కాజీపేటలో భారీగా పట్టుబడిన నగదు

 

పోలింగ్ కి సమయం తగ్గే కొద్దీ నోట్ల కట్టలు భారీగా బయటపడుతున్నాయి. తాజాగా వరంగల్‌లోని కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి భారీ ఎత్తున నగదు పట్టుబడింది. వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థి పి.దేవయ్యకు సంబంధించిన ఈ మొత్తాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌ దృవీకరించారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్‌కు చెందిన ప్రావిన్స్‌రెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని విచారించారు. అతడి వద్ద ఉన్న ఓ కవర్‌తో పాటు, రూ.2లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.3,59,19,250 మొత్తాన్ని కాంగ్రెస్‌ నాయకుడు అమృతరావు ఇంటికి ఎదుగా ఉన్న ఓ ఇంట్లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును సులువుగా పంపిణీ చేసేందుకు వీలుగా రూ.2లక్షలు చొప్పున ఒక కవర్‌లో ప్యాక్‌ చేసే దానిపై అందాల్సిన కార్యకర్త, గ్రామం పేర్లు రాశారని రవీందర్‌ తెలిపారు. డబ్బుతో పాటు ఇటీవల బహిరంగ సభ కోసం ఆన్‌లైన్‌లో కూటమి అభ్యర్థి దేవయ్య చేసుకున్న దరఖాస్తును పోలీసులు గుర్తించారు.