జగన్ రాంగ్ స్టెప్..రాజశేఖర్‌ చేతిలో వైసీపీ గెలుపు

 

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీకి బ్రహ్మరథంపట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మంత్రి పుల్లారావు వ్యవహారశైలిని తప్పుపడుతూ.. ఆయన కుటుంబ జోక్యంపై నిరసన వ్యక్తం చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుకూలంగా మలచుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ నానా తంటాలు పడ్డారు. పుల్లారావు మళ్లీ ఎన్నికల్లో గెలుస్తారా? గెలవరా? ఒకవేళ ఆయన గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడతారు తప్ప ఇదివరకటి మెజార్టీ రాదని స్థానిక నేతలు భావించారు. అయితే వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకప్పుడు టీడీపీలో హడావుడి చేసి సంచలనం సృష్టించిన రజనిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆమెను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించడంతో వైసీపీలో ముసలం ఏర్పడింది. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా రజని విజయం సాధించలేరు. కానీ మర్రి రాజశేఖర్‌ ఆమెకు సంపూర్ణ మద్దతు ఇచ్చి.. ఆమెతో కలసి ప్రచారం చేస్తే.. మంత్రి పుల్లారావు గెలుపుకి గండిపడే అవకాశముందని అంటున్నారు స్థానిక నేతలు. అంటే రజిని గెలుపు మర్రి రాజశేఖర్‌ చేతుల్లో ఉందన్నమాట.

 


ఇదే పుల్లారావుపై చిలలూరిపేట ప్రజలు ఇండిపెండెంట్‌గా గెలిపించారు. అప్పట్లో తాను గెలుస్తానంటే ఏ ఒక్కరూ నమ్మలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి పదివేల ఓట్లు మాత్రమే వచ్చాయని.. ఇప్పుడు తాను మరో నిర్ణయం తీసుకుంటే 2004 ఫలితాలు వస్తాయని అంటున్నారు  మర్రి రాజశేఖర్‌. నిజాయితీపరుడు అయిన మర్రి రాజశేఖర్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఫలితాలు వేరేలా వస్తాయని టీడీపీ అభిమానులు కూడా భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు సొమ్ము లేనంత మాత్రాన ఎన్నికల్లో విజయం సాధించలేరా? ఎందుకు జగన్‌ రజనీని అభ్యర్థిగా నిర్ణయించారని వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రజనీకి పూర్తి సహకారం ఇచ్చి మర్రి రాజశేఖర్‌ పనిచేస్తే మంత్రి పుల్లారావుకు ఓటమి తప్పదు. ఒకవేళ రాజశేఖర్‌ మనస్ఫూర్తిగా పనిచేయాలని భావించినా.. ఆయనను అభిమానించే ఓటర్లు ఎంత వరకు రజనీ కోసం పనిచేస్తారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో మర్రి రాజశేఖర్‌ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. మంత్రి పుల్లారావు, ఆయన కుటుంబ సభ్యులపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు తాజాగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను చూసి వారు మౌనం వహిస్తున్నారు. ఏది ఏమైనా మర్రి రాజశేఖర్‌ తీసుకునే నిర్ణయంపై రజనీ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.