తమిళనాడులో చొరబడ్డ ఉగ్రవాదులు.. భారీ దాడులు?

 

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాక్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి. ఆ ఉగ్రమూకలు కశ్మీర్‌లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంచ్ ప్యాడ్స్‌ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. 

అయితే దక్షిణ భారతదేశంలోనూ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 6గురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్రంలో హెచ్చరికలు జారీ చేశారు.

ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు.