జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 18 మంది జవాన్లు మృతి

 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని పేలుడు పదార్థాలతో నిండిన కారు ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడి నుండి జవాన్లను కోలుకోనివ్వకుండా పేలుడు  జరిగిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు కూడా తెగబడ్డారు. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. ఓ బస్సు దగ్గరకు రాగానే ఉగ్రవాది కారుతో ఢీకొట్టాడు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు వల్ల ఆ ప్రాంతమంతా తెగిపడిన శరీర అవయవాలతో రక్తమోడింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్‌ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్‌ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఇది ఈ 15 ఏళ్లలో జరిగిన అతిపెద్ద దాడిగా మిలటరీ వర్గాలు చెబుతున్నాయి.