మోడీ మూడ్ బాలేదు..ఏపీకి అమౌంట్ రాలేదు

 

ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయింది. విడిపోతే ఏపీకి నష్టం అని ఆనాడు గొడవ చేశారు.. ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే కాదు పదేళ్లు కావలి అని పట్టుబట్టారు. అప్పుడు ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకించాలి అన్నట్లు ఉంది బీజేపీ తీరు. అందుకు ఉదాహరణ అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెప్పటమే. హోదా ఇవ్వము కానీ దానికి సమానమైన ప్యాకేజ్ ఇస్తాం అన్నారు. మరి అది జరిగిందా అంటే జరగలేదనే చెప్తారు ఎవరైనా. ఏకంగా 32,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది అంటే అతిశయోక్తి కాదు. అసలు ఇంత మొత్తం ఎందుకు ఆగింది అంటే అది కేవలం ప్రధాని మోడీ వల్లేనట. మనకి తెలిసింది కేవలం ప్రధానమంత్రి ఒప్పుకోలేదన్న కారణంగా వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకుంది మాత్రమే. కానీ తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు..పనిలో పనిగా.. ఏపీకి రావాల్సిన నిధుల గురంచి ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు.

అప్పుడు తెలిసింది లోగుట్టు. అధికారులు టక్కున మాట బయటకు అనేశారో ఏమో..చట్టం ప్రకారం. లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు 32వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని.. ఆ లెక్కలు రెడీ చేశామని.. కానీ ప్రధానమంత్రి అనుమతి కావాల్సి ఉందని చెప్పకనే చెప్పేశారు. ప్రధాని మూడ్ బాలేదో లేక కలిసి ఉంటాడు అనుకున్న అపర చాణుక్యుడిలాంటి చంద్రబాబు ఏకుకు మేకు అయ్యి కూర్చోవటంతో ..ఆయన్ని అణగ దొక్కేందుకు నిధులకు అడ్డుపడుతున్నారనే భావం కలగటం ఖాయం. ఏపీకి నిధులు రావాలి అంటే మోడీ మనసు అయినా మారాలి లేకపోతే ప్రధాని పదవిలో ఏపీకి అనుకూలంగా ఉండే నేత అయినా రావాలి. చూద్దాం ఏం జరుగుతుందో..!