సబ్ జైలుకు చింతమనేని... పెండింగ్ లో మరో 60 కేసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్టు... 14రోజుల రిమాండ్‌ విధించింది. దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తోపాటు 143, 341, 324, 323, 506, 148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సెప్టెంబర్ 25వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.

2017లో దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన కేసులో 12రోజులక్రితం చింతమనేనిని అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న చింతమనేని... అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.... 14 పోలీస్ బృందాలు పశ్చిమగోదావరి జిల్లాను జల్లెడపట్టడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు. అయితే సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడంతో, అప్పటికే ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులకు చింతమనేని చుక్కలు చూపించారు. కారు దిగనంటూ హైడ్రామా సృష్టించారు. అదే సమయంలో చింతమనేని అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చింతమనేనిని చేతులపై ఎత్తుకున్న అనుచరులు కొద్దిసేపు అలజడి సృష్టించారు. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దాంతో అనుచరులు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారని, జగన్ ప్రభుత్వం... తనపై కక్షగట్టిందని,  తనను అంతమొందించేందుకు కుట్ర చేసిందని చింతమనేని ఆరోపించారు.

ఇదిలాఉంటే, చింతమనేని బాధితులు... పోలీసుల ముందు క్యూకడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు. అట్రాసిటీ, భూకబ్జా, బెదిరింపులు ఇలా... చింతమనేనిపై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, చింతమనేని అరెస్ట్‌‌తో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, దుగ్గిరాలలో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.