సిద్దిపేటలో రూ.10 చీరల కోసం తొక్కిసలాట

 

సిద్దిపేట పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద శనివారం తొక్కిసలాట జరిగింది. ప్రత్యేక ఆఫర్‌ పేరిట రూ.10కే చీర అని మాల్ యాజమాన్యం ప్రకటించడంతో.. సిద్దిపేటతో పాటు పక్క గ్రామాల నుండి కూడా భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. దీంతో షాపింగ్‌మాల్‌ ఆవరణమంతా మహిళలతో కిక్కిరిసిపోయింది. షాపింగ్‌ మాల్‌ సెల్లార్లో చీరల విక్రయం చేపట్టగా మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అదే సమయంలో షట్టరు తెరవడంతో ఒక్కసారిగా బయటి మహిళలు లోపలికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది  మహిళలకు గాయాలయ్యాయి. ఇదే ఘటనలో ఒక చోరీ కూడా జరిగింది. నంగునూరు మండలం తిమ్మాయపల్లికి చెందిన ఊర్మిళ అనే మహిళ బ్యాగులోని ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 వేలు నగదు, ఏటీఎం కార్డు చోరీకు గురయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు షాపింగ్‌మాల్‌కి చేరుకొని పరిశీలిస్తున్నారు.