మోక్షం...మూఢనమ్మకం..11 మంది ఆత్మహత్య

దేశం పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నామూఢనమ్మకాలను మాత్రం వీడట్లేదు..దేశ రాజధాని దిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది విగతజీవులై కన్పించిన ఘటన ఈ ఏడాది జులైలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మానసిక శవపరీక్ష నిర్వహించాలని దిల్లీ పోలీసులు సీబీఐని కోరారు. తాజాగా ఈ నివేదికను సీబీఐ పోలీసులకు అందించింది. ఈ నివేదిక ద్వారా వారంతా మానసికంగా ఆత్మహత్యలకు పాల్పడలేదని తెలిసింది. క్రతువులో భాగంగానే ఉరివేసుకున్నారని, మృతుల్లో ఏ ఒక్కరికీ చనిపోవాలన్న ఉద్దేశం లేదని నివేదిక పేర్కొంది. మృతుల ఇంట్లో లభించిన డైరీలు, స్నేహితులు, బంధువులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు.బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్‌ దేవీ(77), ఆమె 10 మంది కుటుంబసభ్యులు జులై 1న విగతజీవులుగా కన్పించారు. 10 మంది మృతదేహాలు ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఉండగా.. నారాయణ్‌ దేవీ మృతదేహం మరో గదిలో కిందపడి ఉంది. మృతుల కళ్లకు గంతలు, చేతులు వెనక్కి కట్టి ఉండటాన్ని చూసి తొలుత పోలీసులు సామూహిక హత్యగా భావించారు. అయితే ఆ తర్వాత ఇంట్లో దొరికిన డైరీల ఆధారంగా వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.నారాయణ్‌ దేవీ కుమారుడైన లలిత్‌ గత కొంతకాలంగా చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నాడని, ఆయన ఆదేశాలను పాటించాలని కుటుంబసభ్యులతో చెప్పినట్లు విచారణలో తెలిసింది. మోక్షం పొందే క్రమంలో భాగంగా ఆ రోజు రాత్రి వారు ఆత్మహత్య క్రతువు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది.