పద్దెనిమిదేళ్ళకి మళ్ళీ జన్మించిన ప్రిన్సెస్ డయానా....కానీ ఈసారి అబ్బాయిగా !

 

800 ఏళ్ల కిందట ఇండియాలోని నలంద విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసం జరిగిందని భూటాన్ యువరాజు కొడుకు మూడేళ్ల బాలుడు తెలిపిన వీడియోలు రెండేళ్ళ క్రితం వైరల్ అయ్యాయి. తనకు 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ లభించిందని చెబుతూ అప్పట్లో నలంద విశ్వవిద్యాలయంలో భోజన శాల, తరగతి గదులతోపాటు వసతి గృహాలు ఎక్కడున్నాయో చూపి ఆశ్చర్యచకితుల్ని చేశాడు ఆ మూడేళ్ళ బుడతడు.  

అయితే ఇప్పుడు అదే విధంగా వ్యాఖ్యానించి సంచలనంగా మారాడు మరో ఆస్ట్రేలియా బుడతడు.  ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ అనే నాలుగేళ్ల బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానానంటూ పేర్కొని సంచలనం రేపాడు. నాలుగేళ్ళ బుడతడు చెప్పే మాటలు ఎలా నమ్ముతున్నారని మీరు అనుకోవచ్చు కానీ, అప్పటి మీడియాకి కూడా తెలీని ప్రిన్సెస్ డయానా బాల్యంలోని విషయాలను కూడా పూసగుచ్చినట్టు చెప్పడం, విలియం, హ్యారీలను తన కొడుకులు అని పేర్కొనడంతో సంచలనంగా మారింది.

అంతేకాక డయానా సోదరుడు జాన్ పుట్టిన కొన్ని గంటల్లోనే పురిట్లోనే చనిపోయిన విషయన్ని కూడా బిల్లీ చెబుతుండడం మరింత విస్తుగొలుపుతోంది. బిల్లీ తండ్రి పేరు డేవిడ్ క్యాంప్ బెల్. డేవిడ్ ఆస్ట్రేలియాలో ప్రముఖ టీవీ ప్రజెంటర్ గా గుర్తింపు పొందాడు. ఒకరోజు డయానా ఫొటో చూసిన అతని కుమారుడు బిల్లీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.  అప్పట్లో నేను యువరాణిగా ఉన్నప్పటి ఫొటో ఇది అని చెప్పడంతో డేవిడ్ ఆశ్చర్యపోయాడు. 

నిజానికి ప్రిన్సెస్ డయానా తన భర్త నుండి విడాకులు తీసుకున్నాక ప్రియుడితో కలిసి మీడియా ప్రతినిధుల బారినుంచి తప్పించుకునే క్రమంలో 1997లో ఓ కారు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత 18 ఏళ్లకు పుట్టిన తన కుమారుడు బిల్లీ ఇప్పుడు తానే ప్రిన్సెస్ డయానా అంటుండడం పట్ల ఏంచేయాలో అర్థంకాక డేవిడ్ క్యాంప్ బెల్ తల పట్టుకుంటున్నాడు.