా ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి పాలనకు వంద రోజులు కూడా పూర్తికాలేదు... కానీ, అప్పుడే 90శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ అధికారులు చెప్పుకొస్తున్నారట. ముఖ్యంగా స్పందన కార్యక్రమం టెలీకాన్ఫరెన్సుల్లో అధికారుల నుంచి ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయట. దాంతో ప్రజల అసంతృప్తిస్థాయి ఒక్క శాతానికి తగ్గించాలంటూ సీఎం జగన్ సైతం సూచించినట్లు తెలుస్తోంది. అయితే, సేమ్ టు సేమ్ ఇలాంటి మాటలే చంద్రబాబుకి కూడా చెప్పారట, అధికారుల లెక్కల్లో టీడీపీ పాలనపై 85శాతం హ్యాపీగా ఉన్నారని తేలిందట. అధికారుల మాటలను నమ్మిన చంద్రబాబు సైతం 85శాతంపైగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ అనేకసార్లు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం. అధికారుల చెప్పిన 85శాతం హ్యాపీకి 23 సీట్లే వచ్చాయి. మరి అప్పుడే జగన్ పాలనకు 90శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉంటే, అది రానురానూ 99శాతానికి చేరితే ఎన్ని సీట్లు వస్తాయో?. ఎందుకంటే 85శాతానికి 23 సీట్లు వస్తే... ఈ లెక్కన  99శాతానికి ఎన్ని సీట్లు వస్తాయో! ఏదేమైనా అధికారుల లెక్కలు నమ్మితే అధోగతే...అంతేమరి!