మత్తు యంత్రాల్నే వెంటిలేటర్లుగా వినియోగిస్తున్నారు!

అమెరికాలో కరోనా కాటుకు బుధ‌వారంనాడు 1973 మంది మృతి చెందారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,268. క‌రోనా కేసులు అంతకంతకు పెరిగిపోతుండటంతో అమెరికాలోని ఆస్పత్రుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటిలేటర్లను సత్వరమే సమకూర్చుకొనే అవకాశం లేకపోవడంతో మత్తు ఇచ్చే (అనస్థీషియా) యంత్రాలనే శ్వాస యంత్రాలుగా మార్చడం ప్రారంభించారు.

'శస్త్రచికిత్సల సమయంలో మత్తు అందించే అనస్థీషియా యంత్రాల్లో ఫ్లోమీటర్లు, ఆవిరి కారకాలు, కార్బన్‌డయాక్సైడ్‌ శోషకాలు, సంపీడనం చేసిన వాయువు మూలకాలు, యాంత్రిక వెంటిలేటర్‌ ఉంటాయి. ఇందులో శ్వాస అందించే సర్క్యూట్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే వెంటిలేటర్లుగా మార్చవచ్చు. అయితే ఈ పని అనస్థీషియా నిపుణుడి ఆధ్వర్యంలోనే జరగాలి. దాని పనితీరును, రోగి భద్రతను ఎప్పుడూ దగ్గరుండి పరిశీలిస్తుండాలి. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ప్రాణాలు నిలబెట్టేందుకు ఈ పరికరాన్ని వెంటిలేటర్‌గా మార్చి వినియోగిస్తున్నారు.