టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం.. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు జంప్

 

సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు హస్తం గుర్తుపై గెలిచారు. ఇప్పటికే ఆ 19 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. తాజాగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్ లో చేరికపై చర్చించారు. దీంతో సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు అవసరమై మెజార్టీ సమకూరింది.

సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. ఇక 18 మంది ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతులంటే 12 మంది సంఖ్యాబలం ఉంటే చాలు. ఈ నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో  కూడిన లేఖను సభాపతికి అందజేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ బలం ఆరుకు పడిపోయింది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది.