తెల్లారితే కొడుకు పెళ్లి..కానీ పసి ప్రాణం కోసం

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ..తెల్లారితే ఆయన ముద్దుల కొడుకు పెళ్లి..తన దర్పం తెలిసేలా అంగరంగ వైభవంగా వివాహా ఏర్పాట్లు చేశాడు.. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. సరిగ్గా ముహుర్త సమయం దగ్గర పడుతుందనగా తన నియోజకవర్గంలో ఒక బాలుడు బోరుబావిలో పడ్డాడని వార్త. అటు చూస్తే కొడుకు పెళ్లి..ఇటు చూస్తే పసి ప్రాణం..రెండింటిలో ఏది ముఖ్యం..మామూలుగా అయితే పెళ్లి వేదిక వద్ద నుంచి అధికార యంత్రాంగాన్ని నడిపించవచ్చు..కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం పెళ్లి పనులను సైతం పక్కనబెట్టి హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. బోరుబావి వద్దే రాత్రంతా జాగారం చేసి అధికార యంత్రాంగంతో కలిసి దగ్గరుండి బాలుడిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు.

 

అతను ఎవరో కాదు..వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఆయన కొడుకు వివాహం ఇవాళ ఉదయం 8.30కి నిశ్చయించారు. బంధువులతో సరదాగా గడుపుతూ..వచ్చిన వారిని అప్యాయంగా పలకరిస్తున్న ఎమ్మెల్యే చెవిలో నిన్న సాయంత్రం ఓ వార్త పడింది. ఉమ్మడివరంలో చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడన్నది దాని సారాంశం. తెల్లారితే కుమారుడి పెళ్లి అయినా శుభకార్యాన్ని సైతం లెక్కచేయకుండా..పనులను బంధువులకు అప్పగించి తాను ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. అక్కడే మకాం వేసి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి వారిని ఘటనాస్థలికి రప్పించారు.

 

11 గంటల పాటు జోరు వానను సైతం లెక్కచేయకుండా శ్రమించి.. బోరుబావికి 30 అడుగుల మేర సమాంతరంగా గొయ్యి తవ్వించి బాలుడిని వెలికి తీశారు. దీంతో బిడ్డ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోన్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బాలుడు క్షేమంగా బయటపడిన తర్వాతే జీవీ ఆంజనేయులు ఇంటికి వెళ్లి పెళ్లి పనులను పర్యవేక్షించారు. పసివాడి ప్రాణం కోసం కుమారుడి పెళ్లిని సైతం లెక్కచేయకుండా రంగంలోకి దిగిన జీవీ ఆంజనేయులను ముఖ్యమంత్రి సహా ప్రజలు, టీడీపీ శ్రేణులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.