రష్యా వ్యాక్సిన్ తో కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఊహించినవే

ప్రపంచం మొత్తం కరొనాతో సతమతమవుతోంది. ఒక్క మనదేశంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా అర కోటి.. అంటే 50 లక్షలకు చేరాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v" ను రిజిస్టర్ చేసిన రష్యా తాజాగా దీని పై జరిగిన ట్రయల్స్ ఫలితాలను రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మురష్కో ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయని అయన చెప్పారు. అయితే ఈ సైడ్ ఎఫెక్స్ అన్నీ తాము ముందుగా ఊహించినవేనని అంతేకాకుండా అవి సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో తగ్గి పోతాయని అయన తెలిపారు.

 

ఇది ఇలా ఉండగా తమ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఈమధ్య ప్రకటించింది . దాదాపు 40 వేల మందికి ఈ టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పటికే 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇవ్వగా మరో డోసు 21 రోజుల తరువాత ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ల కోసం ఒక యాప్‌ను రూపొందించారు. ఒక వేళ ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కోసం 55 వేల మంది వాలంటీర్లు ముందుకు రాగా వీరిలో 40 వేల మందిని ఎంపిక చేసి వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు అక్టోబర్ నవంబర్ మధ్య వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకపక్క మూడో దశ ట్రయల్స్ జరుగుతుండగానే రష్యాలో ప్రజలందరికి నవంబర్ చివరి నుండి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.