కోడలుకి కిడ్నీ దానం చేసిన అత్త- ఎందుకంటే!

తెల్లారితే చాలు అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవల గురించి చాలా వార్తలే వింటూ ఉంటాం. రోజు గడిచే కొద్దీ వాళ్ల మీదే సాగే సీరియల్సూ చూస్తుంటాం. కానీ అత్తాకోడళ్ల బంధం ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే వార్త ఇది. పూనేకు చెందిన నజీమా కొన్నాళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఇక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోకపోతే ఆమె బతకడం కష్టం అని తేల్చేవారు డాక్టర్లు. దాంతో ఏకంగా నజీమా అత్తగారు హాజీ సయ్యిద్‌ స్వయంగా తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ‘నా కోడలుకి కిడ్నీని అందిస్తే ఆమెతో పాటు నా కొడుకు, మనవడి జీవితాలు కూడా నిలుస్తాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను,’ అంటున్నారు హాజీ సయ్యద్‌. అత్తాకోడళ్లు కొట్టుకుచస్తున్నట్లు చూపించే సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు కూడా ఉంటే బాగుండు.